mt_logo

హరితహారం కార్యక్రమం దేశంలో ఎక్కడా జరగలేదు..

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన హరితహారం కార్యక్రమం ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలుస్తుందని, సీఎం కేసీఆర్ చేపట్టిన హరితహారం కార్యక్రమం దేశంలో మరెక్కడా జరగలేదని కేంద్ర పర్యావరణ శాఖామంత్రి ప్రకాష్ జవదేకర్ అన్నారు. నిజామాబాద్ జిల్లా మోతె గ్రామంలో నిర్వహించిన హరితహారం కార్యక్రమంలో సీఎం కేసీఆర్ తో పాటు కేంద్ర మంత్రి పాల్గొని మొక్కను నాటారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీఎం కేసీఆర్ ఒక ఉద్యమంలా ఈ కార్యక్రమాన్ని చేపట్టారని, ప్రకృతి సమతౌల్యం దెబ్బతింటుందని, మొక్కలు నాటడమే కాదు చెట్టును కాపాడటం కూడా మన బాధ్యతేనని అన్నారు.

జై తెలంగాణ అంటూ ఉపన్యాసం ప్రారంభించిన ప్రకాష్ జవదేకర్ అందరికీ నమస్కారం అంటూ తెలుగులో సంబోధించారు. సీఎం కేసీఆర్ జై తెలంగాణ.. జై తెలంగాణ అంటూనే తెలంగాణ సాధించారు. ప్రజా సంక్షేమ కార్యక్రమాలన్నీ ఉద్యమ స్ఫూర్తితో నడిపించడం దేశంలో ఎక్కడా లేదని, చెట్ల పెంపకంతో వర్షాలు విస్తారంగా కురుస్తాయని, పర్యావరణం దెబ్బతినడం వల్లే వర్షాలు సకాలంలో పడటంలేదన్నారు. అడవుల విస్తీర్ణం పెంచేందుకే హరితహారం అని, ఈ కార్యక్రమం ఇట్లానే కొనసాగితే పదేళ్ళలో 30 శాతం అడవులు విస్తరించవచ్చని ప్రకాష్ జవదేకర్ వివరించారు. గత పాలకుల నిర్లక్ష్యం వల్ల అడవుల సంరక్షణకు కేటాయించిన రూ.35 వేల కోట్లు దుర్వినియోగం అయ్యాయని, క్యాంపా నిధులన్నీ రాష్ట్రాలకు అందిస్తామని మంత్రి స్పష్టం చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *