mt_logo

నోటికాడి బుక్కను లాగేస్తవా?

పాలమూరు పథకం ఆపాలంటూ ఏపీ సీఎం చంద్రబాబు కేంద్రానికి లేఖ రాయడంపై రాష్ట్ర భారీనీటిపారుదల శాఖామంత్రి హరీష్ రావు మండిపడ్డారు. ప్రాజెక్టు ఆపే ప్రసక్తే లేదని, పాలమూరు పథకానికి అడ్డుపడి లక్షలమంది ప్రజల నోటికాడి బుక్కను ఎత్తగొట్టేందుకు బాబు ప్రయత్నిస్తున్నాడని అన్నారు. గురువారం సాయంత్రం తెలంగాణ భవన్ లో ఎమ్మెల్యేలు ఏనుగు రవీందర్ రెడ్డి, గణేష్ గుప్తా, ప్రభాకర్ లతో కలిసి మీడియా సమావేశంలో మంత్రి హరీష్ రావు మాట్లాడారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఒకవైపు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రెండు కళ్ళు అంటాడు.. చేతల్లో మాత్రం రివర్స్ గేర్. పాలమూరు ప్రాజెక్టును అడ్డుకుంటే పాపం తగుల్తది.. 16 లక్షలమంది వలసపోయిన జిల్లా ఇది. 14 ఏళ్ల వారినుండి 70 ఏళ్ల ముసలివారిదాకా ఎప్పుడు, ఎక్కడ పని దొరుకుతుందా అని అలమటించే జిల్లా.. ఆ కష్టాలు పోవాలని, జిల్లాకు సాగు, తాగునీరు అందించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రయత్నిస్తుంటే, ఆ ప్రాజెక్టును అడ్డుకునేందుకు చంద్రబాబు కుట్రలు పన్నుతున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు.

పాలమూరు ప్రాజెక్టు ఆపాలంటూ ఏపీ సీఎం చంద్రబాబు సెంట్రల్ వాటర్ కమిషన్(సీడబ్ల్యూసీ)కి లేఖ ఫిర్యాదు చేశారని, ఈ ఫిర్యాదుపై వివరణ ఇవ్వాలంటూ ఇటీవలే సీడబ్ల్యూసీ నుండి తెలంగాణ ప్రభుత్వానికి లేఖ వచ్చిందని హరీష్ చెప్పారు. ప్రభుత్వ సలహాదారు, సాగునీటి రంగ నిపుణులు విద్యాసాగర్ రావు ఈ విషయంలో సరైన వివరణ ఇచ్చేందుకు నివేదిక రూపొందిస్తున్నారని, త్వరలోనే సీడబ్ల్యూసీకి వివరణ పంపిస్తామని స్పష్టం చేశారు. తెలంగాణ రాష్ట్రానికి కేటాయించిన 299 టీఎంసీల నీటిని ఎప్పుడైనా, ఎక్కడైనా ఉపయోగించుకోవచ్చంటూ ఇటీవలే కృష్ణా వాటర్ బోర్డు తెలిపింది. మా నీళ్ళు మా ఇష్టం వచ్చినట్లు వినియోగించుకునే అధికారం తెలంగాణ ప్రభుత్వానికి ఉందని హరీష్ తేల్చిచెప్పారు.

చంద్రబాబు మొదటినుండి తెలంగాణకు వ్యతిరేకమేనని, తినే అన్నంలో మట్టిపోసే చంద్రబాబు లాంటి వారికి ఏనాటికైనా ప్రజలు బుద్ధి చెప్తారని హరీష్ అన్నారు. ఉమ్మడి రాజధాని పేరుచెప్పి హైదరాబాద్ లో ఉంటూ సెక్షన్-8 అంటూ కుట్రలు చేశాడని, ఇప్పుడు హైదరాబాద్ కు నీరందించే పాలమూరు పథకం ఆపాలంటూ కేంద్రానికి లేఖ రాశాడన్నారు. ప్రపంచంలో ఎవరైనా తాము బతుకుతున్న నగరం బాగుండాలని కోరుకుంటారు. కానీ తాను ఉంటున్న నగరం బాగుండకూడదని ఆలోచించే వారు ఎవరైనా ఉన్నారంటే అది ఒక్క చంద్రబాబు మాత్రమేనని, బాబు మాటలు తెలుసుకుని ఇక్కడున్న ఆంధ్రులే అతడ్ని తరిమి కొడతారని హరీష్ పేర్కొన్నారు. పాలమూరు ప్రాజెక్టు ఏదో కొత్తదైనట్లు చంద్రబాబు ఆరోపించడం వింతగా ఉందని, వైఎస్ హయాంలోనే ఈ ప్రాజెక్టు సర్వేకు ఆమోదం పొంది కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వంలో ఆగస్టు 8, 2013న జీవో నం. 72 ద్వారా ఆమోదం పొందిందని గుర్తుచేశారు. ఆ జీవోను పంపిస్తాం.. చదువుకొని వాస్తవాలు తెలుసుకోవాలని, ఉమ్మడి రాష్ట్రంలో ఇచ్చిన జీవో చెల్లదనడం దారుణమని హరీష్ రావు అన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *