mt_logo

‘మోతె మట్టి అంత పవర్ ఫుల్’!

హరితహారం కార్యక్రమంలో భాగంగా నేడు నిజామాబాద్ జిల్లాలో ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు పర్యటిస్తున్నారు. మోతె, నిజామాబాద్ అర్బన్, నిజామాబాద్ రూరల్, ఆర్మూర్, సదాశివనగర్, కామారెడ్డిలలో మొక్కలు నాటే కార్యక్రమాల్లో సీఎం పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు కేంద్ర పర్యావరణ శాఖామంత్రి ప్రకాశ్ జవదేకర్ వేల్పూరు మండలం మోతె గ్రామానికి చేరుకున్నారు. మోతెలో సీఎం కేసీఆర్, మంత్రి జవదేకర్ కలిసి మొక్కలు నాటిన అనంతరం ఏర్పాటు చేసిన బహిరంగ సభల్లో ప్రసంగించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ ‘మోతె కేసీఆర్ సొంత ఊరు.. కేసీఆర్ సొంత ఊరు మోతె ఎట్లా ఉండాలె? ఎవరైనా చూస్తే మెచ్చుకోవాలి.. కేసీఆర్ సీఎం అయిఉండీ మోతె బాగుపడకపోతే బయట పతార ఖరాబయితది.. మోతె ప్రజల ఆశీర్వాదం వల్ల, భగవంతుడి దయతో తెలంగాణ వచ్చింది.. మోతెను మర్చిపోను.. మోతె మట్టి తీసుకెళ్ళి ఊళ్ళలోని బావుల్లో కలిపితే బాగుంటుంది.. ఇక్కడి మట్టి అంత పవర్ ఫుల్’ అని చెప్పారు.

మోతెలో ఇళ్లులేని వారు ఉండొద్దు.. ప్రతి ఒక్కరికి డబుల్ బెడ్ రూమ్ ఇళ్ళు కట్టిస్తాం.. రెండంతస్తుల విధానంలో కడతాం.. గ్రామ పంచాయితీ భవనానికి రూ. 80 లక్షలు మంజూరు చేస్తున్నానని, సీసీ రోడ్లు, మోరీల నిర్మాణానికి రూ. 2 కోట్లు మంజూరు చేస్తున్నామని, ఈ నిధులు సరిపోకపోతే ఎంపీ కవిత తన ఫండ్స్ నుండి రూ. 50 లక్షలు మంజూరు చేస్తారని సీఎం చెప్పారు. మోతెలో నర్సరీ ఏర్పాటు చేస్తామని, ఇకపై ఎవరూ బయట మొక్కలు తెచ్చుకోవలసిన అవసరం లేదని, మిగతా గ్రామాలకు 40 వేల మొక్కలు ఇస్తున్నామని, మోతె గ్రామానికి ఒక వెయ్యి మొక్కలు ఎక్కువగానే ఇస్తామని, ప్రతి ఒక్కరూ హరితహారంలో పాల్గొనాలన్నారు. మోతెకు గోదావరి జలాలు తీసుకొస్తామని, కాళేశ్వరం ద్వారా మోతెకు గోదావరి జలాలు వస్తాయని సీఎం పేర్కొన్నారు.

అనంతరం వేల్పూరులో జరిగిన హరితహారం కార్యక్రమంలో పాల్గొన్న సీఎం కేసీఆర్ మాట్లాడుతూ వేల్పూరు నుండి ఉచిత నిర్బంధ విద్యను ప్రారంభిస్తామని, రైతులకు వందశాతం డ్రిప్ ఇరిగేషన్ మంజూరు చేస్తామని చెప్పారు. వందశాతం సబ్సిడీపై 100 పసుపు ప్లాంట్ ఫాంలు నిర్మిస్తామని, కాళేశ్వరం నుండి నిజాం సాగర్ కు నీళ్ళు మళ్ళిస్తామని హామీ ఇచ్చారు. వేల్పూరు గ్రామపంచాయితీ భవనానికి రూ. 50 లక్షలు, బాల్కొండ నియోజకవర్గంలోని 7 గ్రామాలకు కొత్త సబ్ స్టేషన్ లు ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ మంజూరు చేశారు. వానలు కురిపించుకోవడం మన చేతుల్లోనే ఉందని, హరితహారం సక్సెస్ చేసి దేశమంతా మనలను చూసి నేర్చుకునేలా చూడాల్సిన బాధ్యత ప్రతి తెలంగాణ పౌరుడిపై ఉందని కేసీఆర్ అన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *