mt_logo

త్వరలో 1 లక్షా ఏడువేల ఉద్యోగాల భర్తీ!

తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ గా ఘంటా చక్రపాణి, సభ్యులుగా తెలంగాణ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు సీ విఠల్, మాజీ ఎమ్మెల్యే చంద్రావతి, ప్రముఖ విద్యావేత్త మతీనుద్దీన్ ఖాద్రీలు గురువారం ఉదయం ప్రమాణ స్వీకారం చేశారు. ఈ కార్యక్రమానికి మంత్రులు ఈటెల, జగదీష్ రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మ, తెలంగాణలోని వివిధ జిల్లాలకు చెందిన యూనివర్సిటీల విద్యార్థులు హాజరయ్యారు.

పదవీ బాధ్యతలు స్వీకరించిన అనంతరం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఘంటా చక్రపాణి మాట్లాడుతూ, రాష్ట్రంలో త్వరలో లక్షా ఏడువేల ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లు జారీ చేస్తామని, నాలుగు నెలల్లో అన్ని పనులు పూర్తిచేస్తామని చెప్పారు. విభజన ప్రక్రియ పూర్తయిన తర్వాత లక్షల సంఖ్యలో కొత్త ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉందని, ప్రతిభకే పట్టం కడతామని, ఉద్యోగాల భర్తీలో ఎలాంటి రాజకీయాలకు ఆస్కారం ఉండబోదని స్పష్టం చేశారు. ‘తాను ఎవరికీ లొంగేవాడిని కాదని, చివరికి ముఖ్యమంత్రి చెప్పినా వినేవాడిని కాదని, అందుకే ఈ పదవి ఇస్తున్నట్లు సీఎం కేసీఆర్ చెప్పారని’ చక్రపాణి అన్నారు.

ఉద్యోగాల నియామకాల్లో ఎలాంటి పైరవీలకు అవకాశం ఉండకుండా చేస్తామని, నియమనిబంధనలు ఎలా ఉండాలో నిర్ణయిస్తామని, పరీక్షల విధి విధానాలపై రెండు, మూడు రోజుల్లో సభ్యులతో సమావేశం ఏర్పాటుచేసి చర్చిస్తామని చక్రపాణి చెప్పారు. ఇకపై రాజకీయ నాయకులు పబ్లిక్ సర్వీస్ కమిషన్ కార్యాలయానికి రావాల్సిన అవసరం లేదని, కేవలం నిరుద్యోగులే రావాలన్నారు. మనం నిజాయితీగా లేకపోతే తెలంగాణ సమాజంలో కూడా నిజాయితీ రాదని, అందుకు అనుగుణంగానే కమిషన్ పని చేస్తుందని వివరించారు.

అనంతరం విఠల్ మాట్లాడుతూ, డబ్బులు ఇస్తేనో, పైరవీలు చేస్తేనో ఉద్యోగాలు వస్తాయన్న ఆరోపణలు ఏపీపీఎస్సీ మీద ఉన్నాయని, ఇకపై అలాంటి వాటికి చోటుండదని, సర్వీస్ కమిషన్ ను ఒక పవిత్ర దేవాలయంగా తీర్చిదిద్దుతామని పేర్కొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *