ఏపీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబుపై మంత్రి జూపల్లి కృష్ణారావు మండిపడ్డారు. మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన కల్వకుర్తి భీమా, కోయిల్ సాగర్, నెట్టెంపాడు వంటి ప్రాజెక్టులకు టీడీపీ హయాంలో జరిగిన కేటాయింపులపై మహబూబ్ నగర్ అమరవీరుల స్థూపం వద్ద లెక్కలు తేల్చుకునేందుకు రావాలని బాబుకు మంత్రి జూపల్లి సవాల్ విసిరారు. గురువారం తెలంగాణ భవన్ లో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, చంద్రబాబు తన గారడీ మాటలను కట్టిపెట్టాలని, దొంగ లెక్కలతో, అబద్ధాలతో జనాన్ని మోసం చేయలేరని, ఆయన హయాంలో 9గంటలు విద్యుత్ ఇవ్వలేని దుర్మార్గమైన పరిస్థితిని ప్రజలు మర్చిపోలేదన్నారు. రాష్ట్రంలో 20 వేల మెగావాట్ల విద్యుత్ ఉత్పాదన కోసం ప్రణాళికలు రూపొందించడం, 32 వేలకోట్లతో వాటర్ గ్రిడ్ కార్యక్రమం చేపట్టడం సీఎం కేసీఆర్ కే సాధ్యమని అన్నారు.
తెలంగాణను నిలువుదోపిడీ చేసిన చంద్రబాబు తిరిగి తెలంగాణను కబ్జా చేయాలని చూస్తున్నాడని, ఆయన ఆటలు తెలంగాణ ప్రజలు సాగనీయరని మంత్రి స్పష్టం చేశారు. తెలంగాణ టీడీపీ ఎమ్మెల్యేలు తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత కూడా కోస్తాంధ్ర పార్టీనే నమ్మడం విడ్డూరంగా ఉందన్నారు. తెలంగాణ అభివృద్ధి కోసం చంద్రబాబు భారీ నిధులను కేటాయిస్తే ప్రజల సమక్షంలోనే ముక్కు నేలకు రాసుకుంటానని జూపల్లి పేర్కొన్నారు. 64 ఏండ్ల కాంగ్రెస్, టీడీపీల కాలంలో 5 వేల మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి కూడా చేయలేకపోయారని, 1995 నుండి 2004వరకు అధికారంలో ఉన్న టీడీపీ మహబూబ్ నగర్ జిల్లాలోని ప్రాజెక్టులకు రూ. 3వేల కోట్లు అవసరముంటే కేవలం రూ. 5 కోట్లు కేటాయించిందని గుర్తుచేశారు. మాట్లాడటానికి కూడా కొన్ని హద్దులు ఉంటాయని, చంద్రబాబు తన వల్లే తెలంగాణ ధనిక రాష్ట్రం అయ్యిందని చెప్పడం హాస్యాస్పదంగా ఉందని జూపల్లి విమర్శించారు.