mt_logo

అసమాన కలం యోధుడు కంబాలపల్లి శేఖర్

కొణతం దిలీప్

కొంచెం పని ఉండి నిన్న మోత్కూర్ పోయినుంటి. ఉదయమే లేచి వద్దామని రాత్రి అక్కడే ఉండిపోయిన. ఇవ్వాళ ఉదయం నిద్రలేస్తూనే ఆ దుర్వార్త ఎస్సెమ్మెస్ రూపంలో వచ్చి నన్ను నిద్రలేపింది.

ఈ వారం శేఖర్ ను కలవాలనుకున్నాను. ఆయన పరిస్థితి దగ్గరగా చూసిన మాబోటి వారందరికీ తెలుసు ఈ రోజు ఎంతో దూరంలో లేదని. కానీ నిజంగానే శేఖర్ ఇక లేడని తెలిశాక మాత్రం చాలా బాధగా అనిపించింది.

నాలుగేళ్ల క్రితం, తెలంగాణ ఉద్యమం ఉధృతంగా సాగుతున్న రోజుల్లో ఒక కెమెరా భుజాన వేసుకుని జరిగే ప్రతి ఆందోళనా, మీటింగూ ఫొటోలు తీయడమే పనిగా ఉండేది నాకు. 1969 ఉద్యమం గురించి అనేక కీలక అంశాలను డాక్యుమెంట్ చేయలేకపోయినం అని తెలిసిన క్షణానే కొంతమంది మిత్రులం ఈసారి మాత్రం ఉద్యమాన్ని సాధ్యమైనంతగా డాక్యుమెంట్ చేయాలని నిర్ణయించుకున్నాం.

అలా మొదలైన నా డాక్యుమెంటేషన్లో భాగంగా మార్చి 9 2010 నాడు శేఖర్ పుస్తకం “గిదీ తెలంగాణ” పుస్తకావిష్కరణకు వెళ్లాను. అందులోని ఒక్కో బొమ్మా చూసి గొప్ప ఉద్విగ్నతకు లోనయ్యాను. తెలంగాణ ఎందుకు కావాలో అప్పటికి అనేకమంది మేధావులు వందలాది వ్యాసాలు, పుస్తకాలు రాశారు. కానీ ఇవన్నీ ఒక ఎత్తైతే శేఖర్ వేసిన ఆ పుస్తకం ఒక ఎత్తు. అక్షరం ముక్కరాని వాళ్ల నుండి గొప్పచదువులు చదివి కూడా తెలంగాణ ఎందుకు కావాలో అర్థంచేసుకోని “హై-క్లాస్” పీపుల్ వరకూ…అందరికీ అరటిపండు వలచి చేతిలో పెట్టినట్టు ఆ పుస్తకంలో శేఖర్ తెలంగాణ కథ చెప్పాడు.  శేఖర్ గీసిన ఒక్కో బొమ్మ లక్ష పదాలతో సమానం.

గిదీ తెలంగాణ కవర్ పేజి

గిదీ తెలంగాణ పుస్తకంలో ఒక చిత్రం

ఆరోజే నా బ్లాగులో “తెలంగాణా ఉద్యమానికో కొత్త ఆయుధం దొరికింది” అని రాశాను.

[పుస్తకావిష్కరణ ఫొటోలు ఇక్కడ చూడండి:

http://picasaweb.google.co.in/konatham.dileep/GideeTelanganaBookLaunchMe ]

నిజంగానే “గిదీ తెలంగాణ” లోని బొమ్మలు ఆ తదనంతర కాలంలో ప్రతి తెలంగాణ మీటింగులో ఫ్లెక్సీల మీదికి ఎక్కాయి – అక్కడి నుండి అవి సోషల్ మీడియాలోనూ అత్యంత ప్రజాదరణ పొందాయి.

తెలంగాణ ఉద్యమం మీద బొమ్మలు వేయడం మామూలుగానైతే పెద్ద గొప్ప విషయం కాకపోవచ్చు, కానీ శేఖర్ ఆ పనిని ఆంధ్రజ్యోతి వంటి పత్రికలో ఉంటూ చేయడం చాలా గొప్ప విషయం. యాజమాన్యాల ఆజ్ఞ జవదాటితే ఉద్యోగం ఊడే మీడియారంగంలో ఉండి కూడా శేఖర్ ఈ సాహసం చేయడం ఆయనలో ఉన్న పోరాటస్వభావాన్ని చాటుతోంది.

“గిదీ తెలంగాణ” పుస్తకం తరువాతే శేఖర్ తో పరిచయం కొంచెం పెరిగింది. అప్పుడప్పుడూ ఫోన్లో మాట్లాడుకోవడం జరుగుతుండేది.

ఆ తరువాత రెండేళ్లకు ఆయన అంతర్జాతీయ కార్టూనిస్టుల సమావేశానికి అమెరికా వెళ్లడం, అక్కడ కూడా “కలర్స్ ఆఫ్ ఇండియా” అనే పుస్తకం ఆవిష్కరించడం జరిగింది.

అమెరికా నుండి వచ్చిన కొన్ని నెలలకే శేఖర్ అనారోగ్యం బారిన పడ్డాడు. మొదట ఏదో చిన్న గ్యాస్ట్రిక్ సమస్య అనుకున్నది కాస్తా అటుతిరిగి, ఇటుతిరిగి చివరికి క్యాన్సర్ మహమ్మారి అని తెలిసిందట.

కానీ శేఖర్ అనారోగ్యం గురించి నాకు కొంచెం ఆలస్యంగానే తెలిసింది. వెళ్లి కలిసి వద్దామని అనుకుంటుండగానే డిసెంబర్ 27, 2013 నాడు తానే ఫేస్ బుక్ లో మెసేజ్ పెట్టాడు. తాను కులవ్యవస్థపై ఒక పుస్తకం తీసుకురావాలనుకుంటున్నానని. ఏమైనా అయిడియాలు ఉంటే సూచించమని రాశాడు.

ఇంటికి వచ్చి కలుస్తానని చెప్పాను.

మరుసటి రోజు బోడుప్పల్ లో ఉండే శేఖర్ ఇంటికి వెళ్లి ఆయనను చూసి నిజంగానే షాక్ కు గురయ్యాను. శేఖర్ చాలా నీరసించి పోయాడు. సర్జరీ, కీమోథెరపీ, రేడియేషన్ ఆయన శరీరాన్ని శిధిలం చేసేశాయి.

ఇంటి బయటికి వచ్చి మరీ నన్ను చేయిపట్టుకుని ఇంట్లోకి తీసుకుపోయాడు. కాసేపు అవీ ఇవీ మాట్లాడుకున్నాక లోపలికి వెళ్ళి ఒక కాగితాల కట్టతో వచ్చాడు.

“నన్ను పీడిస్తున్న క్యాన్సర్ కన్నా ప్రమాదకరమైన క్యాన్సర్ ఇవ్వాళ మనదేశాన్ని పీడిస్తున్నది. దాన్ని రూపుమాపకపోతే దేశ భవిష్యత్తుకే పెద్దప్రమాదం, అందుకే కులం క్యాన్సర్ మీద ఈ బొమ్మలు వేసిన. చూసి ఎట్లున్నయో చెప్పండి” అన్నడు.

ఒక్కో బొమ్మా ఒక్కో మాస్టర్ పీస్. ఎంతో గట్స్ ఉండాలె అట్లాంటి బొమ్మలు గీయడానికి.

గొప్ప విషయం ఏమిటంటే ఈ బొమ్మల్లో అత్యధికం శేఖర్ ఆసుపత్రి బెడ్ మీద ఉండి గీసినవి. ఓ పక్క శరీరాన్ని తూట్లు పొడుస్తున్న బాధాకరమైన చికిత్స కొనసాగుతుంటే ఆ కళాకారుడు గొప్ప గొప్ప కళాఖండాలను గీస్తూపోయాడు. నిజంగా ఇది ఆయనలోని పోరాటస్ఫూర్తికి నిదర్శనం.

“కొందరు మిత్రులకు చూపిస్తే…ఎందుకు ఈ బొమ్మలుగీసి ఇబ్బందులు సృష్టించుకుంటావ్? నీ దగ్గరి వాళ్లే ఈ బొమ్మలు చూసి నొచ్చుకునే ప్రమాదం ఉంది అంటున్నారు. మీరు చెప్పండి ఇవి పుస్తకంగా తీసుకువస్తే బాగుంటుందా” అని అడిగాడు.

“తప్పకుండా తేవాలె శేఖర్ భాయ్. ఇది చెప్పి తీరాల్సిన విషయం” అన్నాను నేను.

ఈ బొమ్మల విషయం నేను చెప్పగానే వెంటనే “మలుపు” ప్రచురణ సంస్థ బాల్ రెడ్డి ఈ పుస్తకం వేయడానికి ముందుకురావడం, ఎంతో శ్రద్ధ తీసుకుని ఈ పుస్తకాన్ని మంచి క్వాలిటీతో ప్రచురించడం చకచకా జరిగిపోయాయి.

పుస్తకం రెడీ అయ్యే సమయానికి శేఖర్ మరోసారి అనారోగ్యానికి గురికావడంతో ఒక రెండు వారాలు పుస్తకావిష్కరణ వాయిదాపడింది.

ఆసుపత్రి బెడ్ మీదనే శేఖర్ కు “క్యాస్ట్ క్యాన్సర్” పుస్తకం చూపించడం జరిగింది. అది చూసి ఆయన చాలా సంతోషపడ్డాడు. ఎట్లాగైనా ఆవిష్కరణ సభకు వస్తానని మాట ఇచ్చాడు.

మొన్న మే 3వ తారీఖు నాడు సారస్వత పరిషత్ హాలులో బొజ్జా తారకం, ఆర్టిస్ట్ మోహన్, ఘంటా చక్రపాణి, కె. శ్రీనివాస్, ఎన్ వేణుగోపాల్, అల్లం నారాయణ వంటి ప్రముఖుల చేతుల మీదుగా “క్యాస్ట్ క్యాన్సర్” పుస్తకావిష్కరణ జరిగింది.

వక్తలంతా శేఖర్ పోరాటస్ఫూర్తి గురించి ప్రస్తావిస్తూ ఆయన ఇంకో గొప్ప పుస్తకాన్ని తీసుకురావాలని ఆకాంక్షించారు.

ఓపికను కూడగట్టుకుని శేఖర్ ఆ సభలో నాలుగు మాటలు కూడా మాట్లాడాడు. తనకింకా బొమ్మలు గీయాలని ఉందని చెప్పాడు. సభ ముగిశాక అందరితో ఆత్మీయ కరచాలనం చేశాడు.

అదే ఆఖరు చూపు…

ఈ ఉదయం బోడుప్పల్ లో తన ఇంటి ముందు పెట్టిన మంచు పెట్టెలో నిర్మలంగా నిద్రిస్తూ కనపడ్డాడా కలం యోధుడు. 25 యేళ్ల కెరియర్ లో ఎన్నెన్నో గొప్ప చిత్రాలను మనకందించి, ఇక సెలవంటు వెళ్లిపోయాడు ఆ తెలంగాణ బిడ్డ.

ఎంతో ఆరోగ్యంగా ఉండి కూడా చిన్న చిన్న సమస్యలకే కుంగిపోయే నేటి తరానికి శేఖర్ లాంటి వాళ్ల జీవితం ఒక గొప్ప పాఠం వంటిది. ఎప్పుడో వచ్చే చావును తలుచుకుని అనుక్షణం చస్తూ బ్రతికే ఎంతో మందికి శేఖర్ జీవితం ఆదర్శం కావాలి.

తెలంగాణ నేల మీద పుట్టిన గొప్ప కళాకారుడు కంబాలపల్లి శేఖర్. ఆయనకు మన రాష్ట్ర ప్రభుత్వం సముచితంగా గౌరవం ఇయ్యాలె. శేఖర్ కళ పది కాలాల పాటు నిలిచి ఉండేలా ఒక ట్రస్ట్ కూడా ఏర్పాటు చేసే అలోచన చేయాలని ఆయన కుటుంబ సభ్యులను, మిత్రులను కోరుతున్నాను.

ఆరోగ్యం ఏమాత్రం సహకరించకపోయినా రెండేళ్లుగా ఇంటినుండే ప్రతినిత్యం కార్టూన్లు గీస్తున్న శేఖర్, నిన్న తీవ్ర అనారోగ్యంతో ఉండి కూడా కార్టూన్ గీశాడు. అది ఇవ్వాళటి ఆంధ్రజ్యోతి పత్రికలో ప్రచురితం కూడా అయ్యింది. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *