mt_logo

సారీ.. ఔట్‌డేటెడ్!

By: సవాల్‌రెడ్డి

ప్రజలు కరెక్టుగానే ఉన్నారు. లేనిదల్లా పార్టీలు.. వాటి కాలం చెల్లిన ఆలోచనా ధోరణి మాత్రమే. ఇదే కేసీఆర్ విషయమే తీసుకుంటే 2001లో తెలంగాణ సాధన అన్నారు. 14 ఏండ్లూ ఆ వాదనను పక్కదారి పట్టించలేదు. సభలైనా.. పోరాటాలైనా.. ఎన్నికలైనా ఏకైక ఎజెండా అదే. ఓ దశలో 610 జీవో అంశం మీద కూడా తెలంగాణ వస్తుంటే ఈ సమస్య అవసరమేముందని కూడా పక్కన పెట్టారు. ఉద్యమాలు పుస్తకాల పుటల్లోంచి పుట్టుకురావు. అసాధ్యమనుకున్న తెలంగాణ సుసాధ్యం చేసిన వైనమే దానికి ఉదాహరణ.

తమ పార్టీ సభ్యులతో కలిసి వాకౌట్ చేస్తూ రెండడుగులు వేసిన నాయకుడు వెనక్కి తిరిగి మా ప్రొటెస్ట్ రిజిస్టర్ అయిందా? అని సభాధ్యక్షుడిని అడిగి.. సంతృప్తి చెంది; ఆ తర్వాత సభ నుంచి నిష్క్రమించిన దృశ్యమొకటి.. తెలంగాణ ప్రజల మస్తిష్కంలో ఇంకా పదిలంగానే ఉంది. అది ఆషామాషీ సందర్భం కాదు. నాలుగు కోట్లమంది తెలంగాణ ప్రజలు గుండె అరచేత పట్టుకుని టీవీ స్క్రీన్లను రెప్ప వాల్చకుండా ఊపిరి బిగపట్టి చూస్తున్న సందర్భం. తెలంగాణ బిల్లు రాజ్యసభలో చిట్టచివరి అగ్నిపరీక్షను ఎదుర్కుంటున్న వేళ. బీజేపీ ప్లేటు ఫిరాయించిందని, వెంకయ్య అడ్డుపడుతున్నాడని బిల్లు పాసయ్యే అవకాశాలు తగ్గిపోయాయని ఇలా రకరకాల వదంతుల నడుమ కోట్ల మంది ప్రజలు ఈ గండం దాటించి బిల్లు పాస్ చేయ్యి దేవుడా! అంటూ మనసులోనే మూగప్రార్థనలు చేసుకుంటున్న సమయం.

టీడీపీ, కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్ సభ్యులు పోడియంలో చేరి గోలగోల చేస్తూ బిల్లుకు అడ్డుపడుతుంటే ఈ గండం నుంచి బయటపడతామా? అనే శంక అందరినీ వేధిస్తున్న తరుణం. ఎవరెవరో లేస్తున్నారు. ఏదేదో మాట్లాడుతున్నారు. ఒకరు మద్దతు.. ఒకరు వ్యతిరేకం.. ఏమవుతుందో తెలియని అయోమయం. సరిగ్గా అలాంటి తరుణంలో కోట్లాదిమంది ప్రజల మనోభావాలను నిర్దాక్షిణ్యంగా విస్మరించి తెలంగాణ బిల్లు ప్రవేశపెట్టినందుకు నిరసనగా సభ నుంచి వాకౌట్ చేసిన ఆ మహానాయకుడు సీతారాం ఏచూరి! ఆ చరిత్రాత్మక పార్టీ సీపీఐ(ఎం). అంతకుముందు ఆయన వంతు ప్రసంగం వచ్చినపుడూ అంతే. ఈ బిల్లును లోక్‌సభకు వెనక్కి పంపాలని చాలా గట్టిగా డిమాండ్ చేశారు. ఆయన ప్రసంగం యావత్తూ తెలంగాణకు వ్యతిరేకంగా సాగింది. ఈ బిల్లు(తెలంగాణ బిల్లు)ను మేం తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. వెంకయ్యనాయుడు గారు మేంకూడా సమర్థిస్తున్నామని తప్పుగా చెప్పారు. దయచేసి అది రికార్డుల్లోకి వెళ్లకూడదు.

సీపీఐ(ఎం) ఏనాడూ తెలంగాణ ఏర్పాటును సమర్థించలేదు. ఈ విభజన దేశానికి తీవ్రమైన ప్రమాదం. తీవ్ర సమస్యగా మారుతుంది. పొట్టి శ్రీరాములు విశాలాంధ్ర(?) కోసం చేసిన ప్రాణత్యాగంతో భాషా ప్రయుక్త రాష్ట్రాలు ఏర్పడ్డాయి. ఆంధ్రప్రదేశ్‌ను చూసి మహాగుజరాత్, ఐక్య కేరళ వంటివి వచ్చాయి. ఇవన్నీ ఆంధ్రప్రదేశ్ వల్లనే వచ్చాయి. అలాంటి ఆంధ్రప్రదేశ్‌ను ఈరోజు విభజిస్తున్నారు. ఇది దేశానికి ప్రమాదకరం అన్నారు. తన ప్రసంగంలో గురజాడ అప్పారావు రాసిన దేశమంటే మట్టి కాదోయ్ దేశమంటే మనుషులోయ్ పద్యాన్ని తెలుగులోనే చదివారు. దాని అర్థం ఇంగ్లీషులో సభికులకు విడమరిచి చెప్పారు.

చివరాఖరుకు ఈ బిల్లును లోక్‌సభకు తిప్పికొట్టాలి అని తమ పార్టీ డిమాండ్ ను వినిపించారు. సందర్భంగా చెప్పారో అసందర్భంగా చెప్పారో ఆ గందరగోళంలో అర్థం చేసుకోవడం కష్టం కానీ.. దేశమంటే మట్టి కాదు మనుషులు అని చెప్పిన ఏచూరికి తెలంగాణలో కోట్లమంది మనుషులు ఉన్నారని వారు తెలంగాణ కోరుకుంటున్నారని గుర్తుకు రాలేదు.

ఏడాదిన్నర తర్వాత.. ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా కావాలని డిమాండ్ చేస్తూ వైఎస్సార్సీపీ ఢిల్లీలోని జంతర్‌మంతర్‌లో ధర్నాకు దిగింది. జంతర్‌మంతర్ చేరుకున్న ఏచూరి ఏపీకి ప్రత్యేక హోదా అంశానికి మద్దతు ఇచ్చారు. మీ డిమాండ్‌కు మార్క్సి స్టు పార్టీ తరపున మాత్రమే కాకుండా.. వ్యక్తిగతంగా నా తరఫు నుంచి సమర్థించడానికి మీ ముందర ఉన్నాను. గతంలో ఏపీ విభజన చట్టం తీసుకువచ్చినపుడు పార్లమెంటులో మా పార్టీ ఒకటే వ్యతిరేకించింది. ఈ విభజన వల్ల కొత్త సమస్యలు తీసుకువస్తున్నారు. విభజన చెయ్యొద్దు అని వాదించాం. స్పెషల్ స్టేటస్ పై కేంద్రం జోక్యం చేసుకోవడం లేదు. మీతో పాటు కలిసి మన స్పెషల్ స్టేటస్ కోసమని.. మేమందరం.. మన అందరం కలిసి పోరాడుదామని ఆ సంకల్పం.. ఆ వాగ్దానం మీ ముందు చేయడానికి నేనొచ్చాను. పార్లమెంటులో కానివ్వండి లేదా బయట రోడ్డు మీద కానివ్వండి.. ఈ ఉద్యమం మనది. మన రాష్ట్రం కోసమిది. జగన్‌కి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి ఈ విషయంలో మా సమర్థన పూర్తిగా ఉంది ఇదీ ఏచూరి ప్రసంగం. తెలంగాణ బిల్లు సమయంలో ఇక్కడి ప్రజలు గుర్తుకు రాలేదు.

తెలంగాణ అంటే గురజాడ పద్యంలోని మట్టి మాత్రమే సీపీఎంకు కనిపించింది. ఆ మట్టిని విభజించడం దేశానికి ప్రమాదంగా కూడా కనిపించింది. కానీ ఏపీ ప్రత్యేకహోదా దగ్గరికి వచ్చే సరికి మన స్పెషల్ స్టేటస్ అయిపోయింది. తెలంగాణ ఉద్యమంలో పాల్గొనేందుకు సీపీఎంకు మనసు రాలేదు కానీ.. ఏపీకి ప్రత్యేకహోదా అనేసరికి మన ఉద్యమం అయిపోయింది. అంటే ఇక్కడ గురజాడ పద్యంలో మనుషులు కనిపించారన్న మాట. సరిగ్గా ఈ నాయకుడే ఈ మధ్యే హైదరాబాద్‌కు వచ్చి.. గుజరాత్‌లో పటేల్ తరహా ఉద్యమం తెలంగాణలో కూడా వస్తుందని ఆశీర్వదించారు. వస్తేగిస్తే కాపుల సమస్య ఉంది కాబట్టి ఏపీలో రావాలి గానీ తెలంగాణలో ఎందుకు వస్తుందో మనకు తెలియదు. ఏతావాతా తేలేదేమంటే సీపీఎం కావచ్చు.. సీతారాం ఏచూరి కావొచ్చు వాళ్ల డీఎన్‌ఏలో తెలంగాణకు తావు లేదు. ఆంధ్ర ప్రయోజనాల ఆరాటం తప్ప!

2002లో అనుకుంటా.. వీళ్లను(తెలంగాణ వాదులు) ఎలా ఎదుర్కోవాలో మాకు తెలుసు.. గుత్పలోల్లు అనేటోల్లు వీళ్లను. ఓసారి సూర్యాపేటకు ఈ పోరగాండ్లు వస్తే ఖమ్మం దాకా తరిమి కొట్టినం అని చెప్పుకున్నారు ఆనాటి సీపీఎం అనుబంధ సంస్థ అధ్యక్షుడు, ఆ తర్వాత రాజ్యసభ సభ్యుడైన మధు. 1969 తెలంగాణ ఉద్యమంలో తెలంగాణవాదులను సీపీఐఎం కార్యకర్తలు ఎలా తరిమి కొట్టిందీ ఎంతగా చితకబాదిందీ… చాలా గొప్పగా చెప్పుకున్నారాయన. ఆ తర్వాత తెలంగాణ ఉద్యమం ఎప్పుడూ ఒకే కులానికి రాజ్యసభ సభ్యత్వాలు ఇస్తున్నారు అని సీపీఎంను ఎత్తిచూపడంతో రాఘవులుకు బదులు మధు రాజ్యసభ అభ్యర్థిగా ఎంపికయ్యాడు. ఆ తర్వాతా ఆయన తన వ్యతిరేకతను దాచుకున్న సందర్భాలు అంతగాలేవు.

సకల జనుల సమ్మె.. తెలంగాణ ఉద్యమంలో ఒక మహత్తర ఘట్టం. చరిత్రలో ఎక్కడా ఏనాడూ లేనట్టుగా బడి గుడి సహా సకలవర్గాలు ఒక్కతాటి మీద ఉద్యమానికి పూనుకున్న సమయం. మొత్తం తెలంగాణ ఒక్కవైపు నిలిచి పోరాడుతున్న వేళ. ఒక్క సీపీఎం తప్ప. ఉపాధ్యాయులు సమ్మెకు దిగారు. అన్ని ఉపాధ్యాయ సంఘాలు అందుకు అనుమతించాయి… ఒక్క యూటీఎఫ్ తప్ప. యూటీఎఫ్ బ్యానర్‌తో ఉద్యమంలోకి దిగితే సహించం అని ఖమ్మం జిల్లా నాయకుడొకరు బహిరంగంగానే హెచ్చరించాడు. చివరికి చుక్కా రామయ్య వంటి వారు డోంట్ కేర్ అంటూ ఉద్యమంలోకి రావడం వేరే విషయం. ఆనాటి సమ్మెలో కీలకపాత్ర పోషించింది సింగరేణి. ఖమ్మం జిల్లాలో మొదటి దెబ్బ పడింది. అందులో ఎవరి పాత్ర ఎంతో చెప్పే పనిలేదు. ఇక ఆర్టీసీలో జరిగిన వెన్నుపోట్ల సంగతి కూడా చెప్పనక్కరలేదు.

ఇంతాచేసి ఇవాళ తెలంగాణను నాశనం చేస్తుంటే ఊరుకోం.. అంటారు తమ్మినేని… అక్కడికి జూన్ 2న ఏర్పాటైన తెలంగాణ ప్రత్యేక రాష్ట్రనికి వీళ్లేదో మంత్రసానితనం చేసి ప్రసవంచేసినట్టు.. బొడ్డు కోసి పేరు పెట్టినట్టు..! తెలంగాణ రాష్ట్రం అనే అంశంతో ఏ రకమైన ప్రమేయం.. సంబంధం లేని సీపీఎం ఇవాళ తెలంగాణ భారాన్నంతా తానే నెత్తిన వేసుకున్నట్టు మాట్లాడుతున్నది. తాజెడ్డ కోతి వనమెల్లా చెరిచిందని ఇవాళ ఈ పార్టీ ముందుండి తెలంగాణ ప్రభుత్వాన్ని ఓడించడానికి మిగతా వామపక్షాలను కలుపుకుని వరంగల్ ఉప ఎన్నికలో ఉమ్మడి అభ్యర్థి కోసం వెంపర్లాడుతున్నది. తెలంగాణను వ్యతిరేకించిన ఈ ఒకే ఒక్క పార్టీ తెలంగాణకోసం పోరాటం చేసిన పార్టీలకు నాయకత్వం వహించి వాటికున్న పవిత్రతను కూడా నాశనం చేస్తున్నది.

ఒకనాడు మార్క్సిజం చదువుకో అంటూ ఒకరు.. కళ్లజోళ్లు మార్చుకో అంటూ మరొకరు వాదులాడుకున్న పక్షాలే ఇవన్నీ.. ఇక ఏచూరిగారు గుజరాత్ పటేల్ తరహా ఉద్యమం రావాలని కోరుకుంటే…ఇటీవల నిజామాబాద్‌లో జరిగిన రాష్ట్ర మహాసభలకు వచ్చిన రాఘవులు గారు సీఎం చైనా పర్యటన వేస్టు.. పెట్టుబడుల కలలు కల్లలవుతాయని తానూ యథాశక్తి ఆశీర్వదించారు. ఆయనే తన ప్రసంగంలో రాష్ట్రంలో ఉపాధి, మౌలిక వసతుల కల్పనను సర్కారు విస్మరిస్తున్నదని మరోసందర్భంలో విమర్శించారు. ప్రభుత్వరంగంలో ఉద్యోగాలు తరిగిపోతున్నందున ప్రైవేటు రంగంలో రిజర్వేషన్లు అమలు చేయాలంటూ తెలంగాణ రాష్ట తొలి మహాసభల సందర్భంగా సీపీఎం తీర్మానించింది.

ఎర్రటోపీలు పెట్టుకున్న నాయకులు చేతులు కలిపి మరీ ఆ తీర్మానానికి మద్దతు ప్రకటించారు. అదే నోటితో నిజామాబాద్ సభలో ప్రభుత్వం ప్రైవేటు పారిశ్రామికవేత్తలకు పెద్దపీట వేస్తున్నదని విమర్శలు చేశారు. ప్రైవేటు పరిశ్రమలే లేనపుడు అక్కడ ఉద్యోగాల్లో రిజర్వేషన్లు ఎలా అమలు చేయాలో మనకైతే తెలియదు. ఇక తెలుగు ప్రభుత్వాలు రాష్ట్రాలను ముందుకు తీసుకువెళ్లే పద్ధతులు అనుసరించడం లేదనీ రాఘవులు బాధ పడ్డారు. పశ్చిమ బెంగాల్‌ను సీపీఎం ఎంత ముందుకు తీసుకుపోయిందో ఆ వేగానికి సర్కారు అనే బస్సును కూడా సీపీఎం పార్టీ ఎలా మిస్సయిందో చూశాం. మరి అలాంటి స్పీడు ఇక్కడేమన్నా కావాలన్నది ఆయన ఆకాంక్షేమో తెలియదు.

గురువారం పాలకుర్తి సభలో సీపీఐఎం జాతీయ ప్రాంతీయ నేతలు చాలా చాలా మాట్లాడారు. మిగతావారి మాట ఎలా ఉన్నా బృందాకారత్ కేసీఆర్‌ది కుటుంబ పాలన అని నిర్ధారించారు. సరే.. స్వయంగా ఆమె పతీసమేతంగా పార్టీలో ఏకకాలంలో పదవుల్లో ఉన్నారా? లేదా? అనే విషయాన్ని.. అనేక ఏండ్లుగా రాఘవులు సతీసమేతంగా పార్టీని ఏలారా లేదా అనే విషయం పక్కన పెడదాం. అసలు కుటుంబ పాలన అంటే నిర్వచనం ఏమిటో తెలియాల్సి ఉన్నది. ఎపుడో స్వాతంత్య్రం వచ్చిన కాలంలో దాదాపు ఏకపార్టీ స్వామ్యం ఉన్న రోజుల్లో దేశంలో అక్షరాస్యత, సమాచారం అంతగా విస్తరించని కాలంలో కుటుంబ పాలన అనే పదానికి అర్థముంది. నెహ్రూ ఏకపక్షంగా కూతురుకు పదవి కట్టబెట్టడం.. ఆ తర్వాత ఇందిర హయాంలో సంజయ్ అనధికార పాలన వల్లా అది స్థిరపడి ఉంటుంది. కానీ జాతీయ, ప్రాంతీయ స్థాయిలో అనేక పార్టీలు బలోపేతమై అక్షరాస్యత, విద్య, సమాచార విప్లవాలు సాధించిన ఈ కాలంలో ఇంకా కుటుంబ పాలన అనే జిడ్డు సిద్ధాంతానికి విలువ ఉందా? అనేది ప్రశ్న.

యువరాజులకు ఎలాంటి అర్హతలు లేకున్నా కిరీటాలు తొడిగితే అది కుటుంబపాలన అవుతుంది కానీ బాజాప్తా ప్రజల దగ్గరికి వెళ్లి వారి ఓట్లతో ఒకటికి నాలుగుసార్లు ఎన్నికయ్యాక ఇంకా కుటుంబ పాలన ఏమిటనేది అర్థం కాని ప్రశ్న. ఒక నాయకుడి కుటుంబ సభ్యులు పదవులు పొందడం కుటుంబ పాలనే అయితే… మరి ఒక సామాన్యుడి కుటుంబంలో నలుగురు ఉద్యోగాలు పొందితే.. ఒక డాక్టర్ కుటుంబంలో నలుగురు డాక్టర్లే అయితే దాన్ని ఏమని పిలవాలి? కాలం మారిపోయి చాలా ముందుకు వెళ్లిన విషయాన్ని సీపీఎం గుర్తించినట్టు లేదు. ఇక రాష్ట్రంలో పార్టీ బలోపేతానికి సీపీఎం ఇంకా పాత ఎత్తుగడలే ఎంచుకుంటున్నదని మునిసిపల్ సమ్మె స్పష్టం చేసింది. సంఘటిత వర్గాలను ముందుపెట్టి అలివికాని డిమాండ్లు పెట్టడం ద్వారా ప్రభుత్వ వ్యతిరేకత ప్రోది చేయాలనేది పాతాళభైరవి కాలంనాటి చిట్కా. అది ఎదురుతిరిగి చివరకు ఎటువంటి ఒప్పందంతో ఎంత అవమానకరంగా ఆట ముగించాల్సి వచ్చిందో చూశాం.

వరంగల్ ఇండ్ల వ్యవహారంలో ఆ పార్టీ నాయకులు పేదల బతుకులో నిప్పులు పోయడమూ చూశాం. చాలా తమాషా అయిన మరో సంఘటన ఇటీవల ఇందిరా పార్కువద్ద కనిపించింది. దేవాలయ అర్చకుల దీక్షకు సీపీఎం నేతలు మద్దతు పలికి ప్రసంగాలు చేశారు. కానీ ఇవాళ దేవాలయాలు దివాళా తీయడానికి వామపక్షాలు దేవాలయ భూములను ఆక్రమించడమూ ఓ కారణమే. పేదలు ఆకలితో మాడుతుంటే దేవుడికి భూములెందుకంటూ వామపక్షాలు ఎక్కడ దొరికితే అక్కడ ఆలయమాన్యాలను ఆక్రమించిన విషయం ఈ తరానికి తెలియకపోవచ్చు. ఇవాళ ఆ ప్రభావం దేవాలయ అర్చకులు అనుభవిస్తున్నారు. వారి దుస్థితికి కారణమైన వారే అక్కడ ప్రసంగాలు చేస్తున్నారు. మరీ వింతైన విషయం ఏమిటంటే ఆ మధ్య జరిగిన వ్యవసాయ కార్మిక సంఘం ప్లీనరీలో ప్రభుత్వ స్థలాలు, దేవాదాయ, చెరువు, శిఖం భూములు ఆక్రమిస్తామని స్వయానా సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వీరభద్రం హెచ్చరించారు.

కొసమెరుపు.. రెండేండ్ల క్రితం అనుకుంటా.. కూకట్‌పల్లిలో సీపీఎం ఆధ్వర్యంలో సభ జరిగింది. జాతీయస్థాయి నాయకుడొకరు తన ప్రసంగంలో ఏమిటో.. రేషన్ కార్డులు ఇండ్ల కోసం ఉద్యమాలు చేస్తే ప్రజలు తండోపతండాలుగా పాల్గొంటున్నారు. కానీ ఓట్ల దగ్గరకు వచ్చే సరికే ఎందుకు పడటం లేదో అర్థం కావటం లేదు అని వాపోయారు. ఆయన వ్యాఖ్యలోనే సమాధానం ఉంది. విశాల లక్ష్యం కోసం పనిచేయాల్సిన పార్టీని రేషన్ కార్డులు, ఇండ్ల పట్టాలు అంటూ పరిమితం చేసుకుని ఆ అంశాల మీద బలం పెంచుకోవాలనుకోవడమే అసలు సమస్య. ప్రజలు కరెక్టుగానే ఉన్నారు. లేనిదల్లా పార్టీలు.. వాటి కాలం చెల్లిన ఆలోచనా ధోరణి మాత్రమే.

ఇదే కేసీఆర్ విషయమే తీసుకుంటే 2001లో తెలంగాణ సాధన అన్నారు. 14 ఏండ్లూ ఆ వాదనను పక్కదారి పట్టించలేదు. సభలైనా.. పోరాటాలైనా.. ఎన్నికలైనా ఏకైక ఎజెండా అదే. ఓ దశలో 610 జీవో అంశం మీద కూడా తెలంగాణ వస్తుంటే ఈ సమస్య అవసరమేముందని కూడా పక్కన పెట్టారు. ఉద్యమాలు పుస్తకాల పుటల్లోంచి పుట్టుకురావు. అసాధ్యమనుకున్న తెలంగాణ సుసాధ్యం చేసిన వైనమే దానికి ఉదాహరణ.
నమస్తే తెలంగాణ సౌజన్యంతో..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *