mt_logo

పాతాళం నుంచి పైపుల‌తో పాల‌మూరుకు నీళ్లు.. సీఎం కేసీఆర్ సంక‌ల్పంతో క‌రువుసీమ‌కు కృష్ణ‌మ్మ ప‌రుగులు!

పాల‌మూరు జిల్లా అంటే క‌రువుకు పెట్టింది పేరు. వ‌ల‌స‌ల గోస‌కు స‌జీవ సాక్ష్యం. తలాపునే కృష్ణ‌మ్మ ప‌ర‌వ‌ళ్లు తొక్కుతున్నా..స‌మైక్య పాల‌కుల వివ‌క్ష‌తో పాల‌మూరు పొలాల‌కు చుక్క‌నీళ్లు లేని దుస్థితి. సాగు,తాగునీరు లేక జ‌నం విల‌విల్లాడిన దుర్భ‌ర ప‌రిస్థితి. పొలాలు ఎండి.. క‌డుపులు మాడ‌టంతో పొట్ట‌కూటి కోసం ఇల్లు, పొలాలు, పిల్లాజెల్లను వ‌దిలి పాల‌మూరు వ‌ల‌స పోయింది. హైద‌రాబాద్‌, బొంబాయి, దుబాయ్‌కి వ‌ల‌సెళ్లిపోయింది. సాగుయోగ్య‌మైన భూములండీ నీళ్లిచ్చే నాథుడు లేక పాల‌మూరు ప‌ల్లె ప‌ల్లెనా ప‌ల్లేర్లు మొలిచిన‌య్‌. చెట్ల‌న్నీ మోడువారి మ‌హ‌బూబ్‌న‌గ‌ర్ ప్ర‌జ‌ల దుర్భ‌ర జీవితాల‌కు అద్దంప‌ట్టిన‌య్‌. అయినా ఏ స‌మైక్య పాల‌కుడూ క‌నిక‌రించ‌లే. పాల‌మూరు క‌రువును చూపి.. ప్ర‌పంచ బ్యాంకు నిధులు తెచ్చుకొన్నమాజీ సీఎం చంద్ర‌బాబు నాయుడు.. ఆ నిధుల‌ను త‌న ప్రాంతానికి నీళ్లిచ్చేందుకు వాడుకున్నారు. ఇక్క‌డ జూరాల‌ను ఎండ‌బెట్టి ద‌ర్జాగా సీమ‌కు నీళ్లెత్తుకుపోయారు.

ఆ త‌ర్వాత వ‌చ్చిన వైఎస్ రాజ‌శేఖ‌ర్‌రెడ్డిదీ అదేతీరు. జ‌ల‌యజ్ఞం పేరుతో పాల‌మూరుకు తీర‌ని అన్యాయం చేశారు. పేరుకు కృష్ణా బేసిన్‌లో ఐదు ప్రాజెక్టుల‌కు క‌డుతున్న‌ట్టు చెప్పి.. నిధులు మాత్ర ఇవ్వ‌లేదు. ఇక్క‌డి ప్రాజెక్టుల‌ను రెండో ప్రాధాన్య జాబితాలో చేర్చి.. మొద‌టి ప్రాధాన్య‌త‌గా ఆంధ్రాలోని ప్రాజెక్టుల‌కు నిధులు కేటాయించి.. చ‌క‌చ‌కా ప్రాజెక్టుల‌ను  పూర్తి చేసుకొన్నారు. పాల‌మూరు మొత్తం వ‌ల‌సెళ్లినా ఆయ‌న‌కు ఇక్క‌డి ప్ర‌జ‌ల క‌న్నీళ్లు క‌నిపించ‌లేదు.. క‌ష్కెడు నీళ్లివ్వాల‌నే క‌నిక‌రం క‌లుగ‌లేదు. కానీ, ఉద్య‌మ స‌మ‌యం నుంచీ పాల‌మూరు వెన్నంటి ఉన్న సీఎం కేసీఆర్ స్వ‌రాష్ట్రంలో పాలమూరు జ‌ల‌గోస‌ను తీర్చేందుకు న‌డుంబిగించారు. భీమా, నెట్టెంపాడు, కోయిల్‌సాగ‌ర్‌లాంటి పెండింగ్ ప్రాజెక్టుల‌ను పూర్తిచేయించి. స‌గం పాల‌మూరును త‌డిపేశారు. ఇప్పుడు పాల‌మూరు-రంగారెడ్డి ఎత్తిపోత‌ల ప‌థ‌కం (పీఆర్ఎల్ఐ) భ‌గీర‌థ సంక‌ల్పంతో పూర్తిచేయించి.. పాల‌మూరు ప్ర‌జ‌ల క‌న్నీళ్లను శాశ్వ‌తంగా దూరం చేస్తున్నారు. రేపు (శ‌నివారం) పీఆర్ఎస్‌ల్ఐ ప్రాజెక్టును అట్ట‌హాసంగా ప్రారంభించి.. పాల‌మూరు బీడు నేల‌ల‌పైకి కృష్ణ‌మ్మ‌ను ప‌ర‌వ‌ళ్లు తొక్కించ‌నున్నారు. 

పాల‌మూరు-రంగారెడ్డి ప్రాజెక్టు ప్ర‌త్యేక‌త‌లివే..

-పీఆర్ఎల్ఐ ప్రాజెక్టు ఓ సాంకేతిక అద్భుతం. సీఎం కేసీఆర్ విజ‌న్‌కు ప్ర‌తిరూపం. తెలంగాణ ఇంజినీర్ల నైపుణ్యానికి నిద‌ర్శ‌నం.

