mt_logo

తెలంగాణలో 250 కోట్ల పెట్టుబడులు పెట్టనున్న ప్రముఖ వైద్య పరికరాల సంస్థ

తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు మరో సంస్థ ముందుకు వచ్చింది. ప్రముఖ వైద్య పరికరాల తయారీ సంస్థ ఎస్‌3వీ వాస్కులర్‌ టెక్నాలజీస్‌ హైదరాబాద్‌లోని మెడికల్‌ డివైజెస్‌ పార్కులో 250 కోట్ల పెట్టుబడులు పెట్టనుంది. ఈ మేరకు ఎన్3వీ సంస్థ గురువారం రాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకుంది. సంస్థ ప్రమోటర్లు బదరి నారాయణ్‌, డాక్టర్‌ విజయ గోపాల్‌ రాష్ట్ర పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి కేటీ రామారావుతో సమావేశమై మెడికల్‌ డివైజెస్‌ పార్కులో యూనిట్‌ ఏర్పాట్లపై చర్చించారు. ఈ సందర్భంగా కేటీఆర్‌ మాట్లాడుతూ.. హైదరాబాద్‌ దేశంలో వైద్య పరికరాల హబ్‌గా ఎదుగుతున్నందుకు ఎంతో సంతోషిస్తున్నట్టు చెప్పారు. ఎస్‌3వీ వాస్కులర్‌ టెక్నాలజీస్‌కు స్వాగతం పలికారు. 2017లో 1,500 కోట్ల పెట్టుబడులు… 7,000 ప్రత్యక్ష ఉద్యోగాలు కల్పించాలనే లక్ష్యంతో ఈ పార్కును ప్రారంభించినప్పటి నుంచి అద్భుతమైన వృద్ధిని నమోదు చేసినట్టు తెలిపారు. పరిశోధన, అభివృద్ధి, ఆవిష్కరణలు, తయారీ తదితర రంగాలను ప్రోత్సహించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. అనంతరం సంస్థ ప్రమోటర్ బదరి నారాయణ్‌ మాట్లాడుతూ.. చౌకగా వైద్య పరికరాలను తయారు చేయడం తమ సంస్థ లక్ష్యమని చెప్పారు. 250 కోట్ల పెట్టుబడి పెట్టనున్న ఈ తయారీ కేంద్రంలో డ్రగ్‌ ఎల్యూటింగ్‌ స్టెంట్‌ను తయారు చేయనున్నట్టు వివరించారు. ఈ పరిశ్రమ ద్వారా తమ సంస్థలో 500 మందికి ప్రత్యక్షంగా, 250 మందికి పరోక్షంగా ఉద్యోగావకాశాలు లభిస్తాయన్నారు. తాము ఏర్పాటు చేయనున్న సంస్థలో న్యూరో ఇంటర్వెన్షనల్‌ మెడికల్‌ డివైజెస్‌తోపాటు న్యూరో ట్రైనింగ్‌ సెంటర్‌, కార్డియో ఇంటర్వెన్షనల్‌ మెడికల్‌ డివైజెస్‌, డ్రగ్‌ కోటెడ్‌ క్రిటికల్‌ కేర్‌ కాథెటర్స్‌ తదితర మూడు విభాగాలుంటాయన్నారు. యూఎస్‌ఎఫ్‌డీఏ నిబంధనల ప్రకారం ఐదు ఎకరాల విస్తీర్ణంలో లక్ష చదరపు అడుగుల్లో సంస్థను నెలకొల్పనున్నట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్‌ రంజన్‌, లైఫ్‌ సైన్సెస్‌, ఫార్మా విభాగం డైరెక్టర్‌ శక్తి నాగప్పన్‌ తదితరులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *