చైనా పర్యటనలో భాగంగా షాంఘైలో గురువారం సాయంత్రం సీఐఐ ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశంలో చైనాకు చెందిన పారిశ్రామికవేత్తలను ఉద్దేశించి ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు ప్రసంగించారు. ఈ సందర్భంగా తెలంగాణ పారిశ్రామిక విధానం, రాష్ట్రంలో పెట్టుబడులకున్న అవకాశాలను సీఎం వారికి వివరించారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన టీఎస్ఐపాస్ ప్రపంచంలోనే అత్యద్భుతమైన విధానమని, తెలంగాణలో పరిశ్రమలు స్థాపించేందుకు అనువైన వాతావరణ పరిస్థితులు, అవసరమైన ల్యాండ్ బ్యాంక్ అందుబాటులో ఉన్నాయని, అవినీతికి తావులేకుండా రూపొందించిన నూతన పారిశ్రామిక విధానంలో పెట్టుబడిదారులు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని అనుమతులు పొందే వీలుందని స్పష్టం చేశారు. దరఖాస్తు చేసుకున్న 15 రోజుల్లోనే అన్ని ప్రభుత్వ విభాగాలనుండి అనుమతులు ఇచ్చేలా చర్యలు తీసుకునేందుకు సీఎం కార్యాలయంలో ప్రత్యేకంగా చేజింగ్ సెల్ ను ఏర్పాటు చేసినట్లు, తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు రావాల్సిందిగా సీఎం కేసీఆర్ ఈ సందర్భంగా చైనా పారిశ్రామికవేత్తలను కోరారు.
పలు ప్రముఖ కంపెనీల ప్రతినిధులు తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు సానుకూలత వ్యక్తం చేశారు. హైదరాబాద్ పరిసర ప్రాంతంలో 20 మిలియన్ యూఎస్ డాలర్లతో(సుమారు రూ. 133 కోట్లు) పెట్టుబడులు పెట్టేందుకు ఎల్ఈడీ టీవీల తయారీ యూనిట్ నెలకొల్పేందుకు సెల్ కాన్, మెకాన్ సంస్థలు ముఖ్యమంత్రి సమక్షంలో అవగాహన ఒప్పందం కుదుర్చుకోగా, వీటితోపాటు సెల్ ఫోన్ విడిభాగాల, హెడ్ ఫోన్స్ తయారీకి సంబంధించిన మరో రెండు కంపెనీలు హైదరాబాద్ లో తమ యూనిట్లు నెలకొల్పేందుకు ఆసక్తి కనపరిచాయి. అంతేకాకుండా 40 బిలియన్ డాలర్ల మార్కెట్ విలువ కలిగిన షాంఘై ఎలక్ట్రిక్ కార్పొరేషన్ ఉపాధ్యక్షుడు షావ్ సీఎం కేసీఆర్ తో భేటీ అయ్యారు. హైదరాబాద్ లో తమ కంపెనీకి చెందిన హై పవర్డ్ పంప్స్, ఎలక్ట్రికల్ పరికరాల తయారీ యూనిట్లను నెలకొల్పేందుకు ఆసక్తి చూపారు.
మరోవైపు అభివృద్ధి చెందుతున్న దేశాల మౌలిక సదుపాయాల కల్పనకు ఆర్ధికసాయం అందిస్తున్న న్యూ డెవలప్ మెంట్ బ్యాంక్(బ్రిక్స్ బ్యాంక్) ప్రతినిధులను కూడా సీఎం కేసేఆర్ కలిశారు. బ్యాంక్ అధ్యక్షుడు కేవీ కామత్, ఉపాధ్యక్షుడు జియాంఝాతో భేటీ అయ్యి 40 నిమిషాలకు పైగా చర్చలు జరిపారు. తెలంగాణ రాష్ట్రంలో చేపట్టనున్న ఇరిగేషన్ ప్రాజెక్టులు, పట్టణాభివృద్ధి ప్రాజెక్టులు, వ్యర్ధాల నుండి విద్యుత్ తయారీ ప్లాంట్ల ఏర్పాటుకు ఆర్ధికసాయం అందించాలని వారిని కోరగా వారు సానుకూలంగా స్పందించారు.