లంచం తీసుకుంటూ ఏసీబీకి దొరికిన కీసర ఎమ్మార్వో నాగరాజు పై కేసు దర్యాప్తు వేగం పుంజుకుంది. నాగరాజుతో సహా మరో ముగ్గురిని ఏసీబీ అధికారులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. కీసర, ఆల్వాల్, కాప్రా లలో నాగరాజు ఇల్లు, ఆఫీసులో పలు కీలక పత్రాలను స్వాధీనం చేసుకుని అధికారులు విచారణ చేపట్టారు. నాగరాజుకు సంబంధించిన ఓ బ్యాంకు లాకర్ తాళం చెవితో పాటు పెద్ద మొత్తంలో భూములు కొనుగోలు చేసిన పత్రాలు గుర్తించారు. ఆ లాకర్ ను ఓపెన్ చేస్తే మరిన్ని కీలక ఆధారాలు లభిస్తాయని, అతడికి సహకరించిన వారి వివరాలపై అధికారులు కూపీ లాగబోతున్నట్లు సమాచారం.
ఇదిలా ఉండగా కీసర మండలం రాంపల్లి దాయరలోని రియల్టర్ అంజిరెడ్డి ఇంట్లో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. అంజిరెడ్డి ఇంట్లో కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎంపీ రేవంత్ రెడ్డికి సంబంధించిన పలు లెటర్ ప్యాడ్స్, వివాదాస్పద భూములపై ఆర్టీఐ చట్టం కింద వేసిన దరఖాస్తులను స్వాధీనం చేసుకున్నారు. మరోవైపు ఏసీబీ సోదాలు ముగిసిన తర్వాత ఆల్వాల్ లోని నాగరాజు ఇంటికి బెంజ్ కారులో వేగంగా వచ్చిన ఓ వ్యక్తి నాగరాజు ఇంట్లోకి వెళ్ళి కొన్ని పత్రాలు పట్టుకుని అంతే వేగంగా వెళ్ళినట్లు తెలిసింది. మరికొద్దిసేపట్లో ఒక ఇన్నోవా కారులో ఇద్దరు వ్యక్తులు రాగా, వారికి నాగరాజు కుటుంబ సభ్యులు కొన్ని కీలక పత్రాలను అందించినట్లు తెలిసింది.
నాగరాజు అక్రమాలు అన్నీ ఇన్నీ కావు!.. దేశవిదేశాల్లోనూ ఇతగాడికి బినామీలు ఉన్నారని, అక్రమ ఆస్తులను అమెరికాలో ఉన్న మిత్రుల పేరిట కొనుగోలు చేసినట్లు తెలిసింది. నగదు మార్వాడీ సేట్ల వద్ద పెట్టాడని, వారితో కలిసి పలు రాష్ట్రాలకు విలాసాల కోసం వెళ్ళినట్లు సమాచారం. అంతేకాకుండా అమెరికాలో ఉంటున్న మిత్రుల పేరిట ఆల్వాల్, బొల్లారం, ఏఎస్ రావ్ నగర్, కొంపల్లి ప్రాంతాల్లో ఖరీదైన ఆస్తులను కూడబెట్టినట్లు తెలిసింది. సర్వే నంబర్ లో స్థల విస్తీర్ణం అధికంగా లేకున్నా, డబుల్ ఎంట్రీస్ లేకున్నా వాటిని బ్లాక్ చేసి ఆన్ లైన్ లో లేకుండా చేస్తాడు. ఆన్ లైన్ పహాణీలు రాకపోవడం, డిజిటల్ సంతకం లేకపోవడంతో సదరు బాధితులు తహశీల్దార్ ను కలిస్తే వారిని డబ్బు డిమాండ్ చేసి ముప్పుతిప్పలు పెడ్తాడు. సోదాల్లో దొరికిన ఆధారాలను బట్టి మరికొంత మందిని విచారిస్తే పలు కీలక విషయాలు రాబట్టవచ్చని ఏసీబీ అధికారులు భావిస్తున్నారు.