పుల్వామాలో సీఆర్పీఎఫ్ జవాన్లపై దాడిని ముఖ్యమంత్రి శ్రీ కే. చంద్రశేఖర్ రావు తీవ్రంగా ఖండించారు. ఉగ్రవాదుల దాడిలో అనేకమంది జవాన్లు మృతి చెందడంతో పాటు చాలామంది తీవ్ర గాయాలపాలు కావడం పట్ల సీఎం దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. పేలుడులో మృతి చెందిన జవాన్ల కుటుంబాలకు సీఎం కేసీఆర్ ప్రగాఢ సానుభూతి తెలిపారు. కాశ్మీర్ లో జరిగిన ఈ ఉగ్రదాడితో దేశ ప్రజలంతా విషాదంలో మునిగిపోయారు. తాను కూడా తీవ్ర మనస్థాపానికి గురయ్యానని సీఎం ఆవేదన వ్యక్తం చేశారు. ఈ పరిస్థితుల్లో ఈనెల 17న తన పుట్టినరోజు సందర్భంగా ఎలాంటి వేడుకలు జరుపుకోరాదని సీఎం నిర్ణయం తీసుకున్నారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు ఎవ్వరూ కూడా తన పుట్టినరోజు వేడుకలు జరపవద్దని సీఎం కేసీఆర్ అభ్యర్ధించారు.