mt_logo

రంగారెడ్డి జిల్లాలో సీమాంధ్రుల కబ్జా

రాజేంద్రనగర్ నియోజకవర్గంలో టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు నాగేందర్ గౌడ్ శుక్రవారం మొదలుపెట్టిన సంపూర్ణ తెలంగాణ సాధన యాత్ర శనివారం శంషాబాద్ కు చేరింది. ఈ పాదయాత్రలో టీఆర్ఎస్ పోలిట్ బ్యూరో సభ్యుడు శ్రావణ్ కుమార్ పాల్గొని శంషాబాద్ మండలంలోని అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. తర్వాత అసెంబ్లీలో శైలజానాథ్ చేసిన ప్రసంగానికి నిరసనగా అతడి దిష్టి బొమ్మను దగ్ధం చేశారు. ‘తెలంగాణ ఉద్యమాన్ని కించపరిచి మాట్లాడిన మంత్రి శైలజానాథ్ కాదు, షేమ్ లెస్ నాథ్’ అని ఎద్దేవా చేశారు. జిల్లాను సీమాంధ్ర ప్రాంతానికి చెందిన కొందరు నాయకులు కబ్జా చేశారని, వారికి సహాయ సహకారాలు అందిస్తున్న జిల్లా నాయకులు ఇప్పుడు పాదయాత్రలు చేయడం వింతగా ఉందని అన్నారు. ఏనాడూ తెలంగాణ ఉద్యమంలో పాత్ర పోషించని కొందరు అవకాశవాదులు ఓట్ల కోసం తెలంగాణ రాష్ట్రం వచ్చేముందు పాదయాత్రలు చేయడం ప్రజలు గమనిస్తున్నారని, అలాంటి వారిని ప్రజలు దూరంగానే ఉంచుతారని శ్రావణ్ హెచ్చరించారు. రాబోయే ఎన్నికల్లో రాజేంద్రనగర్ నియోజకవర్గంలో టీఆర్ఎస్ పార్టీ విజయం సాధించాలని, అందుకు కార్యకర్తలు కృషి చేయాలని పిలుపునిచ్చారు. జిల్లా అధ్యక్షుడు నాగేందర్ గౌడ్ మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్రం ఎంతోమంది అమరుల కృషి వల్ల సిద్ధించిందని, రాష్ట్రాన్ని మేమే ఇస్తున్నామని చెబుతున్న వాళ్ళు ఉద్యమంలో ఎందుకు పాల్గొనలేదని మండిపడ్డారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ చేవెళ్ళ పార్లమెంటు నియోజకవర్గ ఇన్చార్జి కొండా. విశ్వేశ్వర్ రెడ్డి, టీఆర్ఎస్ మహిళా విభాగం జిల్లా అధ్యక్షురాలు స్వప్న, అశోక్, కె. శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *