mt_logo

గురుకుల విద్యను తీర్చిదిద్దిన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్‌ను గెలిపించాలి: కేసీఆర్

నాలుగవ రోజు బస్సు యాత్రలో భాగంగా.. బీఆర్ఎస్ పార్టీ అధినేత నాగర్‌కర్నూల్ రోడ్డు షోలో పాల్గొన్నారు. శుక్రవారం మూడవ రోజు బస్సు యాత్ర, రోడ్డు షో అనంతరం, మహబూబ్‌నగర్‌లో బస చేసిన కేసీఆర్, శనివారం నాగర్‌కర్నూల్ రోడ్డు షోలో పాల్గొన్నారు.

యాత్రలో పలు వర్గాల ప్రజలు కేసీఆర్ తో భేటీ అయ్యారు. బస్సు యాత్రకు అడుగడుగునా ప్రజలు నీరాజనాలు పలికారు. హారతులతో పూలు చల్లి ఘన స్వాగతం తెలిపారు.

ఈ సందర్భంగా హాజరైన అశేష జనవాహినిని ఉద్దేశించి కేసీఆర్ ప్రసంగించారు. నేడు బీ ఆర్ఎస్ పార్టీ ఆవిర్భావం.. తెలంగాణ రాష్ట్రానికి శంఖుస్థాపన జరిగిన రోజు. బీఆర్ఎస్ పుట్టింది, పెరిగింది, మహాసముద్రమైంది అని పేర్కొన్నారు.

ఉద్యమకాలంలో చాలాసార్లు నాగర్‌కర్నూల్‌కు వచ్చిన.. మహబూబ్‌నగర్ ఎంపీగా ఉన్నప్పుడే తెలంగాణ వచ్చింది.. కేసీఆర్ సచ్చుడో తెలంగాణ వచ్చుడో అని త్యాగాలు చేసి తెలంగాణ తెచ్చుకున్నాం.. అన్ని వర్గాల ప్రజలను గులాబీ జెండా తన నీడన కోడిపిల్లను కాపాడుకున్నట్టు కాపాడుకుంది అని అన్నారు.

రైతుబంధు వచ్చిందా.. రూ. 2,500 వచ్చినయా, రుణ మాఫీ అయిందా, స్కూటీ వచ్చిందా, బోనస్ వచ్చిందా.. సీఎం విను నేను జనం నడుమ నుంచి మాట్లాడుతున్నా అని కాంగ్రెస్ ప్రభుత్వంపై కేసీఆర్ ధ్వజమెత్తారు.

పండించిన ధాన్యాన్ని కూడా కొనలేకపోతున్నారు..రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు.. కేసీఆర్ చేసి తయారు పెట్టిందే కదా గడ్డపార పెట్టి కొత్తగా తొవ్వేది లేదు. నేను శ్రీనివాస్ గౌడ్ ఇంట్లో ఉన్నప్పుడు కరెంటు పోయింది ఏంది సంగతి అని అడిగితే రోజు 10 సార్ల పోతున్నది అని చెప్పిండ్రు అని తెలిపారు.

ఐదు ఎకరాలకు మాత్రమే రైతుబంధు ఇస్తానంటే మరి ఆరో ఎకకరమోడు ఎటుపోవాలే.. రైతుబంధు టింగు టింగు మని మెసేజ్ లోచ్చేటియి మన ప్రభుత్వంలో అని గుర్తు చేశారు.

కాంగ్రెస్‌కు తెలంగాణ ప్రజలకు పంచాయతి పడ్డది.. మరి మీ తరఫున కొట్లాడే పంచాతీ పెద్దమనిషి పంజు ఎవరు మరి? మరి మీరు నాకు బలం ఇస్తేనే కొట్లాడగలుగుత.. ఆర్ఎస్ ప్రవీణ్‌ను గెలిపిస్తేనే మీరు నాకు బలాన్ని ఇచ్చినట్టు అని కేసీఆర్ అన్నారు.

బీజేపీ వందలాది వాగ్దానాలు ఇచ్చింది ఒకటన్నా అమలు చేసిండా మోడీ.. బేటి పడావో అయిందా. మరి ఎందుకెయ్యాలి బీజేపీకి ఓటు.. చట్టం ప్రకారం రావాల్సిన నవోదయ ఇయ్యలే.. మెడికల్ కాలేజీ ఇయ్యలే.. పాలమూరు ఎత్తిపోతలకు జాతీయ హోదా ఇయ్యలే అని దుయ్యబట్టారు.

నా తలతెగిపడ్డా మోటార్లకు మీటర్లను పెట్టనియ్య అని చెప్పిన మోడీకి.. మనం ఉన్మాదంల పడిపోవద్దు.. మీ మీ గ్రామాల్లో చర్చించండి.. మనకోసం పని చేసే పార్టీని గెలిపించుకోవాలి అని కోరారు.

బీజేపీ మనకు అక్కరకురాని చుట్టం. తెలంగాణ ఎన్నికల కోసం గుజరాత్ ముఖ్యమంత్రి ఇక్కడికి రావాల్నా.. గురుకుల విద్యను తీర్చిదిద్దిన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్‌ను గెలిపించాలి.. ప్రవీణ్ ఆశామాశి వ్యక్తి కాదు. అసంటోళ్లు మల్లా దొరుకరు అని కొనియాడారు.

అల్లా కే ఘర్ మే దేర్ హోగా మగర్ అందేఆర్ నహీ.. తెలంగాణ రాష్ట్రం సాకారమైంది. ముస్లిం సమాజానికి యువతకు వినతి.. ఎట్టిపరిస్థితిలో బీజేపీ గెలవకూడదు.. బీఆర్ఎస్‌ను గెలిపించాలి.. మహబూబ్ నగర్‌, నాగర్‌కర్నూలులో మనమే గెలుస్తున్నాం అని కేసీఆర్ తేల్చి చెప్పారు.

కేసీఆర్ గుడ్లు పీకి గోళీలు ఆడుకుంటా.. పేగులు తీసి మెదలేసుకుంటా.. ముడ్డి మీది చెడ్డి గుంజుకుంట అని సీఎం అంటున్నాడు.. ఇది పద్ధతేనా అని ప్రజలను అడిగారు.

మళ్ళీ మన ప్రభుత్వమే వస్తుంది. ఎక్కడ పోయినా అపూర్వ స్పందన వస్తున్నది. గుమ్మడికాయలతో, పూలతో స్వాగతం పలుకుతున్నారు. తెలంగాణ సమాజం కాంగ్రెస్ మీద భగ్గుమంటున్నది అని అన్నారు.