mt_logo

రైతుబంధు వ్యవసాయ చరిత్రలో సువర్ణ అధ్యాయం : టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్

తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రైతుబంధు పథకం ద్వారా 50 వేల కోట్లు రైతుల ఖాతాల్లో జమ చేసిన సందర్భంగా టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కే. తారకరామారావు సోమవారం ప్రగతి భవన్ లో ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా కేటీఆర్ సుదీర్ఘంగా ఉపన్యసించారు. “ఈ రోజు తెలంగాణ చరిత్ర లొనే కాదు స్వాతంత్ర భారత చరిత్ర లో సువర్ణాక్షరాలతో లిఖించదగ్గ రోజు. రైతు బంధు ద్వారా 50 వేల కోట్లు రైతుల ఖాతాలో జమ చేయడం ఒక సాహసం. కేసీఆర్ మహా సంకల్పానికి శిరస్సు వహించి నమస్కరిస్తున్నాం. వ్యవసాయ చరిత్రలో ఇదొక సువర్ణ అధ్యాయం. టీఆర్ఎస్ అంటేనే తెలంగాణ రైతు సర్కార్. 65 లక్షల రైతుల కుటుంబాలు మరియు 60 లక్షల టీఆర్ఎస్ కార్యకర్తల తరపున సీఎం కేసీఆర్ కు ధన్యవాదాలు. కరోనా నిబంధనలను పాటిస్తూ అన్ని వర్గాలు కేసీఆర్ పట్ల కృతజ్ఞతలు ప్రకటిస్తున్నందుకు ధన్యవాదాలు. ఈ సంబరాలను సంక్రాంతి దాకా పొడగిస్తున్నాం. ఒకవైపు రైతులకు ఇంత మేలు జరుగుతుంటే మరోవైపు కొందరు పొలిటికల్ టూరిస్ట్ లు రాష్ట్రానికి వచ్చి ఎదో మాట్లాడుతున్నారు. ఒకప్పుడు ఉమ్మడి రాష్ట్రంలో రైతులకు అన్నీ కష్టాలే. అప్పటి ఆంధ్రప్రదేశ్ వరస క్రమంలో మొదటి స్థానమే కాదు.. రైతుల ఆత్మహత్యల్లో కూడా మొదటి స్థానం. దిగుబడుల్లో చివరి స్థానం. అప్పటికీ ఇప్పటికీ పరిస్థితి ఎంత మారిందో తెలంగాణ ప్రజలు గుండె మీద చేయి పెట్టుకుని ఆలోచించాలి. అపుడు ఊర్లకు ఊర్లె వల్లకాడుగా మారాయి. ఉద్యమంలో రైతుల దుస్థితి చూసి కేసీఆర్ చలించిన సందర్భాలు ఎన్నో. అపుడు కరెంటు లేదు, పెట్టుబడి సాయం లేదు, పంట దిగుబడులు లేవు. మీడియాలో అపుడు రైతుల దుస్థితి గురించి వచ్చిన కథనాలు చూస్తే ఇపుడు పరిస్థితి ఎంత మారిందో అర్థమవుతుంది. వలసల దుస్థితి అంతరించింది. రైతుల దర్జా పెరిగింది. భూముల ధరలు, రియల్ ఎస్టేట్ బాగా పెరిగాయి. తెలంగాణ వ్యవసాయ రంగంలో సాధించిన విజయాలు ట్రైనీ ఐఎస్ లకు పాఠ్యంశాలు గా మారాయి. కోటి ఎకరాల మాగాణే కాదు. ముక్కోటి టన్నుల ధాన్యగారంగా తెలంగాణ మారింది. ఎఫ్.సీ.ఐ. గోడౌన్లలో పట్టనంత ధాన్యం తెలంగాణ నుంచి వస్తోంది. వ్యవసాయానికి కేసీఆర్ ఇచ్చిన ఊతమే రైతు జీవితాలను మార్చింది నిజం కాదు. రైతు బంధు పెట్టుబడి సాయం కాంగ్రెస్ నేతల అకౌంట్లలో పడటం లేదా.? కావాలంటే నా దగ్గర రికార్డులు ఉన్నాయి. వేరే రాష్ట్రాలు కూడా రైతు బంధును అనుసరిస్తున్నాయి. 