mt_logo

సీఎం కేసీఆర్ ఒక ఎన్ సైక్లోపీడియా- డీ శ్రీనివాస్

కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి డీ శ్రీనివాస్ తో పాటు కాంగ్రెస్ పార్టీకి చెందిన పలువురు నేతలు, మెదక్ జిల్లాకు చెందిన పలువురు టీడీపీ నేతలు తెలంగాణ భవన్ లో బుధవారం మధ్యాహ్నం రెండు గంటలకు సీఎం కేసీఆర్ సమక్షంలో గులాబీ పార్టీలో చేరారు. ముఖ్యమంత్రి వీరికి గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ మాట్లాడుతూ రాజకీయం కంటే ముందు తెలంగాణ రాష్ట్రం తనను తాను రుజువు చేసుకుని నిలబడాల్సిన అవసరం ఉందని, ఏ చిన్న పొరపాటు జరిగినా తరతరాలకు అన్యాయం జరుగుతుందని హెచ్చరించారు. తిట్టినంత మాత్రాన పెద్దగ కారని, గొప్పతనంతోనే పెద్దగ కావాలని, రాజకీయాలకతీతంగా అందరూ కలిసికట్టుగా ముందుకు నడవాలని సూచించారు. తెలంగాణ అభివృద్ధి కోసమే టీఆర్ఎస్ ప్రభుత్వానికి సపోర్ట్ చేస్తానని ప్రకటించిన డీఎస్ కు సెల్యూట్ చేస్తున్నానని, ఎవరం వెయ్యేండ్లు బతకడానికి ఇక్కడకు రాలేదు.. ఉన్న నాలుగు రోజులు తెలంగాణను ఎట్లా అభివృద్ధి చేసుకోవాలన్నది ముఖ్యమని సీఎం స్పష్టం చేశారు.

డీ శ్రీనివాస్ తో తనకు 30, 35 ఏళ్ల పరిచయం ఉందని, ఇద్దరికీ పదవులు లేనప్పుడు కూడా మిత్రులుగానే ఉన్నామని, డీఎస్ కు పదవి ముఖ్యం కాదన్నారు. రాజకీయ పార్టీలు వేరైనంత మాత్రాన కొట్టుకుంటారా? తెలంగాణపై డీఎస్, నేనూ చాలాసార్లు అభిప్రాయాలను షేర్ చేసుకున్నామని కేసీఆర్ చెప్పారు. తెలంగాణ కోసం సోనియా ముందు డీఎస్ రాజీ పడకుండా కొట్లాడారు.. ఇప్పుడు కేసీఆర్ వెంట ఉండాలని ఆయన ముందుకొస్తుంటే తమ్ముడిలా స్వాగతం పలుకుతున్నానని అన్నారు. ఖచ్చితంగా ఆయన సేవలు తెలంగాణకు, తెలంగాణ ప్రజలకు లాభం చేసేవే.. టీఆర్ఎస్ మంచిగా ముందుకు పోవాలంటే డీఎస్ శక్తియుక్తులు అవసరం.. శీనన్నకు వెల్ కం అని కేసీఆర్ పేర్కొన్నారు.

అనంతరం డీ శ్రీనివాస్ మాట్లాడుతూ 60 ఏళ్ల పోరాటం, యువకుల బలిదానాలతో పోరాడి తెలంగాణ సాధించుకున్నామని, తెచ్చుకున్న తెలంగాణను అభివృద్ధి చేసుకోవలసిన అవసరం ఉందని, బంగారు తెలంగాణ సాధనలో తాను భాగస్వామిని అవుతానని అన్నారు. 2001 లో తెలంగాణ ఉద్యమాన్ని ప్రారంభించి చివరకు తెలంగాణ సాధించి తెచ్చింది సీఎం కేసీఆర్ అని, ప్రజలని ఒకేతాటిపైకి తీసుకురావడం మామూలు విషయం కాదని డీఎస్ అన్నారు. సీఎం కేసీఆర్ కు తెలంగాణలోని అన్ని అంశాలపై పట్టు ఉందని, ఆయనొక ఎన్ సైక్లోపీడియా అని అభివర్ణించారు. తన అంతరాత్మ ప్రబోధం మేరకే కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశానని, ఈ విషయంలో ఎవర్నీ నిందించనని చెప్పారు. పొరుగు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రతి విషయంలో తెలంగాణకు అడ్డుపడుతున్నారని, హైదరాబాద్ లో సెక్షన్-8 అవసరమే లేదని డీఎస్ అన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *