రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి మంగళవారం ఢిల్లీలో కేంద్ర ఎరువులు, రసాయనాల శాఖామంత్రి సదానందగౌడతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్రానికి కేటాయించాల్సిన ఎరువులపై కేంద్రమంత్రితో చర్చించారు. అనంతరం మంత్రి నిరంజన్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ దేశంలో 60 శాతం ప్రజలకు వ్యవసాయరంగం ఉపాధి కల్పిస్తున్నదని, దానిని కాపాడే బాధ్యత తమదేనని కేంద్రమంత్రి సదానందగౌడ తనకు చెప్పారని అన్నారు. అంతేకాకుండా తెలంగాణ రైతులకు ఆసరాగా ఉంటామని, ఇచ్చిన మాటకు కట్టుబడి ఎరువులు సరఫరా చేస్తామని హామీ ఇచ్చారని, ఇందుకోసం కేంద్రమంత్రికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరపున కృతజ్ఞతలు తెలిపినట్లు నిరంజన్ రెడ్డి పేర్కొన్నారు.
గత సంవత్సరం కంటే వంద రెట్లు వినియోగం పెరిగినా కూడా ఎరువుల కొరత లేకుండా చర్యలు తీసుకుంటున్నట్లు నిరంజన్ రెడ్డి తెలిపారు. 18 వేల మెట్రిక్ టన్నుల బఫర్ స్టాక్ రాష్ట్రంలో అందుబాటులో ఉందని, తెలంగాణ వ్యవసాయ శాఖ నిద్రాహారాలు మాని రైతుల సంక్షేమం కోసం కృషి చేస్తుందని ఆయన స్పష్టం చేశారు. రైతులకు ఎరువుల కొరత లేకుండా ముందస్తు చర్యల్లో భాగంగా కేంద్రమంత్రిని కలిసి రాష్ట్రానికి రావాల్సిన ఎరువుల కోటా విడుదల కోసం కృషి చేస్తున్నట్లు చెప్పారు.