mt_logo

ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా తెలంగాణ పునర్నిర్మాణం..

సీఎం క్యాంపు కార్యాలయంలో గురువారం ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు ప్రభుత్వ ముఖ్య కార్యదర్శులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ, వందేళ్లుగా అనేకరకాలుగా బాధలు పడ్డ తెలంగాణ ప్రజలకు విముక్తి కలిగిన భావన పూర్తిగా రావాలంటే ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా తెలంగాణ పునర్నిర్మాణం జరగాలని పేర్కొన్నారు. నిజాం పాలన- మంచిచెడులు, రజాకార్ల ఆవిర్భావం, సైనిక పాలన, హైదరాబాద్ రాష్ట్ర ఏర్పాటు, ఆంధ్రప్రదేశ్ ఏర్పాటు, 1969 ఉద్యమం, ముల్కీ గో బ్యాక్ ఉద్యమం, 2001 నుండి చేసిన మలివిడత తెలంగాణ ఉద్యమం, రాష్ట్రం కోసం జరిగిన బలిదానాలు, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు, భవిష్యత్ ప్రణాళికలు తదితర అంశాలపై ముఖ్యమంత్రి అధికారులతో సుదీర్ఘంగా వివరించి చెప్పారు.

అధికారులు ఒక శాఖకు చెందిన వారిగా కాకుండా ప్రభుత్వాన్ని నడిపే సారధులుగా వ్యవహరించాలని, పరస్పరం ఒకరికొకరు సమాచారాన్ని అందిపుచ్చుకుని మంచి విధానాలు రూపొందించాలని సూచించారు. అంతేకాకుండా తనకు, మంత్రులకు కూడా మంచి సూచనలు, సలహాలు ఇవ్వాలని, అధికారులే తెలంగాణ రాష్ట్రాన్ని ప్రమోట్ చేయాలని సూచించారు. రాష్ట్రంలో పనిచేసే అధికారులకు మంచి పని సంస్కృతి ఉన్నదని, సమయ పరిమితులు పెట్టుకోకుండా రాత్రి పొద్దుపోయేవరకు కూడా సేవలందిస్తున్నారని ప్రశంసించారు. ప్రభుత్వ పాలన మూడు విభాగాలుగా మార్చుకుని అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు అమలు చేయాలని, ఒకటి పేదలు-సంక్షేమం, రెండు వ్యవసాయం, మూడు పరిశ్రమలు-పెట్టుబడులు-మౌలికవసతులు గా రూపొందించుకోవాలన్నారు.

కొద్దికాలం క్రితం ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తే దేశానికి ప్రధానిగా ఉండటం రాష్ట్రాలకు సానుకూల అంశమని, అనేక కొత్త ఆలోచనలను కేంద్రం చేస్తుందని, కేంద్రం నుండి వచ్చే విధానాలకు అనుగుణంగా రాష్ట్రంలో కార్యక్రమాలు రూపొందించుకోవాల్సి ఉందన్నారు. పెట్టుబడులకు తెలంగాణ ఎంతో ఆకర్షణీయమైనదని, దేశ స్వాతంత్ర్యానికి ముందే హైదరాబాద్ లో 165 పరిశ్రమలు ఉన్నాయని, ప్రస్తుతం ఐటీ దిగ్గజాలైన మైక్రోసాఫ్ట్, గూగుల్, ఐబీఎం తదితర కంపెనీలు తమ మెయిన్ సర్వర్ ను హైదరాబాద్ లో ఏర్పాటు చేసుకుంటున్నాయని కేసీఆర్ చెప్పారు. 2018 చివరికల్లా రాష్ట్రంలో 23వేలకుపైగా మెగావాట్ల విద్యుత్ అందుబాటులోకి వస్తుందని, ఈ ఏడాది చివరికే 6679 మెగావాట్ల విద్యుత్ అందుబాటులోకి వస్తుందని, దీంతో కరెంట్ కష్టాలు చాలావరకు తీరతాయని సీఎం పేర్కొన్నారు.

ప్రతి సంవత్సరం జూలై మొదటివారం హరితహారం వారోత్సవాలు నిర్వహించాలని, ఫిబ్రవరి చివరివారంలో మిషన్ కాకతీయ వారోత్సవం జరపాలని సీఎం చెప్పారు. ఈ వేసవిలోనే హుస్సేన్ సాగర్ శుద్ధి కార్యక్రమాన్ని చేపట్టాలని, మురికినీరు హుస్సేన్ సాగర్ లోకి రాకుండా చూడాలని, పూడిక తీయాలని అన్నారు. గృహనిర్మాణ పథకాన్ని పకడ్బందీగా అమలు చేయాలని, ఎస్సీ, ఎస్టీల సమగ్రాభివృద్ధికి శాఖలవారీగా ప్రణాళికలు రూపొందించాలని అధికారులను ఆదేశించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *