చెరువుల పునరుద్ధరణకు తక్కువ సమయం ఉన్నదని, ఈ 40 రోజుల్లోనే పనులు పూర్తిచేయాలని భారీ నీటిపారుదల శాఖ మంత్రి హరీష్ రావు అన్నారు. గురువారం మెదక్ జిల్లా సిద్దిపేట మండలం రాఘవాపూర్ డీఎస్పీ శ్రీధర్ ఆధ్వర్యంలో పోలీసులు దత్తత తీసుకున్న పెద్ద చెరువులో, రంగారెడ్డి జిల్లా మేడ్చల్ చెరువులో పనులను మంత్రులు హరీష్ రావు, మహేందర్ రెడ్డి, ఎమ్మెల్యే సుధీర్ రెడ్డితో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ, చెరువు శిఖం భూములు కబ్జా చేస్తే క్రిమినల్ కేసులు నమోదు చేయాలని, భూగర్భ జలాలు పెంచేందుకే మిషన్ కాకతీయ పనులు చేపట్టామని చెప్పారు.
మన పోలీసులు తెలంగాణలో రైతుల కోసం చెరువులు దత్తత తీసుకోవడం అభినందనీయమని, ఇదే స్ఫూర్తితో రాష్ట్రంలోని పోలీసులు ముందుకొచ్చి చెరువులను దత్తత తీసుకోవాలన్నారు. మిషన్ కాకతీయ గులాబీ మయంగా మారిందని బీజేపీ, కాంగ్రెస్ నాయకులు మాట్లాడటం హాస్యాస్పదమని, బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డికి చెరువులను పునరుద్ధరించడం ఇష్టం లేదని అర్ధం అవుతుందని హరీష్ రావు పేర్కొన్నారు.