హైదరాబాద్ నగరంలో 11.5 కిమీ పీవీఎన్‌ఆర్ ఎక్స్‌ప్రెస్‌వే అత్యంత పొడవైనది కాగా, త్వరలో ప్రారంభంకానున్న 2.71 కిమీ షేక్‌పేట ఫ్లైఓవర్ రెండవ అతి పొడవైనదిగా నిలవనుంది. పీవీఎన్‌ఆర్ ఎక్స్‌ప్రెస్‌వే నాలుగు లేన్లది కాగా, ఆరులేన్ల ఎలివేటెడ్ కారిడార్లలో షేక్‌పేటది అత్యంత పొడవైనదిగా రికార్డుకెక్కనుంది. నాలుగు ప్రధాన జంక్షన్లలో ట్రాఫిక్ చిక్కుల్ని తొలగించే షేక్‌పేట ఫ్లైఓవర్… ఔటర్ రింగ్‌రోడ్డు– ఇన్నర్ రింగ్‌రోడ్డును కలిపే వారధిగా కూడా మారనుంది.
ట్రాఫిక్ కష్టాలకు చెల్లు :
అత్యాధునిక సాంకేతికతను ఉపయోగించి నిర్మిస్తున్న షేక్‌పేట, మిథాని ఆరులేన్ల కారిడార్ ఫ్లైఓవర్లు త్వరలో ప్రారంభానికి సిద్ధం అవుతున్నాయి. ఈ ఫ్లైఓవర్లు అందుబాటులోకి వస్తే ఆయా మార్గాల్లో ప్రయాణించేవారికి ట్రాఫిక్ చిక్కులు తగ్గడంతోపాటు, ఇంధన వ్యయం, ప్రయాణ సమయం తగ్గుతుంది. ఆయా జంక్షన్ల వద్ద కాలుష్యం కూడా తగ్గుతుంది. 2018 ఏప్రిల్‌లో 333.55 కోట్లతో అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో చేపట్టి ఈ వంతెనల నిర్మాణం మూడున్నరేళ్లలో పూర్తిచేశారు. గురువారం ఫ్లైఓవర్ల పనులు పరిశీలించిన నగర మేయర్ గద్వాల విజయలక్షి, మీడియాతో మాట్లాడుతూ.. ఎస్సార్‌డీపీ కింద ఈ రెండు ఫ్లైఓవర్లతో సహా ఇప్పటి వరకు 2వేల కోట్ల విలువైన 22 పనులు పూర్తయినట్లు తెలిపారు. అలాగే వివిధ దశల్లో ఉన్న 6 కోట్ల విలువైన 25 పనుల్ని వచ్చే సంవత్సరం పూర్తి చేయాలనే లక్ష్యంతో ఉన్నట్లు పేర్కొన్నారు. పనులు పూర్తయిన రెండు ఫ్లైఓవర్ల ప్రారంభోత్సవం దాదాపు వారం రోజుల్లో జరిగే అవకాశముందని స్పష్టం చేశారు.
షేక్‌పేట ఫ్లైఓవర్(గెలాక్సీ థియేటర్ నుంచి మల్కంచెరువు వరకు) :
సెవెన్‌టూంబ్స్, ఫిల్మ్‌నగర్ మెయిన్‌రోడ్డు, ఓయూకాలనీ, విస్పర్‌వ్యాలీ టీ జంక్షన్ల వద్ద ట్రాఫిక్ చిక్కుల్ని తొలగించే ఈ భారీ ఫ్లైఓవర్ వల్ల నానల్‌నగర్ నుంచి ఖాజాగూడ, అక్కడి నుంచి ఔటర్ రింగ్‌రోడ్డు వరకు దాదాపు 11 కిమీ మేర సిగ్నల్ ఫ్రీ ప్రయాణం సాధ్యం కానుంది. కోర్‌సిటీ నుంచి హైటెక్‌సిటీ, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్‌ల వైపు రాకపోకలు సాగించేవారికి దీని వల్ల ఉపశమనం లభిస్తుంది. అలాగే ఇన్నర్ రింగ్‌రోడ్డు (రేతిబౌలి) నుంచి ఔటర్ రింగ్‌రోడ్డు (గచ్చిబౌలి) వరకు లక్‌డికాపూల్, మెహిదీపట్నం, టోలిచౌకి, గచ్చిబౌలి మార్గాల్లో ప్రయాణించే దాదాపు 4 లక్షల వాహనాలకు భారీ ఊరట కలగనుంది. బయోడైవర్సిటీ జంక్షన్– జేఎన్‌టీయూ జంక్షన్ మార్గానికి అనుసంధానంగానూ ఉన్న ఈ ఫ్లైఓవర్ వల్ల దాదాపు 17 కిమీ మేర (లక్డీకాపూల్–జేఎన్‌టీయూ జంక్షన్) సాఫీ ప్రయాణం సాధ్యమని ఈ ప్రాజెక్ట్ పనులు పర్యవేక్షించిన ఎస్‌ఈ వెంకటరమణ పేర్కొన్నారు.