50 వేల కోట్ల ముల్లె ప్రతి పల్లెను చేరింది. ఆసరా పెన్షన్లను విమర్శించే రాజకీయ నాయకుల తల్లిదండ్రులు దాన్ని తీసుకోవడం లేదా.? నాలుగు లక్షల మంది రైతుల రుణాలు మాఫీ చేశాము. మిగతాది దశల వారీగా చేస్తాం. కాంగ్రెస్ రెండు లక్షల రుణాల మాఫీ చేస్తామన్న ప్రజలు నమ్మకుండా మాకే రెండో సారి అధికారాన్ని కట్టబెట్టారు. రైతు బీమా రైతుకు రక్షణ కవచంగా మారింది. రైతు బీమాతో కేసీఆర్ రైతులకు అన్నగా మారారు. రైతు బీమాకు 3205 కోట్ల మేర ప్రీమియం కట్టాం. 70 వేల మంది రైతులకు రైతు బీమాతో ప్రయోజనం జరిగింది. ఇలాంటి పథకం ప్రపంచంలో ఎక్కడా లేదు. కేంద్రం నుంచి అరపైసా సాయం లేకున్నా కాలంతో పోటీ పడి కాళేశ్వరం ప్రాజెక్టు కట్టాం. 70 యేండ్లలో ఇంత త్వరితగతిన ప్రాజెక్టు కట్టిన సందర్భం ఏది లేదు. జాతీయ పార్టీలకు మమ్మల్ని విమర్శించే మొహం ఉందా ? ఎక్కడైనా ఇంత వేగంగా ప్రాజెక్టు కట్టారా ? కాళేశ్వరం, పాలమూరు, రంగారెడ్డి ప్రాజెక్టులు కేసీఆర్ కు రెండు కండ్లు. పాలమూరు ప్రాజెక్టు దక్షిణ తెలంగాణకు వరప్రదాయిని అయితే కాళేశ్వరం ఉత్తర తెలంగాణకు ఊపిరి. పాలమూరు ప్రాజెక్ట్ కొందరు దుర్మార్గుల కోర్టు కేసులతో కొంత ఆలస్యంవుతోంది అయినా పూర్తి చేస్తాం. పాలమూరు బీడు భూములకు ఖిల్లాగా ఉండేది. ఇపుడు చేపల చెరువులకు అడ్డాగా మారింది. కేసీఆర్ వ్యవసాయానికి దిక్సూచిగా మారారు. నదులకు నడక నేర్పిన గొప్ప నాయకుడు. మా ప్రభుత్వ విధానాలు ఇతర పార్టీలకు ఎన్నికల నినాదాలుగా మారాయి. ప్రాథమిక రంగాల్లో తెలంగాణ వృద్ధి రేటు 8 శాతానికి పెరిగింది తెలంగాణ ఏర్పడినపుడు అది1.8 శాతమే. తెలంగాణ జీ.ఎస్.డి.పి పెరగడానికి రైతన్నల భాగస్వామ్యం ఎంతో ఉంది. రైతు బంధు సమితులు రైతు వేదికలు ఏర్పాటు చేసి అన్నదాతాల్లో విశ్వాసం నింపాము. లక్ష రైతు కల్లాలు ఏర్పాటు చేశాం. మండు వేసవిలోనూ తెలంగాణలో చెరువులు మత్తడ్లు దుంకుతున్నాయి. తెలంగాణలో హార్వెస్టర్ల, ట్రాక్టర్ల సంఖ్య ఎన్నో రేట్లు పెరిగింది. ఐదు విప్లవాల ముంగిట తెలంగాణ ఉంది. సస్య విప్లవం,వ్యవసాయ విప్లవం గులాబీ విప్లవం(పశు సంపద అభివృద్ధి),శ్వేత విప్లవం, నీలి విప్లవం గట్టిగా అమలు చేస్తున్నాం. వ్యవసాయం అనుబంధ విభాగాలకు 2 లక్షల 71 వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాం. మేము శ్వేత పత్రాలు ఇస్తున్నాం నల్ల చట్టాలు కాదు. రాజకీయ పర్యాటకులు వస్తే అభ్యంతరం లేదు. తెలంగాణ పర్యాటక రంగానికి అది మేలు చేస్తుండొచ్చు. ఇష్టమొచ్చినట్టు మాట్లాడటం కాదు. గణాంకాలు ఉంటే చెప్పండి. ఎన్.డి.ఏ. ప్రభుత్వం అంటే నో డేటా ఆవేలేబుల్ ప్రభుత్వం. మా కంటే ఎక్కువ రుణ మాఫీ చేసిన రాష్ట్రం ఏదైనా ఉంటే చెప్పండి. నేను తెలంగాణ భవన్ వేదికగా సవాల్ విసురుతున్నా… దమ్ముంటే రైతులకు వేరే రాష్ట్రాల్లో ఇంత మేలు ఏదైనా చేశారో చెప్పండి. చర్చకు నేను సిద్ధంగా ఉన్నాను.” అని అన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *