mt_logo

రాష్ట్రం ఒకటట. హక్కులేమో వేరట!

By: కొణతం దిలీప్

20 ఫిబ్రవరి 2010

స్థలం: ఉస్మానియా NCC గేట్

ఆరోజు ఉస్మానియా జేయేసీ చలో అసెంబ్లీకి పిలుపిచ్చింది. ఆరోజుల్లో జరిగే ప్రతి కార్యక్రమాన్ని ఫొటోలు తీయడమే నాపనిగా ఉండేది. పొద్దున్నే నేను, బాల్ రెడ్డి చెరో ఫొటో కెమెరా, వీడియో కెమెరా తీసుకుని NCC గేట్ కాడికి పోయినం.

మొత్తం పోలీసు పహారాలో ఉందా ప్రాంతం. ఎటుచూసినా ముళ్ల కంచెలు, బ్యారికేడ్లు. ఇటువైపు BSF, CISF, CRPF, APSP, ITBP పారామిలిటరీ దళాలు, వారితోపాటు లోకల్ పోలీసులు, అటువైపు వందలాది ఉస్మానియా విద్యార్ధులు.

నగరం మొత్తం దిగ్బధనం చేసిండ్రు. అన్ని మెయిన్ రోడ్లు మూసేసిండ్రు. పైన హెలికాప్టర్ లో పహారా తిరుగుతూ డిజీపీ పర్యవేక్షించిండు.

మూడు నాలుగు చోట్ల విద్యార్ధులు బ్యారికేడ్లు చేధించినా వందలాది పోలీసులు వారిని చుట్టుముట్టు అరెస్టు చేసిండ్రు.

ఆనాటి చలో అసెంబ్లీ ఫొటోలు ఇక్కడ చూడొచ్చు:

Chalo Assembly

 

మధ్యాహ్నం వరకూ NCC గేట్ దగ్గర, మా చుట్టూనే తిరిగిన సిరిపురం యాదయ్య, పోలీసు దిగ్బంధనం దాటలేక, ఇక లాభం లేదనుకుని పక్క సందులకు పోయి బ్యాగులో తెచ్చుకున్న బాటిల్ పెట్రోల్ మీద కుమ్మరించుకుని నిప్పంటించుకున్నడు. అగ్నిగోళమై జై తెలంగాణ నినాదాలతో ఉరికొచ్చిండు.

తీవ్ర గాయాలతో మరునాడు ఉదయానికి అమరుడయ్యిండు.

వేలాది విద్యార్ధులను జిల్లాల్లో, హైదరాబాదులో అరెస్ట్ చేశారు. లాఠిచార్జిలో, భాష్పవాయువు గోళాల తాకిడికి వందలాది మంది విద్యార్ధులు గాయపడ్డారు.

విద్యార్ధుల చలో అసెంబ్లీని విజయవంతంగా అడ్డుకున్నమని సీమాంధ్ర ప్రభుత్వం కాలరెగరేసింది.

జూన్ 14 2013

తెలంగాణ జేయేసీ చలో అసెంబ్లీకి పిలుపునిచ్చింది.

రాష్ట్ర ప్రభుత్వం హైదరాబాదుకు వచ్చే అన్ని రైళ్లు, బస్సులను రద్దు చేసింది. జిల్లాల్లో వేలాది మంది తెలంగాణవాదులని ముందస్తు అరెస్టులు చేశారు. ఇందిరా పార్క్ వద్దకు, అసెంబ్లీ వద్దకు వచ్చే అన్ని రోడ్లు మూసేసిండ్రు.

పొద్దున్నే ఊరినుండి దామోదర్ కాక ఫోన్ చేసిండు. సి.పి.ఐలో ఉన్న ఆయన, పార్టీ కార్యక్రమం మేరకు చలో అసెంబ్లీలో పాల్గొనడానికి మక్ధూం భవన్ కు వస్తున్నానని చెప్పిండు. నేను 9 గంటలకు మక్ధూం భవన్ చేరుకునేసరికి అక్కడ ఆయన, ఇంకో ఇద్దరు ముగ్గురే ఉన్నారు.

ఏమయ్యింది ఎవరూ లేరని అడిగితే, అంతకు కొన్ని నిముషాల ముందే రెండు డిసీఎం వ్యాన్లలో పోలీసులు వచ్చి, ఆఫీసుపై దాడిచేసి అక్కడున్న వందపై చిలుకు కార్యకర్తలను, నాయకులను, చివరికి రాష్ట్ర సెక్రటరీ నారాయణనూ అరెస్టు చేసి ఈడ్చుకుపోయారని ఆయన బాధగా చెప్పాడు.

దామోదర్ కాకను పక్కనే ఉన్న AITUC భవన్ వద్ద వదిలిపెట్టి వేణు ఇంటికి పోయిన. ఇద్దరం కలిసి నడుచుకుంటు ఇందిరా పార్క్ వద్దకు చేరుకున్నాం.

అక్కడా అన్నీ బ్యారికేడ్లు, ముళ్లకంచెలతో మూసేసిండ్రు.

ఎటుచూసినా సీమాంధ్ర జిల్లాల నుండి తరలించిన పోలీసులు.

సన్నగా వాన మొదలైంది. ప్రతి పది పదిహేను నిముషాలకు ఒక గుంపు చొప్పున విద్యార్ధులు, ఉద్యోగులు ఇందిరా పార్క్ వద్దకు రావడం, వచ్చిన వారిని వచ్చినట్టు పోలీసులు అరెస్టు చేసి తీసుకుపోవడం.

నేను, జర్నలిస్టు మిత్రులైన వేణు, శైలేశ్ రెడ్డి, రమణ, బుచ్చన్న, పల్లె రవి కుమార్ వంటి వారితో ఉండటం వల్ల నన్ను పోలీసులు ఏమీ అనలేదు.

కొద్ది దూరంలో అశోక్ నగర్ చౌరస్తా వద్దనైతే పెద్ద యుద్ధమే జరిగింది. అక్కడికి ర్యాలీగా వస్తున్న జేయేసీ నాయకులను అడ్డుకున్న పోలీసులు వారిపై పాశవికంగా దాడికి పాల్పడ్డారు .

ప్రొఫెసర్ కోదండరాంనయితే మొదలు కిందపడేసిండ్రు. ఆ తరువాత గొంతుపట్టుకుని ఈడ్చుకుపోయిండ్రు. పాపం ఆయన కొద్దిసేపటివరకూ ఊపిరికూడా ఆడక చాలా బాధపడ్డడు. ఆయన చుట్టున్న తెలంగాణ జర్నలిస్టు మిత్రులయితే సార్ బాధ చూసి కళ్లనీళ్లపర్యంతం అయ్యిండ్రు.

ఇందిరా పార్కుకు వెనుకవైపునుండి కొంతమంది TRS కార్యకర్తలు వస్తున్నరంటే, మీడియావారితో పాటు నేను కూడ అటు ఉరికిన.

అక్కడికి TRS గ్రేటర్ అధ్యక్షుడు కట్టెల శ్రీనివాస్, పార్టీ అధికార ప్రతినిధి శ్రవన్ దాసోజు తదితరులు ఉరుక్కుంట వచ్చిండ్రు.

అంతే! వారి మీద డజన్ల కొద్దీ పోలీసోల్లు పడ్డరు. అటుఇటు గుంజిండ్రు. లాఠిలతో కొట్టిండ్రు. ఆ తోపులాటలో శ్రవన్ దాసోజు స్పృహతప్పి పడిపోయిండు. ఆందోళనపడ్డ తెలంగాణ మిత్రులు పోలీసుల సాయంతో ఆయనను హుటాహుటిన ఆసుపత్రికి తరలించిండ్రు.

షరా మామూలుగా చలో అసెంబ్లీని భగ్నం చేశామని కిరణ్ ప్రభుత్వం జబ్బలు చరుచుకుంది.

ఇదీ తెలంగాణ ప్రజలు చలో అసెంబ్లీకి పిలుపిస్తే జరిగే అణచివేత, ప్రభుత్వ దౌర్జన్యం. హక్కుల ఉల్లంఘన.

అదే ఇవ్వాళటి సీమాంద్ర “చలో అసెంబ్లీ” కి మాత్రం ప్రభుత్వం అధికారికంగా అనుమతి ఇచ్చి, ఇందిరా పార్క్ వద్ద ధర్నా కూడా జరుపుకోవడానికి అనుమతి ఇచ్చింది.

రెండు ప్రాంతాల ప్రజలకు వేర్వేరు హక్కులు ఉండే ఈ రాష్ట్రాన్ని ఇంకా సమైక్యంగా ఉంచడం ఎట్లా సాధ్యపడుతుంది?

 

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *