సీమాంధ్ర శాసనసభ్యులు వికృతంగా చేస్తున్న చేష్టలపట్ల టీ ఎమ్మెల్యేలు తీవ్రంగా స్పందించారు. ఎంతో పవిత్రంగా భావిస్తున్న తెలంగాణ బిల్లు ప్రతులను సీమాంధ్ర ఎమ్మెల్యేలు చించివేయడం, కాల్చివేయడంపై వారు మండిపడ్డారు. ఇరు ప్రాంతాల నేతల మధ్య తోపులాట జరిగింది. ఉభయ సభల్లో వారు సీమాంధ్ర నేతల కుట్రలను తిప్పికొట్టారు.
మీడియా పాయింట్ వద్ద టీడీపీ ఎమ్మెల్యే దేవినేని ఉమ, ఇతర సీమాంధ్ర శాసన సభ్యులు బిల్లు ప్రతులను చించివేస్తుండగా గంగుల కమలాకర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. టీఆర్ఎస్ నేత ఈటెల రాజేందర్, సుధాకర్ రెడ్డి, భిక్షమయ్యగౌడ్ సీమాంధ్రుల చేతిలోంచి బిల్లుప్రతులను తీసుకుని నిప్పంటించే ప్రయత్నాన్ని అడ్డుకున్నారు. బిల్లుకు పూజలు కూడా చేశారు.
ఉదయం 10 గంటలకు సభ ప్రారంభం కాగానే అసెంబ్లీ సెక్రటరీ రాజా సదారాం రాష్ట్రపతి లేఖను చదివి వినిపిస్తుండగా తెలంగాణకు చెందిన అన్ని పార్టీల నాయకులు ఆయనకు రక్షణ వలయంగా నిలబడ్డారు. మహిళా ఎమ్మెల్యేలు కూడా ఒక వలయంగా నిలబడ్డారు.
మంత్రులు జానారెడ్డి, డిప్యూటీ స్పీకర్ మల్లు, డీకే అరుణ, డి. శ్రీధర్ బాబు, ఈటెల రాజేందర్, గండ్ర వెంకటరమణ, హరీష్ రావు, కేటీఆర్, సీతక్క, ఉమా మాధవరెడ్డి, కె. లక్ష్మారెడ్డి, మోత్కుపల్లి, ఎర్రబెల్లి, కిషన్ రెడ్డి, కవిత, స్వామిగౌడ్, కొత్తకోట దయాకరరెడ్డి, గంగుల కమలాకర్ తదితరులు కలిసికట్టుగా సీమాంధ్రుల కుట్రలను తిప్పికొట్టారు.