mt_logo

ఎసిబి దాడితో కదిలిన రేవంత్ రెడ్డి డొంక

భూవివాదం కేసు పరిష్కరించేందుకు రూ.1 కోటి 10 లక్షలు లంచం తీసుకుంటూ ఇటీవల కీసర ఎమ్మార్వో నాగరాజు పట్టుబడిన విషయం తెలిసిందే. అయితే ఇందులో ఇంకో కోణం బయట పడింధి. అదేంటంటే అధికారులు అక్కడ సోదాలు జరిపినప్పుడు నాగరాజుతో పాటు రియల్ ఎస్టేట్ వ్యాపారి కందాటి అంజిరెడ్డి కూడా ఉన్నారు. ఏసీబీ అధికారులు అంజిరెడ్డి ఇంట్లో కూడా సోదాలు నిర్వహించి రేవంత్ రెడ్డికి సంబంధించిన ల్యాండ్ పత్రాలు, లెటర్ ప్యాడ్లు, సమాచార హక్కు పిటిషన్లు గుట్టలు గుట్టలుగా స్వాధీనం చేసుకున్నారు. వివాదాస్పద భూముల మీద సమాచార హక్కు పిటిషన్లు వేయడంతో పాటు సంబంధిత వ్యక్తులను వివిధ రకాలుగా బ్లాక్ మెయిల్ చేస్తూ రేవంత్ రెడ్డి బెదిరించాడని తెలిసింది. మరీ ముఖ్యంగా కలెక్టర్ కార్యాలయంలో ఉండాల్సిన పత్రాలను అంజిరెడ్డి ఇంట్లో ఏసీబీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు.

రేవంత్ రెడ్డి మల్కాజిగిరి ఎంపీగా పోటీ చేసినప్పుడు అతడి కోసం కందాటి అంజిరెడ్డి పనిచేశారు. అంజిరెడ్డి రియల్ ఎస్టేట్ వ్యాపారి మాత్రమే కాదు. కాంగ్రెస్ నేత కూడా. అయితే అంతకుముందు ఆయన తెలుగుదేశం నేత. కీసర మండలంలోని కొన్ని గ్రామాల్లో అంజిరెడ్డికి మంచి పట్టు ఉంది. రేవంత్ రెడ్డికి, అంజిరెడ్డికి సత్సంబంధాలు ఉండడంవల్ల ఈ కేసులో రేవంత్ రెడ్డికి కూడా సంబంధం ఉందా అనే కోణంలో అధికారులు దర్యాప్తు చేపట్టారు.

కేసులో కీలక వ్యక్తిగా ఉన్న అంజిరెడ్డి ఇంట్లో ఎంపీ రేవంత్ రెడ్డికి సంబంధించిన అధికారిక పత్రాలను ఏసీబీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. మల్కాజిగిరి ఎంపీ రేవంత్ రెడ్డి ఎంపీ లాడ్స్ కు సంబంధించిన ఒరిజినల్ పత్రాలతో పాటు వివాదాస్పద భూములపై రేవంత్ రెడ్డి ఆర్టీఐ చట్టం కింద చేసిన దరఖాస్తులు దొరికాయి. రేవంత్ రెడ్డితో అంజిరెడ్డికి ఉన్న సాన్నిహిత్యం దృష్ట్యా ఆ దిశగానూ అధికారులు విచారణ చేపట్టారు. ఇదిలా ఉండగా తనకు పాస్ బుక్ ఇవ్వకుండా ఎమ్మార్వో నాగరాజు ఇబ్బంది పెడుతున్నాడని మాజీ పోలీస్ అధికారి ఒకరు చెప్పారు.

మరోవైపు లంచం తీసుకుంటూ పట్టుబడ్డ ఎమ్మార్వో నాగరాజు వద్ద ఓ ఎంపీ లేఖ లభించినట్లు వార్తలు వస్తున్న నేపథ్యంలో ఆ లేఖ ఏ ఎంపీదో బయట పెట్టాలని తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నేత వీ. హనుమంతరావు డిమాండ్ చేశారు. ఇప్పటికైనా పార్టీని భ్రష్టు పట్టిస్తున్న ఎంపీ రేవంత్ రెడ్డిపై టీపీసీసీ చర్యలు తీసుకుంటే మంచిదని పలువురి అభిప్రాయం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *