mt_logo

అవయవ మార్పిడిపై దృష్టి పెట్టండి : మంత్రి హరీష్ రావు

రాష్ట్రంలోని బోధనాస్పత్రుల్లో అవయవ మార్పిడి చికిత్సలు చేయడంపై దృష్టి సారించాలని… ఇందుకు అవసరమయ్యే వైద్యపరికరాలు, మందులు ఇతర అవసరాలు సమకూర్చుకునేందుకు నిధులు ఇస్తామని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి టి.హరీశ్‌రావు ప్రకటించారు. అవయవ మార్పిడిలో పాల్గొన్న సదరు డాక్టర్లకు, పనిచేసే సిబ్బందికి ప్రోత్సాహకాలతోపాటు, ఆ ఆసుపత్రికి ఆరోగ్యశ్రీ కింద పది లక్షలు కూడా ఇస్తామని, కష్టపడి పనిచేయాలని సూచించారు. ఉమ్మడి ఆదిలాబాద్ పర్యటనలో మంత్రి హరీష్ రావు ముధోల్ లో 30 పడకల ఆసుపత్రికి, నిర్మల్ పట్టణంలో నిర్మించనున్న 250 పడకల జిల్లా ఆసుపత్రి భవనానికి శంకుస్థాపన చేశారు. ఆదిలాబాద్ లో 150 కోట్లతో నిర్మించిన రిమ్స్ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో మంత్రి మాట్లాడుతూ… పేదలకు వైద్యం అందించడంలో దేశంలోనే తెలంగాణ మూడో స్థానంలో ఉందని.. నంబర్‌ వన్‌గా నిలిపేందుకు కలిసికట్టుగా కృషి చేద్దామని పిలుపునిచ్చారు. దేశంలో పేదల గురించి ఆలోచించే తెరాసదే అన్నారు. అరవై ఏళ్లపాటు కొనసాగిన ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ ప్రాంతానికి మూడే మెడికల్‌ కాలేజీలు వచ్చాయని.. ఏడేళ్ల స్వరాష్ట్ర పాలనలో ఏకంగా 17 ఏర్పాటు చేసుకున్నామని చెప్పారు. అప్పట్లో వరంగల్‌లో రైతులు బస్తాకు రూపాయి చొప్పున జమ చేసుకుని ఆస్పత్రి కట్టుకుంటే… తర్వాత సమైక్య పాలకులు దానిని మెడికల్‌ కాలేజీగా మార్చారన్నారు. రాష్ట్రంలో ఆస్పత్రుల పనితీరుపై నెలనెలా సమీక్షిస్తున్నామని హరీశ్‌రావు చెప్పారు. హెల్త్‌ ప్రొఫైల్‌ కార్యక్రమాన్ని ప్రయోగాత్మకంగా ప్రారంభించిన తర్వాత అన్ని జిల్లాల్లో అమలు చేసి, ప్రతి ఒక్కరికి డిజిటల్‌ హెల్త్‌కార్డు అందిస్తామన్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *