రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో పనిచేస్తున్న భాషా పండితులకు, పీఈటీలకు స్కూల్ అసిస్టెంట్లుగా(గ్రేడ్-1) పదోన్నతులు కల్పించారు. మంగళవారం అందుకు సంబంధించిన ఫైలుపై ముఖ్యమంత్రి శ్రీ కేసీఆర్ సంతకం చేశారు. దీంతో ఇక రాష్ట్రంలో గ్రేడ్-2 పండితులు, పీఈటీలు ఉండే అవకాశం లేదు. ఈ నిర్ణయం వల్ల 8,800 మంది భాషా పండితులు, 2వేలమంది పీఈటీలు మొత్తం కలిపి 10,800 మందికి ప్రయోజనం చేకూరనుంది. సమైక్య రాష్ట్రంలో పదోన్నతుల కోసం దశాబ్దాలుగా పోరాటంచేసినా ఫలితం లేదని, విద్యాశాఖ చరిత్రలో ఒకేసారి ఇంతమందికి పదోన్నతులు కల్పించడం ఇదే మొదటిసారని అధికారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
ఉపాధ్యాయులకు సంబంధించిన ఏకీకృత సర్వీస్ రూల్స్ సాధించడంతో పాటు అంతర్ జిల్లా బదిలీలు, భార్యాభర్తల బదిలీలు, రూ.398 వేతనంతో పనిచేసిన ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారంపై కూడా సీఎం కేసీఆర్ సానుకూల దృక్పథంతో ఉన్నారని, త్వరలోనే ఉపాధ్యాయులకు సంబంధించిన అన్ని సమస్యలకు పరిష్కారం లభిస్తుందని అధికారులు చెప్పారు. పదోన్నతులపై సీఎం కేసీఆర్ సంతకం చేయడంతో రాష్ట్రవ్యాప్తంగా భాషా పండితులు, పీఈటీలు స్వీట్లు పంచుకుని సంబురాలు చేసుకుంటున్నారు. శాసనమండలి చీఫ్ విప్ పాతూరి సుధాకర్ రెడ్డి, ఉపాధ్యాయ ఎమ్మెల్సీలు కాటేపల్లి జనార్ధన్ రెడ్డి, పూల రవీందర్, రాష్ట్రంలోని ఉపాధ్యాయ సంఘాల నాయకులు, తెలుగు యూనివర్శిటీ వీసీ ఎస్వీ సత్యనారాయణ, కవి, గాయకుడు దేశపతి శ్రీనివాస్ ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ కు కృతజ్ఞతలు తెలిపారు.