సింగరేణిని నిలువునా ముంచేయబోతున్న కేంద్ర ప్రభుత్వం

  • October 23, 2021 2:43 pm

దేశంలో అన్ని ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటు పరం చేస్తున్న కేంద్ర ప్రభుత్వం కన్ను ఇపుడు బొగ్గు గనులపై పడిందా..? సింగరేణితో పాటు కోలిండియా సంస్థలన్నిటిని బడా కంపెనీలకు కట్టబెట్టి.. ఆ సంస్థలను, ఉద్యోగులను నిలువునా ముంచేయబోతుందా.. అంటే అవుననే సూచనలే కనిపిస్తున్నాయి. సింగరేణి సంస్థతో పాటు కోలిండియా పరిధిలోని ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటుకు కట్టబెట్టేందుకు కేంద్రం తీవ్ర ప్రయత్నాలు చేస్తోంది. ఇందుకోసం దేశవ్యాప్తంగా ఉన్న కొన్ని ముఖ్యమైన బొగ్గు బ్లాకులను ప్రైవేట్‌ పరం చేసేందుకు ఇటీవల కేంద్రం ప్రత్యేక చట్టాన్ని రూపొందించింది. దీనిలో భాగంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లెందు పరిధిలోని కోయగూడెం ఓపెన్‌ కాస్ట్‌ (కేవోసీ)ను ప్రైవేటపరం చేసేందుకు సన్నాహకాలు మొదలు పెట్టింది. ఇప్పటికే కేవోసీ-1లో బొగ్గు ఉత్పత్తి లక్ష్యం పూర్తి కాగా కేవోసీ-2 పరిధిలోని పిట్‌ -2, పిట్‌-3లో బొగ్గు ఉత్పత్తి పూర్తయింది. ప్రస్తుతం పిట్‌-1లో బొగ్గు ఉత్పత్తి జరుగుతున్నది. మరోవైపు కేవోసీ-3 బ్లాకును ప్రారంభించేందుకు సింగరేణి సమాయత్తమవుతోంది. వివిధ ప్రభుత్వశాఖల నుండి త్వరలో అనుమతులు వస్తాయని ఎదురుచూస్తున్న సింగరేణికి కేవోసీ బ్లాకును కేంద్రం వేలం వేసేందుకు ప్రయత్నిస్తోందని సమాచారం అందింది. ఇదే కోవలో కొత్తగూడెం సింగరేణి ఏరియాలోని సత్తుపల్లి జేవోసీ (జలగం వెంగళరావు ఓపెన్‌ కాస్ట్‌)ను కూడా వేలం వేసేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది.

ప్రైవేటు పరమైతే ఏం జరుగుతుంది ?

కేంద్రం తెచ్చిన జీవో వల్ల సింగరేణి, కోలిండియా సంస్థలు మల్టీ నేషనల్‌ కంపెనీలతో కలిసి వేలంలో పాల్గొని బ్లాక్‌లను దక్కించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. కోల్ ఇండియా ఇదివరకే అధిక వేలానికి బొగ్గు బ్లాకులను దక్కించుకొని భారీ నష్టాలను చవిచూసింది. ఆ నష్టాలను భర్తీ చేసుకునేందుకు నానా తిప్పలు పడ్డప్పటికీ.. ఉద్యోగులను ఎలాంటి అసౌకర్యానికి గురి చేయలేదు. ఒకవేళ బొగ్గు ఉత్పిత్తి అనుమతులను మల్టి నేషనల్ కంపెనీలు దక్కించుకుంటే యువతకు, స్థానికులకు ఉపాధి అవకాశాలు ఉండవు. కార్మికులు, ఉద్యోగులు సైతం తమ హక్కులు కోల్పోయే ప్రమాదం ఉన్నది. ఇప్పటివరకు ఉన్న కార్మికుల ప్రత్యేక గుర్తింపు, సంఘాలకు ఉన్న అన్ని రకాల హక్కులు కోల్పోవాల్సి వస్తుంది. దీనిపై యావత్‌ సింగరేణి, కోలిండియా యాజమాన్యాలు తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేసినప్పటికీ కేంద్ర ప్రభుత్వం బొగ్గు బ్లాకులను వేలం వేసి ప్రైవేట్‌పరం చేసేందుకే మొగ్గు చూపుతోంది.

కేవోసీ పై ఎందుకు.. ?

కేవోసీ-3లో 30 మిలియన్ల టన్నుల బొగ్గు నిక్షిప్తమై ఉందని ఓ అంచనా. ఇక్కడ జీ-13, జీ-14 బొగ్గు విస్తారంగా నిక్షిప్తమై ఉంది. ఈ ఓసీ సుమారు 30 సంవత్సరాల పాటు నిరంతరాయంగా నడిచే అవకాశం ఉన్నది. తద్వారా ఇల్లెందు సింగరేణి ఏరియా మనుగడ కొనసాగుతుంది. కేవోసీ-3లో బొగ్గు ఉత్పత్తి అనుమతుల కోసం సింగరేణి కొన్ని సంవత్సరాలుగా ప్రయత్నాలు చేస్తున్నది. ఈ మేరకు అనుమతుల కోసం పలు శాఖలకు దరఖాస్తు చేసుకోగా.. కేంద్రం తీసుకు వచ్చిన ప్రత్యేక జీవోతో ప్రస్తుతం అనుమతులు ప్రశ్నార్థకమయ్యాయి. వేలంలో ఈ ఓసీని దక్కించుకునేందుకు సింగరేణితో పోటీపడడానికి బహుళ జాతి కంపెనీలు సిద్ధంగా ఉన్నట్లు సమాచారం. గతంలో అనేక బొగ్గు బ్లాకులను బడా కంపెనీలు దక్కించుకున్న విషయం తెలిసిందే. అలాంటి కంపెనీలన్నీ సింగరేణితో పోటీకి వస్తే సంస్థ మనుగడే ప్రశ్నార్థకంగా మారుతుంది.

సింగరేణి ఆశలపై నీళ్లు :

కేవోసీ -3 అనుమతుల వస్తే బొగ్గు రవాణా కోసం సింగరేణి యాజమాన్యం రైల్వే ట్రాక్‌ ఏర్పాటు చేయాలని రైల్వే శాఖకు ప్రతిపాదనలు పంపింది. టేకులపల్లి మండలంలోని బేతంపూడి నుంచి కేవోసీ వరకు ట్రాక్‌ నిర్మించేందుకు రైల్వేశాఖ సర్వే సైతం చేపట్టింది. ట్రాక్‌ నిర్మాణం, భూముల సేకరణ నివేదికను సింగరేణికి వివరించింది. ట్రాక్‌ నిర్మాణానికి రూ.90 కోట్ల ఖర్చును భరించేందుకు సింగరేణి సిద్ధమైంది. భూసేకరణ, ట్రాక్‌ నిర్మాణం, విద్యుత్తు లైన్ల పనులను సింగరేణి రైల్వే శాఖకు అప్పగించేందుకు సమాయత్తం అవుతున్న తరుణంలో కేంద్ర ప్రభుత్వ నిర్ణయంతో సింగరేణి సంస్థ ఆశలపై నీళ్లు చల్లినట్లైంది.

జాతీయ పోరాటానికి సిద్దమవుతున్న టీబీజీకేఎస్‌ :

ఈ విషయంపై ఒక్క తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం తప్ప ఏ ఒక్క జాతీయ కార్మిక సంఘం నోరు మెదపడం లేదు. రాజకీయ పార్టీల అనుబంధ సంఘాలైన ఐఎన్టీయూసీ, సీఐటీయూ, ఏఐటీయూసీలతో సహా మిగతా సంఘాలు వేలం విధానాన్ని తిప్పికొట్టడంలో, ప్రత్యేక చట్టం రద్దు చేయాలని నినదించిన దాఖలాలు ఒక్కటి కూడా లేవు. తెలంగాణలో టీబీజీకేఎస్‌ (తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం) మినహా మిగతా అన్నీ సంఘాలు కేంద్ర జీవోను వ్యతిరేకించడంలో విఫలమవుతున్నాయి. దేశవ్యాప్తంగా ఉన్న బొగ్గు బ్లాకులను కేంద్రం ప్రైవేట్‌పరం చేసే ప్రయత్నాలను, జీవోను అడ్డుకుంటామని టీబీజీకేఎస్‌ తెలిపింది. బొగ్గు బ్లాకులను ప్రైవేటుకు కట్టబెట్టే కేంద్ర ప్రభుత్వ చర్యలపై జాతీయ పోరాటానికి సిద్ధం కావాలని అన్ని కార్మిక సంఘాలకు పిలుపునివ్వనుంది. బొగ్గు బ్లాకుల వేలం జరిగితే సింగరేణి, కోల్ ఇండియా తమ ఆస్తిత్వాన్ని కోల్పోయి, ఉద్యోగులు వారి కుటుంబాలు రోడ్డున పడతాయని ఆవేదన వ్యక్తం చేసింది.


Connect with us

Videos

MORE