mt_logo

విభజనతోనే అభివృద్ధిలో వేగం

– రాష్ట్ర విభజనపై రాజమండ్రివాసుల మాట
– కాయకష్టం చేసుకునేవాళ్లం..
– ఒక రాష్ట్రమైతే ఏమిటి? మూడైతే ఏమిటి?
– విభజనతో నష్టం లేదని తేల్చిన మహిళ
– అన్నదమ్ములే విడిపోతున్నారు..
– అన్నవరంలో సగటుజీవి అభిప్రాయం
– నమస్తే ఆత్మీయ రథానికి ఆదరణ
‘విడిపోయి కలిసుందాం.. విభజన వికాసానికే’ అంటూ నమస్తే తెలంగాణ ప్రచురించిన ప్రత్యేక సంచికల 3500 ప్రతులను బుధవారం రాజమండ్రి నగరంలో పంపిణీ చేయగా ప్రజలు సానుకూలంగా స్పందించారు. ప్రధానంగా దేవీచౌక్, శ్యామలరావు థియేటర్, దానయ్యపేట, కోటగుమ్మంతోపాటు ఇతర ప్రాం తాల్లో నమస్తే తెలంగాణ ప్రతులను ప్రజలు పెద్ద ఎత్తున స్వీకరించారు.

రాజమండ్రికి చెందిన నాగేశ్వర్‌రావు నమస్తే తెలంగాణతో మాట్లాడుతూ రాష్ట్ర విభజన జరిగితేనే అభివృద్ధి మరింత వేగవంతమవుతుందని అన్నారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కోసం అవసరమైతే హైదరాబాద్‌కు వచ్చైనా నిరాహార దీక్ష చేయడానికైనా గతంలో సిద్ధపడినట్లు తెలిపారు. కొందరు రాజకీయ నాయకుల ఒత్తిడి వల్లనే తాము ఆగిపోయామని వివరించారు. అయినా సరే తెలంగాణ ప్రజలు తెలంగాణ రాష్ట్రం కోసం గట్టిగా పోరాటం చేయాలని సూచించారు. అక్కడి నుంచి నమస్తే తెలంగాణ ఆత్మీయ రథయాత్ర రాష్ట్ర మంత్రి తోటనర్సింహ ప్రాతినిధ్యం వహిస్తున్న జగ్గంపేటకు చేరుకుంది. అక్కడ దాదాపుగా 500 కాపీలను పంపిణీ చేశారు. అక్కడ నమస్తే వాహనం వద్దకు వచ్చినవారిలో ఎక్కువ మంది ప్రత్యేక తెలంగాణ ఏర్పాటుకు అనుకూలంగా మాట్లాడారు. ఒకరిద్దరు వ్యతిరేకంగా స్పందించినవారూ ఉన్నారు. రాజేశ్వర్‌రావు అనే వ్యక్తి అన్నదమ్ములుగా కలిసి ఉండి, విడిపోతే ఎలా? అని ప్రశ్నించారు.

అయితే అన్నదమ్ములు ఎప్పుడైనా విడిపోవాల్సిందే కదా అని నమస్తే సిబ్బంది సమాధానం ఇవ్వడంతో ఆయన కూడా ఏకీభవించారు. అదే ప్రాంతానికి చెందిన మాణిక్యమ్మ మాట్లాడుతూ తమకు ఎక్కడున్నా ఏమీ కాదని అన్నారు. ఒకటి కాదు, రెండు, మూడు రాష్ట్రాలైనా తమ జీవితాల్లో మార్పేమీ ఉండదని, ఎక్కడైనా తాము కాయకష్టం చేసుకునేవాళ్లమని చెప్పారు. అక్కడి నుంచి ఆత్మీయరథం అన్నవరం చేరుకుంది. అక్కడ దాదాపు 300 నమస్తే తెలంగాణ పత్రిక ప్రతులను పంచిపెట్టారు. ఆ ప్రాంతానికి చెందిన కే రాజు, బుజ్జి స్పందిస్తూ విడిపోయి కలిసి ఉండటమే మేలు అన్నారు. అన్నదమ్ములే విడిపోతుంటారు, రెండు రాష్ట్రాలుగా విడిపోవడంలో తప్పు లేదంటూ పత్రికలోని విషయాలను చదివి వారు తమ అభిప్రాయం వ్యక్తం చేశారు.

అందరూ సామరస్యంగా, ఆప్యాయంగా ఉండేందుకు ఆస్కారం ఏర్పడుతుందన్నారు. రాజకీయ నాయకులు తమ స్వార్ధాల కోసం ప్రజలను తప్పుదోవ పట్టిస్తూ సమైక్యవాదం కోసం రెచ్చ గొట్టే ప్రయత్నాలు చేస్తున్నారన్నారు. అక్కడి నుంచి తుని, పాయకరావుపేట మీదుగా నమస్తే తెలంగాణ ఆత్మీయరథం బుధవారం రాత్రి విశాఖపట్నం చేరుకుంది. ఈ సందర్భంగా దారి పొడవున నమస్తే తెలంగాణ ప్రతులను పంపిణీ చేయగా, స్థానికులు ఎంతో ఆసక్తిగా వాటిని అందుకున్నారు.

జగ్గంపేటలో యువకుడి ఆగ్రహం

జగ్గంపేటలో నమస్తే తెలంగాణ సిబ్బంది కాపీలను పంపిణీ చేస్తుండగా సుమారు 27 ఏళ్ళ వయస్సు గల ఒక యువకుడు ఆగ్రహంతో ఊగిపోయాడు. తెలంగాణ నుంచి ఆంధ్రాలో వచ్చి పంచుతున్నారా? మీకు అంతధైర్యం ఎక్కడిదిరా? హైదరాబాద్‌లో మా వాళ్ళపై దాడులు చేస్తున్నారు.. నమస్తే సిబ్బందిని అడ్డుకోబోయాడు. అయితే హైదరాబాద్‌లో లక్షలాది సీమాంధ్ర కుటుంబాలు ఉంటున్నాయని, తెలంగాణవాదులు ఎవరికీ ఎక్కడా ఎలాంటి హమీ తలపెట్టిన దాఖలాలు లేవని అతనికి సమాధానం ఇచ్చారు.

రాజమండ్రి నగరంలో రాపిడ్ ఇంట్వన్షన్ టీమ్ వాహనంలో యాంటీ గుండా స్కాడ్ పోలీసులు ‘నమస్తే తెలంగాణ’ ఆత్మీయరథానికి రక్షణగా నిలిచారు. ఆవాహనంలో ఆన్‌లైన్ సౌకర్యాలు, లైవ్ టెలికాస్ట్ సౌకర్యం ఉంది. ఆ వాహనం ఎక్కడున్నా కూడా ఆ చుట్టు పక్కల జరుగుతున్న విషయాలన్నీ ఎస్పీ కార్యాలయంలో ఉన్న కంట్రోలింగ్ వ్యవస్థ ద్వారా చూసే వీలుంది. ఈ వాహనంలో ఒక ఎస్సైతో పాటు 8 మంది సిబ్బంది, 24 గంటల పాటు మూడు షిఫ్టుల్లో నిఘావేసి ఉంటారని పోలీసు అధికారి నమస్తే ప్రతినిధికి తెలిపారు.

ఆత్మీయ యాత్రను స్వాగతించాలి

-సినీ దర్శక నిర్మాత ఆర్ నారాయణమూర్తి

హైదరాబాద్: ‘నమస్తే తెలంగాణ’ దినపత్రిక ఆధ్వర్యంలో ఆంధ్రలో చేపట్టిన ఆత్మీయ రథయాత్ర అందరికీ స్ఫూర్తిదాయకమని, ఆహ్వానించదగిన, హర్షించదగిన విషయమని సినీ దర్శక నిర్మాత ఆర్ నారాయణమూర్తి అన్నారు. తెలంగాణ ప్రజల ఆకాంక్షలను, ఉద్యమాన్ని సీమాంధ్ర నాయకులు, పెట్టుబడిదారులు అర్థం చేసుకోవాలన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడాల్సిందేనని సీమాంధ్రలోని ప్రజలు కోరుకుంటున్నారని, కాని కొంతమంది పెట్టుబడిదారులే తెలంగాణకు అడ్డంకిగా మారారని ఆయన ఆరోపించారు. ఆయన బుధవారం ‘టీ మీడియా’తో మాట్లాడుతూ ఆంధ్రలో ఆత్మీయయావూతను చేపట్టిన ‘నమస్తే తెలంగాణ’ సీఎండీ సీఎల్ రాజం, ఎడిటర్ అల్లం నారాయణకు, యాత్రలో ధైర్యంగా పాల్గొంటున్న సిబ్బందికి చేతుపూత్తి నమస్కరిస్తున్నట్లు పేర్కొన్నారు.

ఆత్మీయ యాత్రను అడ్డుకోవడం గర్హనీయం

– ప్రముఖ కవి, గాయకుడు అందెశ్రీ

‘నమస్తే తెలంగాణ’ ఆత్మీయ యాత్రను ఆంధ్రలో కొంతమంది అడ్డుకోవడం పట్ల ప్రముఖ కవి, గాయకుడు అందెశ్రీ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది ప్రజాస్వామ్యానికి సిగ్గుచేటని ఆయన బుధవారం ‘టీ మీడియా’తో వ్యాఖ్యానించారు. తెలంగాణ ప్రజలు కూడా కొంతమంది ఆంధ్రవారిలాగా ఆలోచిస్తే హైదరాబాద్‌లో ఉన్న ఆంధ్ర మీడియా పరిస్థితి ఎలా ఉంటుందో అర్థం చేసుకోవాలన్నారు. తెలంగాణవాళ్లు తలుచుకుంటే ఆంధ్రా టీవీ, దినపవూతికలు ఇక్కడ నడువగలవా? అని ప్రశ్నించారు.

సోనియా తెల్లమ్మా!.. తేటతెల్లం చేయమ్మా!: ‘ఓ సోనియా తెల్లమ్మా! తెలంగాణపై తేటతెల్లం చేయమ్మా!’ అని అంద్శై డిమాండ్ చేశారు. తెలంగాణపై తెల్లమ్మ తేల్చకుంటే రాబోయే విధ్వంసానికి కాంగ్రెస్సే కారణభూతమవుతుందన్నారు. ఉత్తరాఖండ్‌లో గంగమ్మ నది ఉప్పెనలాగే ఉన్నా తెలంగాణ కోసం ప్రజలు కోపాన్ని దిగమింగుతున్నారని అన్నారు. తెలంగాణ ప్రజల కోపాన్ని చవిచూడకముందే నిజాయితీగా తెలంగాణపై తేల్చాలని డిమాండ్ చేశారు. ప్యాకేజీలంటూ లీకేజీలు చేస్తే సహించేదిలేదని హెచ్చరించారు.

ఆత్మీయ రథంపై దాడి యావత్ తెలంగాణపై దాడి

-సీమాంధ్ర పత్రికలు, ఛానళ్లను బహిష్కరించండి
– తెలంగాణ ధూంధాం రసమయి

నమస్తే తెలంగాణ ఆత్మీయ రథయాత్రపై దాడి చేసి సమైక్యవాదులు తెలంగాణవాదులకు మంచి అవకాశాన్ని కల్పించారని తెలంగాణ ధూంధాం వ్యవస్థాపకుడు రసమయి బాలకిషన్ అన్నారు. సీమాంధ్ర పత్రికలు, చానళ్లను బహిష్కరించాలని కోరారు. ఆత్మీయరథంపై దాడి కేవలం నమస్తే తెలంగాణ పత్రికపై జరిగిన దాడి కాదని, యావత్ తెలంగాణపై జరిగిన దాడి అని పేర్కొన్నారు.

 

దాడి అప్రజాస్వామికం: టీఎన్జీవో

తెలుగు ప్రజలు రెండు రాష్ట్రాలతో విడిపోయి కలిసుండాలని ‘నమస్తే తెలంగాణ’ చేపట్టిన ఆత్మీయరథంపై అమలాపురంలో జరిగిన దాడిని టీఎన్జీవో ఖంఢించింది. సామాజిక బాధ్యతతో ‘నమస్తే తెలంగాణ’ చేపట్టిన యాత్రపై దాడిచేయడం అప్రజాస్వామికమని, పత్రికా స్వేచ్ఛపై దాడి అని టీఎన్జీవో అధ్యక్షుడు దేవిప్రసాద్ అన్నారు. బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

 

[నమస్తే తెలంగాణ సౌజన్యంతో]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *