తెలంగాణ ఉద్యమంలో 1200మందికిపైగా విద్యార్థులు బలైతే ఏ ఒక్క నేత వారి కుటుంబాలను పరామర్శించలేదని, వీళ్ళంతా అప్పుడు ఎక్కడికి వెళ్ళారని టీఆర్ఎస్ పార్టీ జనరల్ సెక్రెటరీ, రాజ్యసభ సభ్యుడు కే కేశవరావు మండిపడ్డారు. ఆదివారం ఖమ్మం పార్లమెంటు టీఆర్ఎస్ అభ్యర్థి ఎస్ బీ బేగ్, సత్తుపల్లి టీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి పిడమర్తి రవిల గెలుపుకోసం ఖమ్మం, సత్తుపల్లిలలో నిర్వహించిన రోడ్ షోలో కేకే పాల్గొన్నారు.
రోడ్ షోలో పాల్గొన్న కేకే మాట్లాడుతూ, ఓట్లు అడిగే హక్కు టీఆర్ఎస్ పార్టీకే ఉందని, ఆంధ్రా పార్టీల హైకమాండ్ డిల్లీలో ఉందని, టీఆర్ఎస్ కు మాత్రం తెలంగాణ ప్రజలే హైకమాండ్ అని స్పష్టం చేశారు. వేలమంది విద్యార్థులు, యువకులు బలైనా ఇతర పార్టీల నేతలు అమరవీరుల కుటుంబాలను పరామర్శించలేదని, ఉద్యమకారులపై కాంగ్రెస్ ప్రభుత్వం లెక్కలేనన్ని కేసులు పెట్టిందని ఆయన విమర్శించారు.
ప్రజల ఆశయాలకు అనుగుణంగా గ్రామాల అభివృద్దే ధ్యేయంగా పనిచేస్తామని, ఆప్షన్స్ పేరుతో సీమాంధ్రకు చెందిన ఉద్యోగులు ఇక్కడే ఉండిపోతే ఇక మనం తెలంగాణ సాధించింది దేనికని ప్రశ్నించారు. 60 ఏళ్లుగా నీళ్ళు, నిధులు, నియామకాలలో జరిగిన అన్యాయం మళ్ళీ జరక్కుండా న్యాయం పొందేంతవరకు పోరాటం కొనసాగించాల్సిందేనని పేర్కొన్నారు.