హైదరాబాద్ లో పదేళ్ళ రాజధాని కోసం అవకాశమిచ్చిన నేపధ్యంలో సీమాంధ్ర ప్రాంతానికి సొంత రాజధానిని నిర్మించే విషయంలో స్థల సేకరణ, ఆర్ధిక వనరుల సమీకరణ పై ప్రతిపాదనలను అధికారులు మంత్రుల బృందానికి పంపారు.
అలాగే సీమాంధ్ర జిల్లాల్లోని కలెక్టర్ల నుంచి ఆయా జిల్లాలలకు సంబంధించిన స్థల వివరాలు సేకరించి పంపారు. అందులో నాలుగు ప్రాంతాలను రాజధానికి అనువైనవిగా గుర్తించారు. సీమాంధ్ర ప్రాంతానికి సమదూరంలో వున్న విజయవాడ,గుంటూరు నగరాల మధ్య దాదాపు రెండు వేల ఎకరాల ప్రభుత్వ భూమి అందుబాటులో వుందని గుర్తించారు.
ప్రకాశం జిల్లాలో ఒంగోలు గుంటూరు మధ్య రాజధాని నిర్మాణానికి అనువైన ప్రభుత్వ భూమి దాదాపు 20 వేల ఎకరాలుగా గుర్తించారు. ఇంకా భూమి కావల్సివస్తే సేద్యానికి అనువుగా లేని మెట్ట భూములను అధికధరలు చెల్లించైనా సేకరించవచ్చని కేంద్రానికి తెలిపారు. ఈ ప్రాంతంలో నీటి సమస్యను కూడా అధిగమించవచ్చని, నాగార్జున సాగర్ నుండి కావల్సిన నీటిని డ్రా చేసుకునే అవకాశం వుంటుందని అధికార వర్గాలు కేంద్రానికి తెలిపాయి.
ఇదిలా వుండగా రాయలసీమ ప్రజలు మాత్రం రాజధానిని కర్నూలులోనే ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. కర్నూల్ లో రాజధానిని ఏర్పాటు చేస్తే కరువు ప్రాంతాన్ని అభివృద్ధి చేసినట్లు అవుతుందని, కావలసిన నీటిని శ్రీశైలం ప్రాజెక్ట్ నుండి తీసుకోవచ్చని కమిటీ తెలిపింది.
చివరి ప్రత్యామ్నాయంగా ఉత్తరాంధ్ర నాయకుల డిమాండ్ మేరకు విశాఖపట్నంలో కూడా రాజధానిని ఏర్పాటు చేయవచ్చని, లేదా విశాఖ, అనకాపల్లి మధ్య రాజధానిని ఏర్పాటు చేయవచ్చని తెలిపారు.
కొత రాజధాని నిర్మాణనికి నిధులను ఏ విధంగా సమీకరించాలనే అంశంపై కూడా కేంద్రానికి ప్రణాళికా విభాగం నివేదించింది.ఇందులో ముఖ్యంగా ప్రస్తుతం వున్న ఉమ్మడి రాష్ట్రంతో పాటు, కేంద్రం ఇచ్చే ఆర్ధిక సహాయం, ప్యాకేజీలను అంచనా వేసి ఇవ్వాలని నివేదికలో కేంద్రానికి తెలియజేసింది.