mt_logo

భవిష్యత్తులో అన్నీ విద్యుత్ వాహనాలే : మంత్రి కేటీఆర్

రాబోయే రోజుల్లో విద్యుత్‌ వాహనాలదే హవా అని, ఇందుకనుగుణంగా తెలంగాణ ప్రభుత్వం గతేడాది అక్టోబర్‌లోనే విద్యుత్‌ వాహన విధానాన్ని ప్రవేశ పెట్టిందని పరిశ్రమలు,ఐటీ శాఖల మంత్రి కేటీఆర్ తెలిపారు. విద్యుత్‌ వాహనాల తయారీకి సంబంధించి రాష్ట్రానికి ఇప్పటివరకు రూ.5,600 కోట్ల పెట్టుబడులు వచ్చాయని, మరో తొమ్మిది అంతర్జాతీయ కంపెనీలు రానున్నాయని వెల్లడించారు. వీటితోపాటు మరో రెండు భారతీయ కంపెనీలతో పెట్టుబడుల చర్చలు జరిపామని తెలిపారు. శాసనమండలిలో శుక్రవారం విద్యుత్‌ వాహనాల విధానంపై సభ్యుల ప్రశ్నకు కేటీఆర్‌ సమాధానమిస్తూ.. హైదరాబాద్‌కు సమీపంలోని చేవెళ్ల, షాబాద్, చందనవెల్లి, సీతారాంపూర్‌లతో పాటు మహబూబ్‌నగర్‌లోని జిగిటిపల్లిలో రెండు క్లస్టర్స్‌ ఏర్పాటు కానున్నాయని తెలియజేసారు. విద్యుత్‌ వాహనాల తయారీకి ఉపయోగపడే లిక్వినిటైన్‌ 80% చైనాలో ఉత్పత్తి అవుతున్నందున ఆ దేశంతోనూ చర్చలు జరుపుతున్నామని చెప్పారు. ప్రస్తుతం రాష్ట్రంలో 40 టీఎస్‌ఆర్టీసీ బస్సులు సహా 6,311 విద్యుత్‌ వాహనాలు రోడ్లపైకి వచ్చాయని, వినియోగదారులకు రూ.26.18 కోట్ల మేర ప్రోత్సాహకాలను అందజేశామని పేర్కొన్నారు. ప్రస్తుతం హైదరాబాద్‌లో 98 ఎలక్ట్రిక్‌ చార్జింగ్‌ స్టేషన్లున్నాయని, వాటి సంఖ్యను త్వరలోనే 150కు పెంచుతామని హామీనిచ్చారు. విద్యుత్‌ వాహనాలు, వాటి విడిభాగాల తయారీలో పెట్టుబడులు పెంపొందించడం, వినియోగదారులు విద్యుత్‌ వాహనాల వాడకాన్ని పెంచేలా చర్యలు తీసుకుంటున్నామని సభకు తెలియజేసారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *