అసెంబ్లీ సమావేశాలు మార్చి మొదటివారంలో ప్రారంభం కానున్నట్లు, రెండో వారంలో బడ్జెట్ ప్రవేశపెట్టే అవకాశాలు ఉన్నట్లు తెలిసింది. మార్చి 31 లోగా రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో బడ్జెట్ ను ఆమోదించుకోవాల్సి ఉంటుంది. బడ్జెట్ పై చర్చించడానికి కనీసం 14 రోజుల సమయం పడుతుందని అధికారులు చెప్తున్నారు.
నిజానికి ఫిబ్రవరి చివరివారం నుండే బడ్జెట్ సమావేశాలు నిర్వహించాలని అనుకున్నా, బడ్జెట్ ప్రతిపాదనలపై సమావేశాలు ఇంకా కొనసాగుతుండటంతో మార్చి మొదటివారంలో సమావేశాలు ప్రారంభించాలని నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఇందుకు సంబంధించి నోటిఫికేషన్ ను వారం ముందు ఇవ్వాల్సి ఉంటుందని ఒక అధికారి చెప్పారు. ఇదిలాఉండగా ఏపీ అసెంబ్లీ సమావేశాలు కూడా ఇదే రోజుల్లో జరగనుండటంతో రెండు రాష్ట్రాల అసెంబ్లీ సమావేశాలకు భారీ భద్రత కల్పించడానికి తెలంగాణ రాష్ట్ర పోలీసులు ఏర్పాట్లు చేస్తున్నారు.