mt_logo

తండాలమ్మా.. దండాలమ్మా

ఈ రోజు తెలంగాణలో వందలాది మంది గిరిజన ఆడపిల్లలు బతికే ఉన్నారంటే దానికి కారణం రుక్మిణీ రావు. ది వీక్ మ్యాగజైన్ ఈ ఏటి మేటి మహిళగా రుక్మిణీ రావును పరిచయం చేస్తూ రాసిన మాటలివి. అవును.. ఆమె దయార్ద్ర హృదయం గిరిజన ప్రాంతాల్లోని వేల జీవితాల్లో వెలుగు నింపింది. జీవితాల్ని కాపాడడమే కాదు.. కాపాడిన జీవితాలను నిలబెట్టేందుకు పాఠశాల నడిపిస్తోంది. పండుటాకుల గుండెచప్పుడు విన్న ఆమె ఒంటరి మహిళలకు, నిస్సహాయులకు ఆసరాగా నిలిచింది. యాభై ఏళ్లుగా మహిళల హక్కుల కోసం గల్లీ నుంచి ఢిల్లీ దాకా జరిగిన అనేక పోరాటాల్లో రుక్మిణీ రావు పేరు కనిపిస్తూనే ఉంది. గిరిజనుల కోసం తన జీవితాన్ని, కుటుంబాన్నీ త్యాగం చేసిన ఆమె మదర్ థెరిస్సా వారసురాలు కాదు. నల్లగొండలో ఒక గడీని ఏలిన దొర కూతురు అంటే నమ్మగలరా? గడీలనేలిన బిడ్డ తండా ఆడబిడ్డలకు అండదండా ఎలా అయ్యిందో చదవండి.

మార్చి 26, 1972
మహారాష్ట్రలోని చంద్రాపూర్ జిల్లాకు చెందిన మధుర అనే ఒక గిరిజన అమ్మాయిని పోలీసులు కస్టడీలో అత్యాచారం చేశారన్న ఆరోపణలు వచ్చాయి. కేసు కోర్టుకు వెళితే అమ్మాయిదే తప్పని తేల్చింది. మన దేశంలో చాలామంది అమ్మాయిలు ఇలాంటి దుర్భర పరిస్థితులనే ఎదుర్కొంటున్నారు. ఈ విషయమే రుక్మిణీ రావుకు ఆవేదన కలిగించాయి. మహిళల హక్కుల కోసం ఇక ముందడుగు వేయాలనుకుని నుదుట పెద్ద బొట్టు పెట్టుకుంది.

తొలి అడుగు
1970లలో ఢీల్లీకి భవన నిర్మాణ కార్మికులుగా చాలామంది వచ్చి నిజాముద్దీన్ బస్తీలో నివాసం ఏర్పాటు చేసుకున్నారు. రుక్మిణీ రావు తన స్నేహితులతో కలిసి తన ప్రస్థానం ఆ బస్తీ నుంచే మొదలెట్టింది. మహిళలు ఆర్థిక స్వాతంత్య్రం లేకపోవడం వల్లే గృహ హింస ఎదుర్కొంటున్నారని గుర్తించి ఆ బస్తీలోని కొంతమంది మహిళలకు చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునే అవకాశాలు ఏర్పాటు చేసింది. ఆ తర్వాత 1976లో స్త్రీ సంఘర్ష్ సమితిని స్థాపించి తదుపరి కార్యక్రమాలు మొదలెట్టింది. 1979లో మధుర రేప్ కేస్‌లో నిందితులు నిర్దోషులని కోర్టు తీర్పునిచ్చింది. బాధితురాలిని నిందితురాలిని చేయడం తట్టుకోలేని అనేక మహిళా శక్తులు ఢిల్లీలో ఆందోళన చేపట్టాయి. అన్ని మహిళా సంఘాలను ఒక్క తాటి కిందికి తెచ్చేందుకు ప్రయత్నించింది రుక్మిణి. ఆ మహిళా శక్తుల పోరాట ఫలితమే 498(ఎ) చట్టం.

డెక్కన్ వైపు..
రుక్మిణి విప్లవాత్మక స్త్రీవాదం వినిపించడం తన భర్తకు నచ్చలేదు. అందుకే రుక్మిణీ రావు హైదరాబాద్ వచ్చి డెక్కన్ డెవలప్‌మెంట్ సొసైటీలో చేరింది. దక్కన్ ప్రాంతంలోని గిరిజనుల కోసం ఈ సంస్థ పనిచేస్తుండేది. ఒక రోజు ఒక పాపని తల్లిదండ్రులు ఆస్పత్రిలో వదిలేసి వెళ్లారు. తర్వాత ఆరా తీస్తే ఆడపిల్ల కావడమే అందుకు కారణం అని రుక్మిణీ రావుకి తెలిసింది. దాని మీద అధ్యయనం చేసి మూలాలు తెలుసుకునే ప్రయత్నం చేసింది. గిరిజన ప్రాంతాల్లోని లంబాడా, కోయ తెగలవారు ఆడపిల్లల పట్ల భయంతో ఉన్నారని, అవసరానికి అమ్మకానికి పెడుతున్నారని తెలుసుకుంది. గిరిజనులకు వ్యవసాయమే జీవనాధారం. దానికి ఆదరణ తగ్గడంతో ఆర్థిక సమస్యలు ఎదురై ఆడపిల్ల భారంగా మారడం, ఈ సమస్య నల్గొండ జిల్లాలో మరింత ఎక్కువ ఉండడంతో రుక్మిణీ రావు ఆ దిశగా అడుగులు వేసింది.

నల్లగొండలో గ్రామం
ఇక్కడ చిన్న పాపని చంపేయాలనుకుంటున్నారు మేడమ్, మీరే కాపాడాలి నల్గొండలోని ఓ తండాకు చెందిన వ్యక్తి ఫోన్ చేశాడు. అధికారులను అండగా తీసుకెళ్లి కాపాడుదామంటే స్పందన లేదు. ఇక చేసేదేం లేక తానే వెళ్లింది. ఆడపిల్ల పుట్టిందని చంపేందుకే ఎలుకల మందు తెచ్చిపెట్టారు. రుక్మిణి ఆ పాపని కాపాడింది. బిడ్డంటే మాకు ప్రాణం లేదా? కావాలంటే నువ్వు తీసుకెళ్లి పెంచుకో అన్నారు తల్లిదండ్రులు.

దేవరకొండ పక్కన ఒక తండా.. ఒకావిడకు ఏడుగురు అమ్మాయిలు. భర్త తాగుబోతు పైగా ఏ పనీ చేయడు. తాగడానికి డబ్బులివ్వమని రోజూ హింసించేవాడు. డబ్బుల కోసం ఆడపిల్లల్ని అమ్ముదామనుకుంది. నిత్యం వినిపించే ఈ వార్తలే గ్రామ్య స్వచ్ఛంద సంస్థకు ప్రాణం పోశాయి.

ఆడపిల్లల బడి.. ఒడి
నల్లగొండ, ఖమ్మం జిల్లాల్లో ఎక్కువగా జరుగుతున్న ఆడపిల్లల అమ్మకాన్ని వారిలో చైతన్యకాంతులను వెలిగించడానికి, పరుచూరి జమునతో కలిసి గ్రామ్య రిసోర్స్ సెంటర్ ఫర్ వుమెన్ అనే ఫౌండేషన్‌ని ప్రారంభించింది రుక్మిణీ రావు. గ్రామ్య ఫౌండేషన్ ఆడపిల్లలను చేరదీసి ఆలనా పాలనా చూడడం మొదలెట్టింది. అమ్మాయి పుడితే బడికి పంపకుండా పనికి పంపేవారు. అలాంటి అమ్మాయిల్ని చదివించడం కోసం బ్రిడ్జ్ స్కూల్ పెట్టి అందులోనే హాస్టల్ సదుపాయం కల్పించారు. 7వ తరగతి వరకు అందులో చదివించి ఆ తర్వాత గవర్నమెంట్ హాస్టళ్లో చేర్పిస్తారు. తండాల్లో సర్కారు బడి ఉన్న పిల్లల సంఖ్యకు సరిపోయే టీచర్లు ఉండేవారు కాదు. టీచర్లు లేరన్న కారణంతో తల్లిదండ్రులు పిల్లల్ని బడికి పంపేవారు కాదు. దీన్ని ఆపడానికి చందంపేట, దేవరకొండ మండలాల్లోని తండాల్లో 50 ప్రైమరీ లెవల్ స్కూల్స్‌లో అడిషనల్ టీచర్లను నియమించే ప్రయత్నం చేశారు.

గిరిజన మహిళల కోసం..
గిరిజన ప్రాంతాల్లో.. ఒంటరిగా జీవించే మహిళలకు ఉపాధి కల్పించే ప్రయత్నం కూడా చేస్తోంది రుక్మిణీ రావు. ఆడ బిడ్డ పుడితే చంపకండి. సాదుకోండి అంటూ గిరిజనుల్లో చైతన్యం కలిగించేందుకు ఎన్నో కార్యక్రమాలు చేపట్టింది. కొన్నిసార్లు మగవాళ్లు గ్రామ్య సభ్యులను తండాలోకి రానిచ్చేవారు కాదు. క్రమంగా వారిలో మార్పు రావడం ప్రారంభమయింది. ఆడపిల్లలు పుడితే పోషించలేని వారు గ్రామ్య బ్రిడ్జ్ స్కూల్‌కి పంపుతున్నారు. స్థోమత ఉన్నవారు ప్రభుత్వ పాఠశాలలో చదివిస్తున్నారు. ఈ మార్పు రావడానికి రెండు సంవత్సరాల సమయం పట్టింది.

నమస్తే తెలంగాణ సౌజన్యంతో..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *