పాలమూరు పథకాన్ని ఆపాలంటూ ఏపీ సీఎం చంద్రబాబు కేంద్ర జలసంఘానికి లేఖ వ్రాయడంపై పాలమూరు ప్రజలు మండిపడుతున్నారు. జపాన్ పర్యటన ముగించుకుని వస్తూ చంద్రబాబు ఢిల్లీలో ఆగి కేంద్ర జలవనరుల శాఖామంత్రి ఉమాభారతిని కలిసి పాలమూరు పథకంపై ఫిర్యాదు చేయనున్నట్లు వార్తలు రావడంతో జిల్లా ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పాలమూరు పథకంపై చంద్రబాబు కుట్రలకు నిరసనగా గురువారం జిల్లాలో వీధివీధినా బాబు దిష్టి బొమ్మలు దహనం చేశారు. ఎవరు అడ్డుపడ్డా పథకం సాధించి తీరుతామని, కృష్ణమ్మ జలాలు మళ్ళించేందుకు మరో మహోద్యమానికి కూడా తాము సిద్ధమని పలువురు నేతలు ప్రకటించారు. అంతేకాకుండా శుక్రవారం జిల్లా బంద్ కు టీఆర్ఎస్ పార్టీ పిలుపునివ్వగా పలు పార్టీలు, ప్రజా సంఘాలు జిల్లా బంద్ కు మద్దతు తెలిపాయి.
పాలమూరుతో పాటు మూడు జిల్లాల ప్రయోజనం కోసం చేపట్టిన పాలమూరు ఎత్తిపోతల పథకాన్ని అడ్డుకునే ప్రయత్నాలను జిల్లా నేతలు తీవ్రంగా ఖండించారు. మంత్రి జూపల్లి కృష్ణారావు మాట్లాడుతూ తెలంగాణకు ఉన్న వాటాలోంచే ప్రాజెక్టు చేపడుతుంటే ఎవడబ్బ జాగీరు ఉందని చంద్రబాబు లేఖ రాశాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. జిల్లా ప్రజలందరూ ఏకతాటిపైకి వచ్చారని, ప్రాజెక్టును ఏ శక్తి అడ్డుకున్నా తగిన శాస్తి తప్పదని హెచ్చరించారు. ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు నిరంజన్ రెడ్డి మాట్లాడుతూ బాబు సీడబ్ల్యూసీకి రాసిన లేఖలో ఉన్నది సిరా కాదని, అది ఆయన దేహంలోని పచ్చి విషమని మండిపడ్డారు. ప్రజలు కష్టపడి సాధించుకున్న తెలంగాణకు చంద్రబాబు శనిలా దాపురించాడని మంత్రి లక్ష్మారెడ్డి అన్నారు.