mt_logo

ఆధిపత్య నీతి శతకం

By: కట్టా శేఖర్ రెడ్డి 

వెయ్యిమంది బలిదానాలకు దుఃఖించనివాడు
సోనియమ్మకోసం గుండెలవిసేలా వలపోస్తుంటాడు
పిల్లల శవాలపై చలికాచుకుంటున్నవాడు
సంయమనం పాటించాలని చెబుతాడు
అన్ని విలువలను అపహాస్యం చేసినవాడు
అత్యంత సంస్కారిలా ఉపదేశాలిస్తుంటాడు
తెలుగు మాట్లాడడమే రానివాడు
మాట్లాడే భాషలో తప్పులెన్నుతాడు
మాట తప్పడం, మోసగించడం రివాజుగా పెట్టుకున్నవాడు
కొత్త మోసాలకు పథక రచన చేస్తుంటాడు
కడుపు మండిన వాడు తిడితే ఆగ్రహం!
కడుపునిండినవాడు మాట్లాడితే భజన!
తెలంగాణ ప్రజలవి చావులు కావు
తెలంగాణ ప్రజలది అవమానం కాదు
ఉండవల్లి విద్వేషం విద్వేషం కాదు
లగడపాటి ఉన్మాదం ఉన్మాదం కాదు!

ఒకే ఒక్కడు. ఒకటే లక్ష్యం. వంద మంది దాడి చేస్తారు. వందరకాల విమర్శలు చేస్తారు. వెయ్యి అబద్ధాలు ప్రచారంలో పెడతారు. దేశంలో ఏ నాయకుడికీ జరుగనన్ని శీల పరీక్షలు తెలంగాణ నాయకునికి పెడతారు. ఏ ఉద్యమంపై జరుగనంత విద్వేషోన్మాద దాడి తెలంగాణ ఉద్యమంపై జరుగుతుంది. ఉండవల్లి, లగడపాటి, రాయపాటి, కావూరి, సబ్బం హరి, కాపు రామచంద్రారెడ్డి, జగ్గారెడ్డి, మధుయాష్కీ, గట్టు రామచందర్రావు.. అందరిదీ అదే బడి. ఒక్క పార్టీ కాదు, సీమాంధ్ర నాయకత్వంలోని అన్ని పార్టీలదీ అదే పద్ధతి. సీమాంధ్ర పత్రికలు, చానెళ్లు, విశ్లేషకులు, పండితులు అందరిదీ అదే దారి. కేసీఆర్‌ను దెబ్బకొట్టాలి. బద్నాం చేయాలి. తెలంగాణ ఉద్యమాన్ని బలహీనపర్చాలి. వాళ్లు ఈ పన్నెండేళ్లలో ఏ సందర్భమూ వదల్లేదు. సందర్భం కల్పించుకుని దాడి చేసిన సందర్భాలు కొల్లలు. రాజకీయ పక్షాలకు, ఉద్యమాలకు నాయకత్వం వహించేవారిపై విమర్శలు సహజమే.

నాయకులు విమర్శలను స్వీకరించడానికి కూడా పాత్రులే. కానీ కేసీఆర్‌పై చేసిన, చేస్తున్న విమర్శలకు, ఇతర పార్టీల నాయకులపై చేస్తున్న విమర్శలకు పొంతన పోలిక ఉండదు. జీవనశైలిపై దాడి, వ్యక్తిగత విమర్శలు, నిరాధారమైన ఆరోపణలు, అబద్ధాలు…ఎన్ని కుమ్మరించారని!

ఇటువంటి ఆరోపణలు ఈ నాయకులు, ఈ పత్రికలు, ఈ చానెళ్లు ఏనాడైనా ఏ నాయకుడిపైనైనా చేశాయా? వైఎస్ రాజశేఖర్‌రెడ్డి రోజూ క్రమం తప్పకుండా మద్యం స్వీకరించేవారని ఎవరైనా, ఎప్పుడైనా చర్చకు పెట్టారా? ఆయన కుటుంబం నుంచి డజను మంది రాజకీయాల్లో పదవులు అనుభవిస్తున్నారని ఎవరయినా మాట్లాడారా? తెలుగుదేశం చంద్రబాబునాయుడు కుటుంబ పార్టీ అని ఎవరయినా విమర్శించారా? ఆయన జీవన శైలి ఎలా ఉంటుందో ఎవరికయినా తెలుసా? తెలిసినా రాయరు. మాట్లాడరు. విమర్శించరు. ఎందుకంటే వారు ఆధిపత్య శక్తులకు, ఆధిపత్య భావజాలానికి నాయకులు. రాష్ట్రంలో పాతుకుపోయిన రెండు సామాజిక వర్గాలకు నాయకులు.ఆధిపత్య భావజాలానికి మౌత్‌పీస్‌లుగా మారిన పత్రికలు, చానెళ్లు వారిని గౌరవంగా చూసుకుంటుంది. ఒక స్థాయికి మించి విమర్శలు చేయవు.

తెలంగాణ నాయకుల విషయంలో మాత్రం ఏ అంశమూ చర్చకు అతీతంకాదు. సినిమాల్లోనే కాదు, రాజకీయాల్లో, జీవితంలో కూడా తెలంగాణ నాయకులంటే అలుసు. చిన్నచూపు. ఏవగింపు. వెటకారం. ఇదంతా తెలంగాణ ఉద్యమం మీద వ్యతిరేకత. తెలంగాణ ఉద్యమాన్ని కించపరిచే కుహకం.

కేసీఆర్‌పై తాజాగా మొదలైన దాడి అందులో భాగమే.

ఉండవల్లి మాట్లాడిన సభలో పిసిసి అధ్యక్షుడు ప్రధాన అతిథిగా ఉంటాడు. తెలంగాణవాళ్లు మనుషులతో భూమి దున్నుకునేవారని, వారికి మేమే వ్యవసాయం నేర్పించామని ఉండవల్లి మాట్లాడుతున్నప్పుడూ బొత్స అక్క డే ఉన్నారు.(పశువులను కొనే స్తోమత లేక కర్నూలు జిల్లాలో ఇప్పటికీ అక్కడక్కడా మనుషులు నాగళ్లు లాగుతున్నారన్న విషయం ఉండవల్లికి తెలియకపోవచ్చు. ముఖ్యమంత్రి తెలంగాణవాదులకు హెచ్చరికలు చేస్తున్నప్పుడూ పాత్రికేయుల సమావేశంలో తెలంగాణ మంత్రులు ఉంటారు. జగన్‌తో చేయి కలిపిన ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి విధ్వంసం సృష్టిస్తామన్నప్పుడు కూడా ఎవరికీ బాధ కలుగలేదు.

రాష్ట్రాన్ని విడదీస్తే రైళ్లు పేల్చేస్తామని నర్సరావుపేట ఎంపీ ప్రకటించినప్పుడూ ఎవరూ కేసులు పెట్టలేదు. తొండలు గుడ్లు పెట్టే హైదరాబాద్‌ను మేము బాగు చేశామని సీమ రెడ్డి ఒకరు మమ్మల్ని అవమానించినప్పుడూ ఎవరూ తప్పు పట్టలేదు…..ఇలా వంద ప్రకటనలు. వంద ఉదంతాలు. అయినా తెలంగాణవాదులు సంయమనంతోనే ఉన్నారు. మిలియన్ మార్చ్ సందర్భంలో తప్ప ఎప్పుడూ తమ కోపా న్ని ప్రదర్శించలేదు.

‘బాధ, కోపం మాకే ఉంటాయి. ఉద్యమం మేము చేశాం. రెండు ఎన్నికల్లో అటు కాంగ్రెస్, ఇటు తెలుగుదేశం మాతో కలసి పనిచేశాయి. అన్ని పార్టీలు ఎన్నికల మ్యానిఫెస్టోల్లో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు హామీ ఇచ్చాయి. అఖిలపక్షంలో తీర్మానం చేశాయి. అసెంబ్లీలో మద్ద తు ప్రకటించాయి. తీరా వచ్చాక మోసం చేశాయి. కాంగ్రెస్, తెలుగుదేశం, జగన్‌మోహన్‌డ్డి…అందరూ అప్రజాస్వామికంగా వ్యవహరించారు. తెలంగాణకు అడ్డంపడ్డారు. దెబ్బతిన్నది మేము. వెయ్యిమంది పిల్లలను పోగొట్టుకున్నది మేము. వాళ్ల మరణాలకు కారకులు మీరు. మీరు ఇచ్చినమాటకు కట్టుబడి ఉండి ఉంటే మా పిల్లలు మరణించి ఉండేవారు కాదు. తెలంగాణకు వ్యతిరేకంగా మీరు చేస్తున్న విద్వేష ప్రకటనలే మా పిల్లలను కుంగదీస్తున్నాయి’ అని తెలంగాణ జేఏసీ నాయకుడొకరు ఆగ్రహం వ్యక్తం చేశారు.

సీమాంధ్ర ఆధిపత్య శక్తులు తాము చేసిన పాపాలన్నింటినీ సందర్భోచితంగా దాచేసి, ‘కేసీఆర్ తెలంగాణ ప్రజల మనోభావాలతో ఆడుకుంటున్నారు’ అని ప్రచారం మొదలుపెట్టాయి. ‘కేంద్రంతో బేరసారాలాడుతున్నార’ని దాడి చేస్తున్నాయి. ఇదంతా తమ కుట్రలు, కుతంత్రాలనుంచి దృష్టిమళ్లించే ప్రయత్నం.

నిజానికి, తాజాగా కేసీఆర్‌ను ఎవరూ ఇంతవరకు చర్చలకు పిలువలేదు. చర్చలు జరుగలేదు. అసలు ఆ ఆలోచన ఉన్నట్టు కూడా కేంద్రం ఇంతవరకు ప్రకటించలేదు. కేసీఆర్ ఫామ్ హౌజ్‌లో ఉంటున్నారని పదేపదే రాస్తున్న పత్రికే, కేసీఆర్ ముఖ్యమంత్రి పదవి కోసం బేరమాడుతున్నారని ఒక పచ్చి అబద్ధాన్ని అచ్చోసి వదులుతుంది. కాంగ్రెస్ సొంత పార్టీలోనే ఇంతవరకు ఒక స్పష్టత తెచ్చుకోలేదు.సీమాంధ్ర నాయకులతో వారు చర్చించలేదు. ముఖ్యమంత్రి, పిసిసి అధ్యక్షులతో మాట్లాడలేదు. తెలంగాణ ఇవ్వాలా లేదా అన్న అంశంపై కేంద్రానికే ఒక స్పష్టత లేదు. ఇవేవీ లేకుండానే ఇటువంటి వార్తలు రాయడంలో ఆపత్రిక ఉద్దేశం ఏమయి ఉంటుంది? కచ్చితంగా తెలంగాణ వ్యతిరేకత. తెలంగాణ ఉద్యమంపై బండలు వేసే ప్రయత్నం. ఇదే పత్రిక, కొన్ని చానెళ్లు కేసీఆర్ గతంలో ఢిల్లీలో చర్చలకు వెళ్లినప్పుడు, ‘అసలు ఆయనను చర్చలకే పిలువలేదు. ఆయనే వచ్చారు. పిలవని పేరంటానికి వెళ్లి ఉద్యమాన్ని దెబ్బతీస్తున్నారు. తెలంగాణవాదాన్ని బలహీనపరుస్తున్నారు’ అని రాశాయి.

అప్పట్లో ఆయనను చర్చలకు పిలిచిన మాట వాస్తవం. చర్చలు జరిపిన మాట వాస్తవం. కొంతదూరం సాగాక కేంద్రం వెనుకకు తగ్గినమాట వాస్తవం. చర్చలకు మధ్యవర్తులుగా వ్యవహరించిన కేంద్ర మంత్రులు పార్టీ అధిష్ఠానం ధోరణిపై విసుగుచెంది, కేసీఆర్ వద్ద విచారం వ్యక్తం చేసిన మాటా వాస్తవం. అప్పుడెప్పుడూ షరతుల ప్రస్తావన లేదు. షరతులు లేని తెలంగాణ ఇస్తే, షరతులు లేకుండా పార్టీని విలీనం చేస్తానని కేసీఆర్ అప్పుడే చెప్పారు. అయినా కాంగ్రెస్ నాటకాలు ఆడింది, ఆడుతోంది. ఆ నాటకాలు, ఆ మతలబుల గురించి మాట్లాడడంపోయి, ఢిల్లీ పక్షాన తెలంగాణ ఉద్యమంపై రాళ్లు వేసే దుర్మార్గానికి ఆ పత్రిక పూనుకోవడం గమనించాలి.

ఓట్లు, సీట్లను అడ్డుపెట్టుకుని కేసీఆర్ కేంద్రంతో బేరసారాలు జరుపుతున్నారని కొందరు మాట్లాడుతున్నారు. తెలంగాణ ఉద్యమానికి ఓట్లు, సీట్లు రావాలని, ఉండాలని ఆశించడం నేరమా? అన్ని కష్టనష్టాల్లో తమ పక్షాన నిలబడే వారే తమ ప్రతినిధులుగా ఉండాలని తెలంగాణ ప్రజలు కోరుకోకూడదా? ఓట్లు, సీట్లు, అధికారం…ఏమైనా సీమాంధ్ర పార్టీల గుత్త సొత్తా-ఎవరూ ఆశించకుండా ఉండడానికి? ఓట్లు, సీట్ల భయం లేకపోతే కాంగ్రెస్ లేక టీడీపీ లేక మరే సీమాంధ్ర పార్టీ అయినా తెలంగాణకు మద్దతుగా నిలబడుతుందా? ఆ ఓట్లు, సీట్లతోనే కాదా ఇంతకాలం తెలంగాణను రాకుండా అడ్డుకుంటున్నది? ఆ ఓట్లు, సీట్లు సీమాంధ్ర ఆధిపత్య పార్టీల గుప్పిట్లో ఉండడం వల్లనే కాదా తెలంగాణ ఇంత ఆలస్యమైంది? కాంగ్రెస్ మంత్రులు, ఎమ్మెల్యేలు రాజీనామాలు చేసి, బరిగీసి నిలబడి ఉంటే ఇంత మంది తెలంగాణ పిల్లలు మరణించేవారా? పదిహేను మంది తెలంగాణవాదులను ఎంపీలుగా గెలిపిస్తే కేసీఆర్ బేరమాడే మాట నిజం-ఆయన తెలంగాణ సాకారం కోసం బేరమాడతారు. తెలంగాణను గెలిపిస్తారు. కానీ కాంగ్రెస్ వారిని గెలిపిస్తే సోనియాగాంధీకి, తెలుగుదేశం వారిని గెలిపిస్తే చంద్రబాబుకు, వైఎస్సార్ కాంగ్రెస్ మనుషులను గెలిపిస్తే జగన్‌మోహన్‌రెడ్డికి సాష్టాంగపడతారు. వారు సీమాంధ్రను గెలిపిస్తారు. యథాతథస్థితిని కొనసాగిస్తారు.

అయినా తెలంగాణ సాధన ఒక్క టీఆరెస్ సమస్యేనా?తెలంగాణ పేరెత్తకుండా ఏ పార్టీ అయినా ఇక్కడ ఎన్నికల్లో పోటీ చేసిందా? కాంగ్రెస్‌కు బాధ్యత లేదా? కాంగ్రెస్ గత అన్ని ఎన్నికల్లో తెలంగాణ ప్రజలకు హామీ ఇచ్చింది వాస్తవం కాదా? తెలంగాణ సాధించి ప్రతిష్ఠ అంతా కాంగ్రెస్ కొట్టేస్తే ఎవరు అడ్డం పడ్డారు? టీఆస్ విలీనం కావాలని షరతులు ఎందుకు పెట్టాలి? తెలంగాణలో రాజకీయంగా గరిష్ఠ ప్రయోజనం పొందాలంటే టీఆస్ విలీనం కావాలని కాంగ్రెస్ ఆశ. కాంగ్రెస్ ప్రయోజనం పొందాలని ఆశించినట్టే, పన్నెండేళ్లుగా అన్ని కష్టనష్టాలకోర్చి ఉద్యమాన్ని నడిపిస్తున్న వాళ్లు రాజకీయ ప్రయోజనం పొందాలనుకోవడం నేరమా? ప్రజల మనోభావాలతో పుష్కరకాలంపాటు కాంగ్రెస్ ఆడుకోవడం తప్పుగా అనిపించడం లేదు, తెలంగాణ గుండె ఘోషకు ప్రతినిధులుగా పనిచేస్తున్న వారిదే తప్పట. ఆధిపత్య భావజాల దృక్పథం ఇప్పుడు రాజకీయాలను ఏలుతున్నది.

ఆ దృక్పథం నుంచే తీర్పులు వస్తున్నాయి. విచిత్రం ఏమంటే, రాజీల ద్వారా వచ్చే తెలంగాణ ఇక్కడి ప్రజలకు మేలు చేయదని భావించే మేధావులు కూడా, బేరసారాలను బూతుగా చూడడం. అందరినీ ఒకే గాటకట్టడం. సాధారణ సూత్రీకరణలకు రావడం. తెలంగాణవాదులు ఇప్పుడు ఆధిపత్య శక్తుల ఎత్తులు, జిత్తులను సులువుగానే అర్థం చేసుకుంటున్నారు. తెలంగాణపై చర్చలు జరగాలి. అవి గౌరవప్రదంగా జరగాలి. అవి చాటుమాటుగా కాదు. పారదర్శకంగానే జరగాలి. అధికారికంగా ఆహ్వానాలు రావాలి. అప్పటిదాకా కట్టుకథలు, పుట్టు కథలు ఆపితే మంచిది.

చరిత్రలో ఏం జరిగింది?

హైదరాబాద్ స్టేట్ అసెంబ్లీలో విశాలాంధ్ర కోసం తీర్మానం చేశారంటూ ఒక అబద్ధాన్ని ప్రచారంలోకి తెచ్చారు. ఆ విషయాన్ని పక్కనబెడితే, అసలు అప్పటి అసెంబ్లీలో తెలంగాణవాళ్లు ఎంతమంది ఉన్నారు? మొత్తం సభ్యుల సంఖ్య 175. అందులో 73 మంది కర్ణాటక, మరాట్వాడా ప్రాంత ప్రతినిధులు. వారంతా తొందరగా కర్ణాటకలో, మహారాష్ట్రలో కలవాలని ఆరాటపడుతున్నవాళ్లే. వారికి తెలంగాణ ప్రత్యేకంగా ఉండాలా, విశాలాంధ్రలో కలవాలా అన్న ఆసక్తి కంటే తాము స్వభాషారాష్ట్రంలోకి వెళ్లాలన్న ఆరాటమే ఎక్కువ. భాషా ప్రయుక్త రాష్ట్రాలు వస్తే తమ పని సులువవుతుందని వారి ఆశ.

అందుకే తెలంగాణ వారికంటే ఎక్కువగా కర్ణాటక, మరాట్వాడా సభ్యులు వీర విశాలాంధ్రవాదుల్లా మాట్లాడారు. ఇక తెలంగాణ నుంచి గెలిచిన 103 మందిలో 36 మంది కమ్యూనిస్టులు.45 మంది కాంగ్రెస్‌వారు. 11 మంది సోషలిస్టులు. ముగ్గురు షెడ్యూల్డు కులాల ఫెడరేషన్(ఎస్‌సిఎఫ్) సభ్యులు. మిగిలిన ఏడుగురు ఇండిపెండెంట్లు. కమ్యూనిస్టులు విశాలాంధ్రలో ప్రజారాజ్యం నినాదంతో అప్పటికే తెలంగాణ కమ్యూనిస్టులను ఒప్పించారు. రెండు ప్రాంతాలు కలిస్తే విశాలాంధ్రలో ప్రజారాజ్యం వస్తుందన్న ఆశతో ఆరోజు కమ్యూనిస్టులు విశాలాంధ్ర నినాదం ఎత్తుకున్నారు. కాంగ్రెస్‌లో మెజారిటీ సభ్యులు విలీనాన్ని వ్యతిరేకించారు. కొందరు తటస్థంగా ఉన్నారు. సోషలిస్టు సభ్యుల్లో కూడా మెజారిటీ విలీనాన్ని వ్యతిరేకించారు. అయినా రావినారాయణరెడ్డి భాషలో చెప్పాలంటే ‘పైరవీల’ కారణంగా విశాలాంధ్ర ఏర్పడింది.

[నమస్తే తెలంగాణ సౌజన్యంతో] ]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *