టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ మెదక్ ఎంపీగానూ, గజ్వేల్ అసెంబ్లీ స్థానంనుంచి కూడా ఎన్నికల బరిలోకి దిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ సందర్భంగా జిల్లాల్లో టీఆర్ఎస్ ను బలమైన శక్తిగా ఉంచేలా చర్యలు తీసుకోనున్నారు. సొంత జిల్లా అయిన మెదక్ జిల్లాలో పార్టీ స్థితిగతుల గురించి ఎప్పటికప్పుడు ఆరా తీస్తూ పార్టీ బలోపేతానికి కేసీఆర్ వ్యూహాలు రచిస్తున్నారు.
మెదక్ జిల్లాలో 10 అసెంబ్లీ నియోజకవర్గాలుండగా, 2 పార్లమెంటు స్థానాలు మెదక్, జహీరాబాద్ లు ఉన్నాయి. ఈ రెండింటిలో ఒకటైన మెదక్ లోకసభ స్థానం నుండి కేసీఆర్ పోటీ చేయనున్నట్లు విశ్వసనీయ సమాచారం. అలాగే గజ్వేల్ అసెంబ్లీ నియోజకవర్గం నుండి కూడా పోటీ చేయనున్నట్లు పార్టీ వర్గాల సమాచారం. దీనితో తెలంగాణలో రాజకీయ సమీకరణాలు మారనున్నాయి.
మెదక్ లోని సిద్ధిపేట మినహా 9 నియోజకవర్గాలపైనా కేసీఆర్ ప్రత్యేక దృష్టి సారించారు. సిద్ధిపేట నుంచి హరీష్ రావు ప్రాతినిధ్యం వహిస్తున్నారు కాబట్టి మిగతా స్థానాల్లో ఎవరిని నిలపాలనే సమాచారాన్ని ఎప్పటికప్పుడు తెలుసుకుంటున్నారు. పార్టీలో చేరడానికి ప్రయత్నిస్తున్న మంచి గుర్తింపులేని నాయకులు అధికార పార్టీ వారైనా వారిని పక్కన పెడుతున్నారు. విజయశాంతి కాంగ్రెస్ పార్టీ నుండి, సీహెచ్. నరేంద్రనాథ్ బీజేపీ నుండి పోటీచేసే అవకాశాలున్నాయని తెలుస్తుంది. ఫలితాల తర్వాత రాష్ట్ర రాజకీయాలకనుగుణంగా ఎంపీగా కొనసాగాలా, లేక ఎమ్మెల్యేగా కొనసాగాలా అని నిర్ణయం తీసుకోనున్నట్లు సమాచారం.