mt_logo

సైబర్ నేరాల అదుపుకు తెలంగాణ పోలీసుల ప్రత్యేక ‘సైకాప్స్’ సత్ఫలితాలు

బ్యాంక్‌ ఖాతాలు లూటీ చేస్తున్న సైబర్‌ నేరగాళ్ల ఆటకట్టించేందుకు తెలంగాణ ఇంటెలిజెన్స్‌ పోలీసులు రూపొందించిన సైబర్‌ క్రైం ఎనాలసిస్‌ అండ్‌ ప్రొఫైలింగ్‌ సిస్టం (సైకాప్స్‌) సత్ఫలితాలనిస్తోంది. కేంద్రం తీసుకొచ్చిన సిటిజన్‌ ఫైనాన్సియల్‌ సైబర్‌ ఫ్రాడ్‌ రిపోర్టింగ్‌ అండ్‌ మేనేజ్‌మెంట్‌ సిస్టం (సీఎఫ్‌సీఎఫ్‌ఆర్‌ఎంఎస్‌) ఆధారంగా తెలంగాణ పోలీసులు రూపొందించిన ఈ టెక్నాలజీని తెలంగాణతోపాటు మరో ఎనిమిది రాష్ట్రాలు వినియోగిస్తున్నాయి. ఇప్పటికే సైకాప్స్‌లో దేశవ్యాప్తంగా ఉన్న 3,13,006 మంది సైబర్‌ నేరగాళ్ల ప్రొఫైల్స్‌ను నిక్షిప్తం చేశారు. వీరిలో 2,952 మందిని వివిధ రాష్ట్రాల పోలీసులు అరెస్టు చేశారు. సైబర్‌క్రైం టోల్‌ఫ్రీ నంబర్‌ 15260, డయల్‌ 100, డయల్‌ 112 ద్వారా నమోదవుతున్న సైబర్‌ నేరాలతో పాటు నేషనల్‌ సైబర్‌ క్రైం రిపోర్టింగ్‌ పోర్టల్‌ (ఎన్సీఆర్పీ) డాటాను సైకాప్స్‌లో రోజువారీగా అప్‌డేట్‌ చేస్తున్నారు.

సైబర్‌ నేరగాళ్లు ఏ నంబర్‌ నుంచి ఫోన్‌ చేశారు ? కొట్టేసిన డబ్బును ఏ ఖాతాల్లోకి మళ్లించారు ? బాధితులను ఎలా మోసం చేశారు ? తదితర విషయాలను తెలంగాణ ఇంటెలిజెన్స్‌ సైబర్‌సెల్‌ ప్రతిరోజూ సేకరిస్తున్నది. దీని ఆధారంగా తెలంగాణ పోలీసులు జాతీయ స్థాయిలో సైబర్‌ నేరగాళ్ల డాటాను నిక్షిప్తం చేశారు. ఇందుకు సైబరాబాద్‌ పోలీస్‌ కమిషనరేట్‌ కేంద్రంగా పనిచేసేలా తెలంగాణ సైబర్‌ క్రైం కోఆర్డినేషన్‌ సెంటర్‌ (టీ4సీ) వ్యవస్థను రూపొందించారు. దేశవ్యాప్తంగా పట్టుబడ్డ 120 మంది సైబర్‌ నేరగాళ్ల నుంచి సేకరించిన సమాచారంతో, అప్పటికే నిక్షిప్తం చేసిన డాటా సహకారంతో దేశవ్యాప్తంగా 28 వేల సైబర్‌ క్రైం కేసులను ఛేదించడం విశేషం. సైబర్‌ నేరగాళ్ల అరెస్టులకు సంబంధించిన సమాచారాన్ని ఎప్పటికప్పుడు ఇతర రాష్ట్రాలతో పంచుకొంటున్నారు. దీంతో మరికొన్ని కేసుల్లో వారిని అరెస్టు చేయడమే కాకుండా నెలల తరబడి జైళ్లల్లో ఉంచగలుగుతున్నారు.

రియల్‌టైంలో హాట్‌స్పాట్స్‌ గుర్తింపు

సైకాప్స్‌ టెక్నాలజీతో సైబర్‌ నేరగాళ్ల డాటాను సేకరించి, క్రోడీకరించి, రియల్‌ టైమ్‌లో వారు తిష్ఠవేసిన ప్రాంతాలను గుర్తించి, వాటిని హాట్‌స్పాట్స్‌గా మ్యాపింగ్‌ చేస్తున్నారు. ఇందులో సైబర్‌ నేరం జరిగిన ప్రదేశానికి నీలం రంగు కోడ్‌, అరెస్టయిన కేసులకు ఎరుపు రంగు కోడ్‌ ఇస్తున్నారు. ఇతర రాష్ట్రాల పోలీసులు సైతం సైక్యాప్స్‌లో లాగిన్‌ అయి, హాట్‌స్పాట్‌ల సమాచారాన్ని తెలుసుకోవచ్చు. సైబర్‌ నేరగాళ్లు ఉంటున్న ఆయా ప్రాంతాలపై నిఘా పెట్టవచ్చు. హాట్‌స్పాట్‌పై క్లిక్‌ చేయగానే ఏ నేరస్థుడు, ఏ ఫోన్‌ నంబర్‌ ద్వారా మోసం చేశాడు ? ఏ రాష్ట్రంలో, ఏ ప్రాంతంలో కేసు నమోదైంది ? తదితర వివరాలు తెలుస్తాయి. దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లోని సైబర్‌ నేరాలు జరుగుతున్న హాట్‌స్పాట్స్‌ డాటాను తెలంగాణ ఇంటెలిజెన్స్‌ విభాగం ఇప్పటికే రూపొందించింది. ఇందులో ఇతర రాష్ట్రాల పోలీసులు సైతం తమకు అంది న సమాచారాన్ని అప్‌డేట్‌ చేసే అవకాశం కల్పించారు.

సైకాప్స్ ద్వారా ఇప్పటి వరకు పొందిన సత్ఫలితాలు :

గత 6 నెలల్లో ఆర్థిక మోసాలపై 45,893 ఫిర్యాదులు రాగా, కేవలం తెలంగాణ రాష్ట్రం నుండే బాధితులు పోగొట్టుకున్న సొమ్ము దాదాపు 96 కోట్లుగా గుర్తించారు. వీటిలో 6 కోట్లు బ్యాంకు ఖాతాల నుండి పోకుండా ఆపగలిగారు. దాదాపు రెండు వేల సైబర్ నేరగాళ్ల బ్యాంకు ఖాతాలు ఫ్రీజ్ చేశారు. తెలంగాణ పోలీసులు రూపొందించిన ఈ సైకాప్స్ ను యూపీ, ఒడిశా, కేరళ, మహారాష్ట్ర, రాజస్థాన్, ఢిల్లీ, తమిళనాడు, జార్ఖండ్ రాష్ట్రాలు ఇప్పటికే ఉపయోగిస్తున్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *