శుక్రవారం ఉదయం ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు అధ్యక్షతన జరిగిన రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఇందులో ప్రధానంగా పార్లమెంటరీ కార్యదర్శుల నియామకాలకు రాష్ట్ర మంత్రివర్గం అంగీకారం తెలిపింది. రాజకీయ నాయకత్వ అవసరాలను దృష్టిలో పెట్టుకుని ఆరుగురు పార్లమెంటరీ కార్యదర్శులను నియమించాలని సీఎం ప్రకటించిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. అయితే కొన్ని రాష్ట్రాల్లో కార్యదర్శుల ఎంపిక విషయంలో చట్టపరమైన సమస్యలు ఎదురైనట్లు సమావేశంలో చర్చకు వచ్చిందని సమాచారం. ఎలాంటి చిక్కులు ఉండకుండా ఆర్డినెన్స్ రూపంలో దీనిని తీసుకురావాలని క్యాబినెట్ నిర్ణయం తీసుకుంది.
వరంగల్ లో కాళోజీ నారాయణరావు యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ కు కూడా మంత్రివర్గం ఆమోదం తెలిపింది. రూ. 10 కోట్లతో క్రైస్తవ భవన్ నిర్మాణం, జనవరి 1 న సెలవు దినం ప్రకటించాలని నిర్ణయం తీసుకున్నారు. జనవరి 1న సెలవు కాబట్టి ఫిబ్రవరి నెల రెండవ శనివారం పనిదినంగా నిర్ణయం తీసుకుంటూ జీవోను జారీ చేశారు.