mt_logo

పెండింగ్ ప్రాజెక్టులు ఇక వేగవంతం..

ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు మహారాష్ట్ర పర్యటన సందర్భంగా ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ తో జరిపిన చర్చలు విజయవంతమైన విషయం తెలిసిందే. గత పాలకుల నిర్లక్ష్యంతో ఎక్కడికకక్కడే నిలిచిపోయిన పెండింగ్ ప్రాజెక్టులు ఇక ఊపందుకోనున్నాయి. ఇందుకోసం అంతర్రాష్ట్ర నదీ జలాల వ్యవహారంలో నెలకొన్న సమస్యలకు పరిష్కార మార్గాలు సూచించేందుకు ముగ్గురు సభ్యులతో కూడిన సాంకేతిక సలహా కమిటీని నియమిస్తూ బుధవారం ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. రిటైర్డ్ ఇంజినీర్ ఇన్ చీఫ్ ఎస్ గోపాల్ రెడ్డి చైర్మన్ గా, రిటైర్డ్ చీఫ్ ఇంజినీర్లు మహ్మద్ అబ్దుల్ రవూఫ్, కే వేణుగోపాల్ రావు సభ్యులుగా వ్యవహరిస్తారు. వివిధ ప్రాజెక్టులకు సంబంధించి పొరుగు రాష్ట్రాలతో ఉన్న సమస్యలను ప్రాజెక్టుల వారీగా పరిశీలించి వాటికి పరిష్కార మార్గాలను సూచిస్తూ నివేదికను ప్రభుత్వానికి ఈ కమిటీ అందజేయనుంది.

లెండి ప్రాజెక్టుపై గతంలో ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర ప్రభుత్వాలు ఇప్పటివరకు సుమారు రూ. 500 కోట్లు ఖర్చు చేశాయి. ఈ ప్రాజెక్టు నిర్మాణం పూర్తిచేయడం ద్వారా తెలంగాణ, మహారాష్ట్రలకు కలిపి మొత్తం 49,000 ఎకరాలకు సాగునీరు అందుతుంది. అదేవిధంగా తెలంగాణ-మహారాష్ట్ర సరిహద్దులోని లోయర్ పెన్ గంగ ప్రాజెక్టు పూర్తయితే కూడా మహారాష్ట్రకే అధికలాభం. ఈ ప్రాజెక్టు కింద మహారాష్ట్ర వినియోగించుకునే నీటివాటా 37.55 టీఎంసీలు కాగా, తెలంగాణకు కేవలం 5.12 టీఎంసీలు ఉంది. దీనికి కూడా భూసేకరణ, పునరావాసం వంటి సమస్యలు అడ్డుగా నిలవడంతో ప్రాజెక్టు నిర్మాణం ఆగిపోయింది.

ప్రాణహిత-చేవెళ్ళ ప్రాజెక్టుకు సంబంధించి బ్యారేజీ ఎత్తు తగ్గించాలని మహారాష్ట్ర ప్రభుత్వం సీఎం కేసీఆర్ కు విజ్ఞప్తి చేసింది. ఆదిలాబాద్ జిల్లా తుమ్మడిహట్టి వద్ద ప్రాణహిత బ్యారేజీ నిర్మించాల్సి ఉంది. దీనివల్ల మహారాష్ట్రలోని గడ్చిరోలి, చంద్రాపూర్ జిల్లాల్లో కొన్ని గ్రామాలు ముంపుకు గురికానున్నాయి. త్వరలోనే ఇంజినీర్ల బృందం బ్యారేజీ నిర్మాణ ప్రాంతానికి వెళ్లి పరిశీలన చేయనుంది.

అదేవిధంగా ఇచ్చంపల్లి ప్రాజెక్టు నిర్మాణానికి సంబంధించి త్వరలోనే ఛత్తీస్ గడ్ ప్రభుత్వంతోనూ చర్చలు జరపాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. కరీంనగర్ జిల్లా మహదేవపూర్ మండలంలోని ఇచ్చంపల్లి వద్ద ప్రాజెక్టు నిర్మాణానికి మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, మధ్యప్రదేశ్ ప్రభుత్వాల మధ్య 1978 లోనే ఒప్పందం కుదిరింది. అయితే గిరిజనులు అధికసంఖ్యలో నిర్వాసితులయ్యే అవకాశం ఉండటంతో ఎత్తు తగ్గించాలని కేంద్ర జలసంఘం ఒక కమిటీని నియమించింది. కమిటీ సూచించిన 95 మీటర్ల ఎత్తుకు మహారాష్ట్ర ప్రభుత్వం అంగీకరించగా, ఛత్తీస్ గడ్ మాత్రం అభ్యంతరం చెప్పింది. సమైక్య పాలనలో ఆగిపోయిన ప్రాజెక్టులు కార్యరూపం దాల్చేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ తీవ్రంగా కృషి చేస్తున్నారు. తెలంగాణను సస్యశ్యామలం చేసే అంతర్రాష్ట్ర ప్రాజెక్టులు త్వరగా పూర్తయ్యేందుకు పొరుగు రాష్ట్రాలకు స్నేహహస్తం అందిస్తూ ముందుకు పోతున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *