– తిరుమల్ రెడ్డి సుంకరి
తెలంగాణ ఆవశ్యకత గురించి ప్రసార సాధనాల్లో చర్చలు, పలు వేదికలపై వాదోపవాదాలు సహా వేలకొద్ది ప్రచురణలు వచ్చాయి, దశాబ్దాల తరబడి సంభాషణలు, ప్రశ్నలకు సమాధానాలు వినిపిస్తూనే ఉన్నాయి. అయినా సరే “తెలంగాణ ఎందుకివ్వాలి” అని కొంతమంది సీమాంధ్రులు భేతాళ ప్రశ్న సంధిస్తూనే ఉంటారు. వాళ్లకు మన సమాధానం అర్ధంకాకనా లేక వితండవాదన చేయాలనా తెలవదు.
అటూ ఇటూ తిరిగి మళ్లా “తెలంగాణ ఎందుకు” అనే వాళ్ళకు ఒక్కటే సమాధానం.
“తెలంగాణ ఎందుకు ఇవ్వాలి” అనే రైలు ఎప్పుడో వెళ్ళిపోయింది. వెళ్ళిపోయిన రైలే ఎక్కాలనుకోవడం మూర్ఖత్వం. అది తిరిగొచ్చి సీమాంధ్రులను ఎక్కించుకోవడం ఇక తీరని కలే. ప్రస్తుతం “తెలంగాణ ఎట్లా ఇవ్వాలి” అనే రైలు బయలుదేరడానికి సిద్ధంగా ఉంది. వెంటనే ఎట్లా కావాలో తేల్చుకుని ఈ రైలు ఎక్కకపోతే, ఉమ్మడి రాజదానులూ మిగలవు, పరిహారాలు అంతకన్నా దక్కవు. అయినా సరే అని భీష్మించుకున్నారో “తెలంగాణ ఎట్లా ఇవ్వాలి” అనే రైలు వెళ్ళిపోవడం ఖాయం. ఇక మిగిలింది “తెలంగాణ ఎప్పుడు ఇవ్వాలి” అనే చివరి రైలు మాత్రమే.
మొదటి రెండు రైళ్ళు ఎటూ వదిలేసుకున్నారు గనక చచ్చినట్టు “తెలంగాణ ఎప్పుడు” అనే రైలు ఎక్కల్సిందే. కేంద్ర ప్రభుత్వ టైం టేబుల్ ప్రకారం ఈ రైలు అతి త్వరలో ఖచ్చితంగా బయలుదేరుతుంది. ఇప్పుడు కూడా తెలంగాణ ఎందుకివ్వాలి అన్నారో ఇక మీ చిరునామా “కేరాఫ్ ప్లాటుఫారమే”.