ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్న పవన్ కళ్యాణ్ నోరు అదుపులో పెట్టుకోవాలని టీఆర్ఎస్ సిద్ధిపేట ఎమ్మెల్యే అభ్యర్థి హరీష్ రావు మండిపడ్డారు. కేబుల్ వ్యాపారం నిర్వహిస్తున్న సీమాంధ్ర కాంగ్రెస్ నేత బొత్సతో తనకు సంబంధాలు ఉన్నాయని సినీనటుడు పవన్ కళ్యాణ్ ఆరోపించడంపట్ల హరీష్ రావు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఆరోపణలు పూర్తిగా అసత్యమని, నిరాధారమని, వాటికి సంబంధించి 24గంటల్లోగా పవన్ కళ్యాణ్ ఆధారాలు చూపించాలని, లేదంటే పరువునష్టం దావా వేస్తానని వార్నింగ్ ఇచ్చారు.
పవన్ ఆరోపణల్లో ఏ ఒక్కటైనా నిజమని తేలితే ఏ శిక్షకైనా సిద్ధమని, రాజకీయ సన్యాసం తీసుకుంటానని, లేకుంటే పవన్ బహిరంగ క్షమాపణ చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. తమ సహనానికి హద్దు ఉంటుందని, మితిమీరి మాట్లాడుతున్న పవన్ తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని హరీష్ అన్నారు. పవన్ కళ్యాణ్ నోటిని అదుపులో పెట్టుకోవాలని, కేసీఆర్ పై నోరు జారితే తీవ్రపరిణామాలు ఉంటాయని తెలంగాణ మజ్దూర్ యూనియన్ కార్యనిర్వాహక అధ్యక్షుడు థామస్ రెడ్డి హెచ్చరించారు.