mt_logo

“సమైక్యాంధ్ర ఉద్యమంలోని ఈ భాగాన్ని సమర్పిస్తున్నది XYZ ఇంగ్లీషు మీడియం స్కూల్”

గత వారం చిత్తూరులో సమైక్యాంధ్ర ర్యాలీ జరిగింది. మరుసటి రోజు సీమాంధ్ర పత్రికల్లో ఆ ర్యాలీ ఫొటో చూసి మేము ఒకింత ఆశ్చర్యపోయాము. ఆ ర్యాలీ ఫొటోల్లో జనం కొంచెం ఎక్కువే కనిపించేసరికి మాకు కుతూహలం ఎక్కువైంది. సీమాంధ్రలో పెద్దగా సమైక్య భావన లేదు అని ఇప్పటికే అనేకసార్లు నిరూపితమైంది. ఏదో కొద్దిమంది రాజకీయ నాయకులు అప్పుడప్పుడు చేసే చిన్న చితకా కార్యక్రమాలు తప్పించి జనం స్వచ్చందంగా వీధుల్లోకి రావడం ఇప్పటిదాకా సీమాంధ్రలో జరగలేదు.

పరవాలేదు. బాగానే జనం వచ్చారు అనుకున్నాము. కానీ ఆ ఫొటోను మరొకసారి పరీక్షగా చూస్తే ఏదో తేడాగా అనిపించింది. ఫొటోలో జనం స్పష్టంగా వివిధ రంగుల వారీగా అమర్చినట్టుగా కనపడ్డారు.

ఇంకొంచెం తవ్వితే దిగ్భ్రాంతికరమైన వాస్తవం బయటపడ్డది.

వచ్చిన వాళ్ళు సామాన్య జనం కాదు. వాళ్లు చిత్తూరులో ఉన్న వివిధ స్కూలు పిల్లలు!

దాదాపు 20 విద్యాసంస్థలకు చెందిన విద్యార్ధులను చిత్తూరులో ఒక కూడలికి చేర్చి, చాలా ఎత్తు నుండి ఒక ఫొటోను తీసి – సీమాంధ్రలో చాలా ఉధృతంగా సమైక్యాంధ్ర ఉద్యమం సాగుతోందని బయటి ప్రపంచాన్ని నమ్మించే ప్రయత్నం చేస్తున్నారు అక్కడి నేతలు. ఉద్యమంలో స్కూలు పిల్లలు ఉండకూడదు అని కాదు. కానీ మొత్తం స్కూలు పిల్లలనే ఒక కూడలికి తోలుకొచ్చి అదే సమైక్యాంధ్ర ఉద్యమం అని చూపించడం దిగజారుడుతనం

గమత్తేమిటంటే, ఆ రోజు ర్యాలీకి వచ్చిన విద్యాసంస్థలన్నీ తమ తమ సంస్థల బ్యానర్లు పట్టుకుని ర్యాలీకి రావడం. సమైక్యాంధ్ర ఉద్యమం పేరుతో తమ తమ స్కూలు, కాలేజీలకు ఉచిత ప్రచారం చేసుకునే యావే వారిలో స్పష్టంగా కనిపిస్తుంది.

 

సో! రేపెప్పుడైనా “సమైక్యాంధ్ర ఉద్యమంలోని ఈ భాగాన్ని సమర్పిస్తున్నది XYZ ఇంగ్లీషు మీడియం స్కూల్” అనే ప్రకటన కనపడ్డా, వినపడ్డా పెద్దగా కంగారుపడకండి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *