టీఆర్ఎస్ పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమానికి ప్రజలనుండి భారీ స్పందన వస్తోంది. ఇదే జోరు కొనసాగితే రాబోయే రోజుల్లో సభ్యత్వ నమోదు రెట్టింపు అయ్యే సూచనలు కన్పిస్తున్నాయి. 50 లక్షలకు పైగా సాధారణ సభ్యత్వాలు, పది లక్షల వరకు క్రియాశీల సభ్యత్వం నమోదయ్యే పరిస్థితి కనిపిస్తోంది. ఇప్పటికే తొమ్మిది జిల్లాల్లో 23,65,455 సభ్యత్వాలు నమోదయ్యాయి. గ్రేటర్ హైదరాబాద్ లో సభ్యత్వ నమోదుకు సంబంధించి వివరాలు అందాల్సిఉంది. ఐదు లక్షల వరకు నమోదు చేయించాలని భావించినా ఇప్పటికే లక్ష్యానికి చేరువయ్యింది. ఇక్కడకూడా సభ్యత్వ నమోదు రెట్టింపు అయ్యే అవకాశం ఉందని తెలుస్తుంది.
అన్ని జిల్లాల్లో సభ్యత్వ నమోదుకు అనూహ్య స్పందన వస్తున్నదని, అంచనాకు మించి రెట్టింపు సభ్యత్వం అయ్యేలా ఉందని సభ్యత్వ నమోదు స్టీరింగ్ కమిటీ కన్వీనర్ పల్లా రాజేశ్వర్ రెడ్డి తెలిపారు. వారం క్రితం చేపట్టిన సభ్యత్వ నమోదుకు మొదట 30 లక్షలు లక్ష్యంగా పెట్టుకున్నారు. కానీ అంచనాలన్నీ తలకిందులవుతూ ప్రజలు స్వచ్చందంగా సభ్యత్వ నమోదుకు తరలిరావడంతో 43,54,750 పుస్తకాలు పంపిణీ చేశారు. ఇందులో 9,56,225 క్రియాశీల సభ్యత్వాలు, 33,98,525 సాధారణ సభ్యత్వాలకు చెందిన పుస్తకాలు ఉన్నాయి. గురువారం సాయంత్రానికి హైదరాబాద్ కాకుండా మిగతా తొమ్మిది జిల్లాల్లో 23,65,455 సభ్యత్వాలు నమోదు అయ్యాయి.