గ్రేటర్ హైదరాబాద్ కు తాజాగా స్వచ్ఛత ఎక్సలెన్సీ అవార్డు దక్కింది. కేంద్ర గృహ నిర్మాణ, పట్టణాభివృద్ధి శాఖ సెక్రటరీ దుర్గాశంకర్ మిశ్రా ఈ అవార్డును జీహెచ్ఎంసీ కమిషనర్ దాన కిషోర్ కు అందజేశారు. 10 లక్షల జనాభా కలిగిన మెట్రో పాలిటన్ సిటీలలో కేవలం హైదరాబాద్ నగరానికి మాత్రమే ఈ పురస్కారం దక్కింది. ఇటీవలే నగరానికి ఓడిఎఫ్ ప్లస్ ప్లస్ ను స్వచ్ఛ భారత మిషన్ ప్రకటించిన విషయం తెలిసిందే. జీహెచ్ఎంసీ కమిషనర్ దాన కిషోర్ ఈరోజు న్యూఢిల్లీ విజ్ఞాన్ భవన్ లో ఈ అవార్డును స్వీకరించారు.
హైదరాబాద్ నగరానికి స్వచ్ఛత ఎక్సలెన్సీ అవార్డు దక్కడం పట్ల నగర మేయర్ బొంతు రామ్మోహన్, డిప్యూటీ మేయర్ బాబా ఫసీయుద్దీన్ హర్షం వ్యక్తం చేశారు. స్వచ్ఛ హైదరాబాద్ కు చేస్తున్న కృషికి గుర్తింపుగా ఈ స్వచ్ఛత ఎక్సలెన్సీ అవార్డు లభించిందని మేయర్ బొంతు రామ్మోహన్ అన్నారు. అవార్డు తీసుకున్న అనంతరం జీహెచ్ఎంసీ కమిషనర్ దాన కిషోర్ మీడియాతో మాట్లాడుతూ పదిరోజుల వ్యవధిలోనే హైదరాబాద్ నగరానికి రెండు గుర్తింపులు లభించడం సంతోషంగా ఉందని, ఇదే స్ఫూర్తితో స్వచ్ఛ సర్వేక్షణ్ 2019లోనూ మంచి ర్యాంకింగ్ ను సాధిస్తామని అన్నారు.