– ప్రాజెక్టులో భాగంగా శ్రీశైలం గట్టు నుంచి ప్రాజెక్టులో చివరిదైన కేపీ లక్ష్మీదేవిపల్లి రిజర్వాయర్‌ వరకు మొత్తం 112 కిలోమీట‌ర్ల దూరం వాట‌ర్ కండ‌క్ట‌ర్ సిస్ట‌మ్‌ను ఏర్పాటు చేశారు. 

-ప్ర‌ధాన కెనాల్‌ను 50 కిలోమీట‌ర్ల దూరం నిర్మించారు. 

-ఈ ప్రాజెక్టును ఓ భూగ‌ర్భ అద్భుతంగా చెప్పొచ్చు. మొత్తం ప్రాజెక్టులో భాగంగా కాక‌తీయుల స్ఫూర్తితో గుట్టలే ఆన‌క‌ట్టలుగా ఐదు భారీ రిజ‌ర్వాయ‌ర్ల‌ను నిర్మించారు. వాటిలోకి నీళ్లుపోసే సిస్టర్న్‌లు, సబ్‌ స్టేషన్లు, సిబ్బంది క్వార్టర్స్‌ మాత్రమే భూ ఉపరితలంపై కనిపిస్తాయి. పెద్దపెద్ద పంప్‌హౌస్‌లు, సర్జ్‌పూల్స్‌లాంటివ‌న్నీ భూగర్భంలోనే నిర్మించారు. ఒక్కో స‌ర్జ్‌పూల్‌ను భూ ఉప‌రిత‌లం నుంచి స‌గ‌టున 75 మీటర్ల లోతులో ఏర్పాటు చేయ‌డం విశేషం. అంటే రెండు చార్మినార్ల ఎత్తు అంత ఈ స‌ర్జ్‌పూల్స్ ఉన్నాయి. 

అలాగే, ప్రాజెక్టులో పంప్‌హౌస్‌లోని మోటర్ల వద్దకు చేరుకోవాలంటే ఉపరితలం నుంచి టన్నెల్‌ ద్వారా సగటున కిలో మీటర్‌ వరకు ప్రయాణించాల్సి ఉంటుంది. 

-ఇందులో సొరంగ మార్గ‌మే 61.08 కిలోమీటర్లు. ప్రాజెక్టుకు నీటిని తీసుకునే ఇన్‌టేక్‌ పాయింట్‌ నుంచే సొరంగ నిర్మాణాలు ప్రారంభం అవుతాయి. 

కృష్ణ‌మ్మ నీటిని ఎలా ఎత్తిపోస్తారంటే?

శ్రీశైలం రిజర్వాయర్‌ బ్యాక్‌వాటర్‌ నుంచి నీరు తొలుత ఓపెన్‌ అప్రోచ్‌ కెనాల్‌ ద్వారా నార్లాపూర్‌ హెడ్‌రెగ్యులేటర్‌కు తీసుకెళ్తారు. అక్కడ దాదాపు ఒక కిలోమీటర్‌ పొడవుతో నిర్మించిన 3 సొరంగ మార్గాల ద్వారా నీటిని నార్లాపూర్‌ సర్జ్‌పూల్‌కు తీసుకెళ్తారు.

-అంజ‌న‌గిరిగా పిలిచే నార్లాపూర్ రిజర్వాయర్‌ నుంచి వీరాంజ‌నేయ‌గా పిలిచే ఏదుల రిజర్వాయర్‌కు మొత్తంగా 21.68 కిలోమీటర్ల కెనాల్‌ ఏర్పాటు చేశారు. అందులో 5.92 కిలోమీటర్లు మాత్రమే ఓపెన్‌ కెనాల్‌. అక్కడి నుంచి 15.75 కిలోమీటర్ల పొడవుతో నిర్మించిన రెండు సొరంగమార్గాల గుండా కృష్ణమ్మ ప్రవహిస్తుంది. చివ‌ర‌కు వీరాంజనేయ రిజర్వాయర్‌కు చేరుకొంటుంది.

-వీరాంజనేయ రిజర్వాయర్‌ నుంచి వెంకటాద్రిగా పిలిచే వట్టెం రిజర్వాయర్‌కు 25.100 కిలోమీటర్ల కెనాల్ ద్వారా నీటిని త‌ర‌లిస్తారు. 

ఇందుకోసం 22 కిలోమీటర్ల పొడవుతో రెండు సొరంగాలను తవ్వ‌డం విశేషం.

-ఈ ప్రాజెక్టులో మొత్తంగా 9.750 కిలోమీటర్ల ఓపెన్‌ కెనాల్‌ ద్వారానే నీరు తరలిపోయేది కేవలం వెంకటాద్రి రిజర్వాయర్‌ నుంచి కురుమూర్తిరాయ (కరివెన) రిజర్వాయర్‌కు మాత్రమే.

-కురుమూర్తి రిజర్వాయర్‌ నుంచి ఉద్దండాపూర్‌ రిజర్వాయర్‌కు ప్రాజెక్టు మొత్తంలో ఓపెన్‌ కెనాల్‌ లేకుండానే పూర్తిగా 8.935 కిలోమీటర్ల సొరంగ మార్గం ద్వారానే నీటిని తరలిస్తుండడం విశేషం. అందుకోసం రెండు సొరంగాలను ఏర్పాటు చేశారు.

-సొరంగమార్గాలు మినహాయించిన దాదాపు 10 కిలోమీటర్ల మేర కృష్ణమ్మ ప్రెషర్‌ మెయిన్స్‌ పైపులు, అండర్‌గ్రౌండ్‌ సర్జ్‌పూల్స్‌, డ్రాఫ్ట్‌ ట్యూబుల గుండానే పరుగులు తీయనుండడం విశేషం.