టీఆర్ఎస్ కు ప్రజలే అసలైన హైకమాండ్ అని టీఆర్ఎస్ఎల్పీ ఉపనేత హరీష్ రావు అన్నారు. సోమవారం నిజామాబాద్ జిల్లా సదాశివనగర్ మండలం మల్లన్నగుట్టలో 200మంది టీఆర్ఎస్ పార్టీలో చేరిన సందర్భంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఆంధ్ర పార్టీలకు ఆంధ్రనాయకులు హైకమాండ్ అని కూడా ఈ సందర్భంగా విమర్శించారు.
సీమాంధ్ర యాజమాన్యం చేతిలో పలు ఫ్యాక్టరీలు ఉండడం వల్ల రైతులకు గిట్టుబాటు ధర లభించడం లేదన్నారు. నిజాంషుగర్స్ ను సీమాంధ్ర ప్రతినిధులు ప్రైవేట్ పరం చేస్తున్నారని విమర్శించారు. ఎలాగైనా సీమాంధ్రుల అహంకారాన్ని అణిచివేసి గిట్టుబాటు ధర, రైతుల సంక్షేమం లాంటివి సాధించుకుందామని హరీష్ రావు అన్నారు.
చంద్రబాబు సభల మీద సభలు సీమాంధ్ర ప్రాంతంలో ఏర్పాటు చేసి తెలంగాణ అడ్డుకునే ప్రయత్నాలు చేస్తున్నా, టీటీడీపీ నాయకులు గతిలేని చందంగా చంద్రబాబునే పట్టుకుని వేళ్ళాడుతున్నారని, పౌరుషం ఉంటే టీడీపీని వదిలేసి ఉద్యమంలో పాల్గొనాలన్నారు.
తెలంగాణ బిల్లు అమరుల రక్తంతో తయారైందని, దానిని చింపేసే అధికారం సీమాంధ్రులకు లేదని స్పష్టం చేశారు. ఈ సభలో కవి, గాయకుడు దేశపతి శ్రీనివాస్ కూడా పాల్గొన్నారు.