mt_logo

సీమాంధ్ర నాయకుల ఒంటికంటి రాక్షసత్వం

By: కట్టా శేఖర్ రెడ్డి


ఇంత అప్రజాస్వామిక ఆధిపత్య సమూహంతో కలిసి జీవించడం ఎలా సాధ్యం? అవతలివాడు ఏమైనా పర్వాలేదు కలిసి ఉండాల్సిందే అన్న ఉన్మాద స్థితి ఎవరికి ఉంటుంది? ఆది నుంచీ మోసపోయింది తెలంగాణ. నష్టపోయింది తెలంగాణ. అస్తిత్వంకోసం అనేకసార్లు రక్తతర్పణ చేసింది తెలంగాణ. ఐదున్నర దశాబ్దాలుగా హక్కులకోసం తన్లాడుతున్నది తెలంగాణ. గత పన్నెండేళ్లుగా ప్రజాస్వామిక పద్ధతిలో పోరాడింది తెలంగాణ. సీమాంధ్ర రాజకీయ వికృత చేష్టలన్నింటినీ తట్టుకుని ఒక అజేయమైన పతాకంగా నిలబడింది తెలంగాణ. ఒక సుదీర్ఘ ప్రజాస్వామిక ఆకాంక్ష తీరా నెరవేరేవేళ, సీమాంధ్ర మెజారిటీ నాయకత్వం, పార్టీలూ చేస్తున్న దందా విస్మయాన్ని కలిగిస్తున్నది. వారికి సొంత పార్టీలపై నమ్మకం లేదు. సొంత పార్టీలు, నాయకత్వం ఇచ్చిన హామీలపై విశ్వాసం లేదు. అసెంబ్లీ, పార్లమెంటులపైనా గౌరవం లేదు. ప్రజాస్వామిక రాజకీయ వ్యవస్థలపై వేటిపైనా వారికి గురి లేదు.

ఇప్పటికీ అడ్డదారి, దొడ్డిదారి విధానాలనే వారు నమ్ముతున్నారు. న్యాయస్థానం ద్వారా కొందరు, రాష్ట్రపతి మీద భరోసాతో ఇంకొందరు ఒక ప్రజస్వామిక, రాజ్యాంగ ప్రక్రియను అడ్డుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. వారి ప్రయత్నాలు నెరవేరతాయా లేదా అన్నది వేరే విషయం, కానీ ఇవన్నీ వారి దుర్మార్గ స్వభావాన్ని, వారి ఆధిపత్య తత్వాన్ని, వారి అప్రజాస్వామిక పోకడలను తెలంగాణ ప్రజల ముందు నగ్నంగా నిలబెడుతున్నాయి. సీమాంధ్ర నాయకత్వం అనుసరిస్తున్న ఈ మోసపూరితమైన ధోరణే ఇవ్వాళ రాష్ట్రానికి శాపంగా మారింది. ముఖ్యమంత్రి తెలంగాణకు ముఖ్యమంత్రి కాదు. మంత్రులు తెలంగాణకు మంత్రు లు కాదు. పార్టీలూ తెలంగాణకు పార్టీలు కావు. ప్రతిపక్షనాయకుడు తెలంగాణకు నాయకుడు కాదు. జగన్‌మోహన్‌డ్డికీ తెలంగాణ ఏమీ కాదు. తెలంగాణ నిర్ణయం వెలువడిన శుభోదయాన జగన్ తెలంగాణలో తనను నమ్ముకున్న తమ పార్టీ నాయకులందరినీ హుసేన్‌సాగర్‌లో రాజకీయ నిమజ్జనం చేసేసి, సమైక్యాంధ్ర జెండాను ఎగురవేశాడు.

మొత్తం వ్యవస్థలు తెలంగాణపై కక్షగట్టినట్టు వ్యవహరిస్తుంటాయి. పోలీసులు అందరి పోలీసుల మాదిరిగా వ్యవహరించరు. హైకోర్టూ అందరికోర్టు అన్న భావన కలగడం లేదు. తెలంగాణవాళ్లు సభ పెట్టాలంటే సవాలక్ష సవాళ్లు. సీమాంధ్ర నేతలు సభలు పెట్టుకోవడానికి సకల సహాయ సహకారాలు. సీమాంధ్ర నాయకత్వానికి తెలంగాణ ప్రజలు ప్రజలు కాదు. ఆదిలాబాద్, ఖమ్మం జిల్లాల్లో 40 మండలాలు నెలరోజులకు పైగా వరద ముంపులో ఉండిపోయాయి. అక్కడికి వచ్చేవాడు లేడు పోయేవాడు లేడు. 600 కోట్ల ఆస్తులు, పంట నష్టం జరిగింది. వరంగల్, నల్లగొండ, కరీంనగర్ జిల్లాల్లో అనేక చెరువులు తెగి పంటపొలాలు, తోటలు నాశనమయ్యాయి. కానీ ముఖ్యమంవూతికి శ్రీకాకుళం వరద మాత్రమే వరదలా కనిపించింది. ప్రతిపక్షం ముఖ్యమంత్రి కార్యాలయం ముందు ధర్నా చేస్తుంది. మీడియా హృదయం చలించిపోతుంది. వరదబాధితులను పట్టించుకోవాలి. ఏ ప్రాంతం అన్నదానితో నిమిత్తం లేకుండా.

అందులో ఎవరికీ ఆక్షేపణ ఉండదు. కానీ ఈ ఒంటి కంటి రాక్షసత్వం ఏమిటి? నెలరోజులపాటు వరదలో చిక్కుకుపోయిన తూర్పు ఆదిలాబాద్ రైతులు కనిపించకపోవడం ఏమిటి? వరదధాటికి కరెంటు వ్యవస్థ పూర్తిగా ధ్వంసమైపోయి, బయటికి వచ్చే దారులన్నీ మూసుకుపోయి, చీకటిలో నరకం అనుభవించిన భద్రాచలం ప్రాంత రైతుల వెతలు కనిపించకపోవడం ఏమిటి? రెండుట్లు, మూడు రెట్ల సహాయం సంగతి సరే, కనీసం వారిని పరామర్శించకపోవడం ఏమిటి? తెలంగాణను పరాయి చేసి మీ మీ ఆత్మలను బట్టబయలు చేసుకున్న తర్వాత ఇప్పుడు ఏముఖం పెట్టుకుని కలిసుందామంటున్నారు? పచ్చి అబద్ధాలు, వక్రీకరణలు, తప్పుడు సమాచారాలతో తెలంగాణపై విషం చిమ్ముతున్న మీతో కలిసి ఉండడం ఎలా? ‘వాళ్ల (కొందరు సీమాంధ్ర ఎంపీల) ముఖాలు చూడాలంటే అసహ్యం, కోపం వస్తున్నాయి. తెలంగాణలో ఆ టీవీ చానెళ్లు లేకుంటే బాగుండు అనిపిస్తోంది’ అని ఒక మిత్రుడు ఫోనులో బాధను వ్యక్తం చేశాడు. ‘ఆ చానెళ్లు చూడకుండా ఉండే స్వేచ్ఛ మీకుంది కదా’ అంటే, ‘ఈ గడ్డ మీద ఉంటూ, ఈ గడ్డ మీద బతుకుతూ ఈ గడ్డకు వ్యతిరేకంగా చేస్తున్న కుట్రలను తెలుసుకోవాలి కదా’ అన్నాడా మిత్రుడు. ఇందులోని నీతి ఏమంటే, తెలుసుకోవాలి, పోరాడాలి తప్ప, పారిపోతే లాభం లేదు. ఇదే నీతి సీమాంవూధకూ వర్తిస్తుంది. ఎన్నికలకు ముందు రాష్ట్రాన్ని ఎలా విభజిస్తారు? అని ఒకరు, ఇంత తొందరగా విభజన ఎలా జరుగుతుంది? అని ఇంకొకరు, సీమాంవూధకు ఏమి చేస్తారో చెప్పకుండానే విభజిస్తారా? అని మరొకరు….ఇలా అనేక ప్రశ్నలు కురిపిస్తున్నా రు.

నిజమే. ఈ పరిస్థితికి కారణం ఎవరు? సమస్యను ఇంతదాకా లాగింది ఎవ రు? సీమాంధ్ర నాయకత్వం, పార్టీలు ఎన్నికల హామీలకు, ప్రజలకిచ్చిన వాగ్దానాలకు కట్టుబడి 2009 డిసెంబరు 9 నిర్ణయాన్ని స్వాగతించి ఉంటే సమస్య ఇంతదాకా వచ్చేదా? ఈ మూడేళ్లలో విభజన సమస్య పూర్తికాకపోయేదా? విభజనకు కావలసినంత సమయం దొరికేది కాదా? రాజధాని నిర్మాణం, భారీ ఆర్థిక ప్యాకేజీ, పోలవరం ప్రాజెక్టుకు ఆమోదం, రాయలసీమ ప్రాజెక్టులకు నీటి కేటాయింపులు, జాతీయస్థాయి సంస్థల ఆగమనం…ఇలా పనులు మొదలయి ఉండే వి కాదా? అప్పటి నుంచే సీమాంధ్ర ప్రజలను మానసికంగా సన్నద్ధం చేసి ఉంటే ఇవ్వాళ ఇంత క్షోభ ఉండేదా? వారికి నష్టం జరగనివ్వం అని ఈ పార్టీలు భరోసా ఇచ్చి ఉంటే ఇంత ఆందోళన జరిగి ఉండేదా? సీమాంధ్ర పార్టీలు, నాయకత్వాలు అక్కడి ప్రజలను, సామాజిక వర్గాలను, మేధావులను విశ్వాసంలోకి తీసుకుని, విభజన ఎప్పుడో ఒకప్పుడు తప్పదు, ఈ రావణ కాష్టాన్ని ఇంకా ఎంతోకాలం కొనసాగించలేము అని వివరించి ఉంటే ఇవ్వాళ ఇటువంటి వాతావరణం తలెత్తి ఉండేదా?

ఇవ్వాళ ఇద్దరు మహిళా మంత్రులు పురందేశ్వ రి, పనబాక లక్ష్మి ప్రదర్శించిన తెగువనే, ముందు నుంచీ కిరణ్, చంద్రబాబు, జగన్ ప్రదర్శించి ఉంటే సీమాంధ్ర ప్రజలు ఇంతటి మానసిక సంక్షోభానికి గురయ్యేవారా? హైదరాబాద్‌లో ఏదో లక్షలకోట్ల నిధి ఉంది, అది పోతుందని, సీమాంధ్ర యువతకు ఉద్యోగాలే రావని సీమాంధ్ర మీడి యా, పార్టీలూ గోలపుట్టించాయి. సీమాంధ్ర యువకులు బెంగళూరులో, నోయిడాలో, సిలికా న్ వ్యాలీలో ఉద్యోగాలు సంపాదించగలిగినప్పుడు హైదరాబాద్‌లో సంపాదించలేరా? కానీ రాజకీయ జూదంలోకింగ్‌లూ, కింగ్ మేకర్‌లూ కావాలని ఉవ్విళ్లూరుతున్న కొన్ని చానెళ్ల అధిపతులు ఉన్మాదంతో ఊగిపోయారు. హైదరాబాద్‌లో అంతా కోల్పోయామన్న భయాందోళనలను నలుచెరగులా ప్రచారం చేశారు. ప్రభుత్వానికి, ప్రతిపక్షాలకు నాయకత్వం వహిస్తున్న నేతలు ఒక్కరు కూడా అవి చేస్తున్న ప్రచారం నిజం కాదని చెప్పలేకపోయారు. పైగా అందరూ ఆ చానెళ్ల ప్రచార ఊబిలోకే జారిపోయారు.

వాళ్లు నిజాలు చెప్పి రాజకీయాల్లో మనుగడ సాగిద్దామని కాకుండా, అబద్ధాలు చెప్పి, అనుమానాలు పెంచి, విద్వేషాలు రగిలించి, అన్ని ప్రజాస్వామిక మర్యాదలను మరచి అటు సీమాంధ్ర ప్రజలను, ఇటు తెలంగాణ ప్రజలను వంచించాలనుకున్నారు. ఇప్పుడు చివరి నిమిషంలో కూడా అటువంటి మోసానికే పాల్పడుతున్నారు. తెలంగాణ విషయంలో సీమాంధ్ర ప్రజలను మోసం చేసింది ఇటాలియన్ కాదు, పీలేరు, నారావారి పల్లి, పులి పెద్దమనుషులే. ముందొకటి, వెనుకొకటి, మనసులో ఒకటి, పైకి మరొకటి మాట్లాడే పార్టీలను, నాయకులను ప్రజలు ఎందుకు నమ్మాలి? ఎంతకాలం భరించాలి? ఇటువంటి నాయకులతో, పార్టీలతో ఇంకా కలసి ఉండడం అసాధ్యం. బలవంతంగా కలిపి ఉంచాలని చూసే వాళ్లు తెలంగాణలో మనుగడ సాగించలేరు. ఇప్పుడు తెలంగాణను ఆపే ప్రయత్నాల పర్యవసానాలు తీవ్రంగా ఉంటాయని కూడా ఆ పార్టీలూ, నేతలూ గమనించాలి.

[నమస్తే తెలంగాణ సౌజన్యంతో ]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *