ఇప్పటికే అన్నిరంగాలను అభివృద్ధి పథంలో పరుగులు పెట్టిస్తున్న తెలంగాణ రాష్ట్రం.. ప్రజలకు సామాజిక, ఆర్థిక భద్రతను కల్పించటంలో దేశంలోనే అత్యుత్తమ స్థానంలో నిలిచింది. విద్య, వైద్యం, ఆర్థిక భద్రత, శాంతిభద్రతలు తదితర విషయాల్లో దేశంలోని అన్ని పెద్ద రాష్ట్రాలను వెనక్కు నెట్టింది. సెంటర్ ఫర్ ఎకనమిక్ స్టడీస్ (సెస్), ఓపీ జిందాల్ గ్లోబల్ యూనివర్సిటీ సంయుక్తంగా నిర్వహించిన సర్వేలో అనేక అంశాల్లో తెలంగాణ అత్యుత్తమ ర్యాంకులు సొంతం చేసుకుంది. ‘యాక్సెస్ (ఇన్)ఈక్వాలిటీ ఇండెక్స్’ పేరుతో వెలువరించిన నివేదికలో సామాజిక, ఆర్థిక భద్రతలో దేశంలో తెలంగాణ మూడో స్థానంలో నిలిచింది. ప్రజలకు కనీస సదుపాయాల కల్పనలో ఆరోస్థానం దక్కించుకొన్నది. అందరికీ విద్యను చేరువ చేయడంలో ఏడో స్థానంలో నిలిచింది. సెకండరీ విద్యతో పాటు, విద్యా వసతుల కల్పనలో ఉత్తమ ప్రతిభ కనబర్చింది. శాంతిభద్రతలు కాపాడటం, సత్వర న్యాయం అందించడంలో 9వ స్థానంలో నిలిచింది. ప్రధాని సొంత రాష్ట్రం గుజరాత్‌తోపాటు, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, బెంగాల్ వంటి పెద్ద రాష్ట్రాల కంటే తెలంగాణ ఎన్నో రేట్లు ముందంజలో ఉందని ఈ నివేదిక వెల్లడించింది.
విద్యను చేరువ చేయడంలో :
విద్యను ప్రజలకు చేరువ చేయడం, వసతుల కల్పనలో తెలంగాణ టాప్-10 లో ఉండగా, మొదట ఉన్న రాష్ట్రాలన్నీ చిన్నవే. పెద్ద రాష్ట్రమైన తెలంగాణ.. యూపీ 27, బీహార్ 26, మధ్యప్రదేశ్ 23వ స్థానాల్లో నిలిచాయి.
సెకండరీ స్థాయిలో విద్యార్థుల హాజరు తెలంగాణలో 76.8 శాతం ఉన్నది. ఈ అంశంలో బీజేపీ పాలిత రాష్ట్రాలైన గుజరాత్, బీహార్ కంటే తెలంగాణ ముందున్నది.
అవకాశాల కల్పనలో:
ప్రజలకు సత్వర న్యాయం అందించడంలో తెలంగాణ తొమ్మిదో స్థానంలో నిలిచింది. ఇందులో సిక్కిం మొదటి స్థానంలో ఉంది. రాజస్థాన్, ఉత్తరప్రదేశ్, అస్సాం, కర్ణాటక తదితర రాష్ట్రాలు చివరి 8 స్థానాల్లో నిలిచాయి.
సామాజిక ఆర్థిక భద్రతలో:
తెలంగాణ, ఉత్తరాఖండ్, కర్ణాటక రాష్ట్రాలు దేశంలోనే అత్యధిక లైఫ్ ఇన్సూరెన్స్ కవరేజీ కలిగి ఉన్నాయి.
అన్నిట్లో తెలంగాణలో భేష్:
తాగునీరు, పారిశుద్ధ్యం, గృహవసతి, క్లీన్‌ఎనర్జీ, న్యూట్రిషన్, డిజిటల్ యాక్సెస్ అంశాల్లో తెలంగాణ టాప్ లో నిలిచింది. తెలంగాణ కంటే ముందు పంజాబ్, సిక్కిం, హర్యానా, మిజోరం, గుజరాత్, మహారాష్ట్ర మాత్రమే ఉన్నాయి. దేశంలో సగటున 65.9 శాతం ఇండ్లలోనే తాగునీటి వసతి ఉన్నది. తెలంగాణ రాష్ట్రంలో మిషన్ భగీరథ పథకం ద్వారా ఇంటింటికీ నల్లా నీరు అందిస్తున్న విషయం తెలిసిందే. ఈ జాబితాలో గోవా, పంజాబ్, తెలంగాణ, హర్యానా, కేరళ, సిక్కిం రాష్ట్రాలు ముందు వరుసలో నిలిచాయి.