mt_logo

ప్రతి నియోజకవర్గంలో గిడ్డంగులు ఉండాలి- సీఎం కేసీఆర్

రాష్ట్రంలోని ప్రతి నియోజకవర్గంలో గిడ్డంగుల నిర్మాణాలు జరగాలని, ఇవి రైతులకు ప్రయోజనకరంగా ఉండాలని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు అధికారులను ఆదేశించారు. మంగళవారం సచివాలయంలో మంత్రి హరీష్ రావుతో కలిసి మార్కెటింగ్ శాఖ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ, గిడ్డంగుల నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం పంపిన ప్రతిపాదనలను అంగీకరిస్తూ నాబార్డు రూ. 1000 కోట్లు మంజూరు చేసిందని, ఈ నిధులతో ప్రతి నియోజకవర్గంలో గిడ్డంగులను నిర్మించాలని ఆదేశించారు.

ప్రస్తుతం రాష్ట్రంలో ఎన్ని మార్కెట్లు ఉన్నాయి? వాటి పరిధిలో ఎన్ని గిడ్డంగులు ఉన్నాయి? ఇంకా ఎన్ని అవసరమున్నాయి? అనే వివరాలను సీఎం అధికారులను అడిగి తెలుసుకున్నారు. ప్రస్తుతం 150 మార్కెట్లు ఉన్నట్లు, కొత్తగా 39 మార్కెట్ల కోసం నోటిఫికేషన్ ఇచ్చినట్లు అధికారులు తెలిపారు. గిడ్డంగుల నిర్మాణానికి స్థలాలు లేకపోతే స్థానిక మంత్రులు, ఎమ్మెల్యేలతో చర్చించి నిర్మాణానికి అవసరమైన భూమిని సేకరించాలని, మొదటి దశలో భూసేకరణ అవసరం లేకుండా నిర్మాణాలు చేయడానికి అనువుగా ఉన్న స్థలాలు గుర్తించి వెంటనే నిర్మాణాలు చేపట్టాలని సూచించారు. ప్రతి మార్కెట్ లో ఫర్టిలైజర్స్, ప్రజాపంపిణీకి అవసరమైన ధాన్యంతో పాటు రైతులు తమ పంటలను నిల్వ చేసుకునేలా గిడ్డంగుల నిర్మాణం ఉండాలని కేసీఆర్ చెప్పారు.

మారుమూల ప్రాంతాల రైతులకు అందుబాటులో ఉండేలా గిడ్డంగులు నిర్మించాలని, ఎరువులను దింపే రేక్ లను పెంచాలని సీఎం పేర్కొన్నారు. రాష్ట్రంలోని రైతులందరికీ ఎరువులు సరఫరా చేయడానికి రవాణా ఖర్చు పెరుగుతుందని, రేక్ పాయింట్స్ పెంచితే ఖర్చులు తగ్గి రైతులకు భారం తగ్గుతుందని సీఎం పేర్కొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *