mt_logo

పాలమూరు దశ, దిశను మార్చే ప్రాజెక్టు పాలమూరు రంగారెడ్డి: మంత్రి సింగిరెడ్డి


పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు పాలమూరు జిల్లా దశ, దిశను మారుస్తుందని.. దశలవారీగా పాలమూరు పంపుల ప్రారంభం జరుగుతుందని మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి తెలిపారు. నీటి విషయాలలో ఓనమాలు తెలియని వారు కూడా ప్రాజెక్టుపై దుష్ప్రచారం చేస్తున్నారు అని మండిపడ్డారు.

ఉమ్మడి పాలమూరు జిల్లాలోనే 10 లక్షల ఎకరాలకు సాగునీరు రానున్నది. గ్రామాల నుండి భారీఎత్తున తరలిరావాలి.. ఈ చారిత్రక సందర్భంలో మనమంతా భాగస్వాములం కావాలి అని పిలుపినిచ్చారు. ఈ శతాబ్దపు మానవాద్భుత నిర్మాణం పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం అని పేర్కొన్నారు.

672 మీటర్ల ఎత్తుకు 145 మెగావాట్ల సామర్థ్యంగల పంపులు నాలుగు స్టేజిలలో 10 పంపులు ఎత్తిపోసే ప్రాజెక్టు ప్రపంచంలోనే లేదు. అటువంటి ప్రాజెక్టు ఈ రోజు పాలమూరుకు వచ్చింది. ప్రపంచంలో అతిపెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు ఎక్కడ ఉంది అంటే వినిపించే సమాధానం పాలమూరు.. మనం సాధించుకున్న రాష్ట్రంలో, మన ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో తలపెట్టి పూర్తిచేసుకుంటున్న ప్రాజెక్ట్ పాలమూరు రంగారెడ్డి అని మంత్రి అన్నారు.

27 వేల ఎకరాల భూసేకరణ, 5 రిజర్వాయర్ల నిర్మాణం, 4 పంపింగ్ స్టేషన్లు, సర్జిపూల్ ల నిర్మాణం, నాలుగు 420 కేవీ సబ్ స్టేషన్ల నిర్మాణం గత పాలకుల మాదిరిగా చేసి ఉంటే వందేళ్లయినా ఈ ప్రాజెక్టు పూర్తి అయ్యేది కాదు అని అన్నారు. కేంద్రం సహాయనిరాకరణ, అనేక కేసులు, కుట్రలు ఉన్నప్పటికీ ఏడున్నరేళ్లలో పూర్తిచేసుకున్నాం అని తెలిపారు.

రేపటి కార్యక్రమానికి హాజరవడమే కాకుండా తిరిగి వచ్చే క్రమంలో కలశాలలో కృష్ణమ్మ నీళ్లు తీసుకువచ్చి ఎల్లుండి 17 తేదీ నాడు ప్రతీ గ్రామంలో ఊరేగించి దేవాలయాల్లో అత్యద్భుతంగా కలశంలోని నీటితో దేవతామూర్తులను అభిషేకించే కార్యక్రమం నిర్వహించాలని.. రేపు ముఖ్యమంత్రి కేసీఆర్ నార్లాపూర్ పంప్ హౌస్‌లో వెట్ రన్ ప్రారంభించనున్న నేపథ్యంలో బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు, పార్టీ శ్రేణులతో నిర్వహించిన టెలీ కాన్ఫరెన్స్ లో రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి పాల్గొన్నారు.