mt_logo

రాష్ట్రంలో విద్యుత్ కొరతలు ఉండవు : తేల్చి చెప్పిన మంత్రి జగదీష్ రెడ్డి

దేశ వ్యాప్తంగా బొగ్గు ఉత్పత్తి పడిపోవడానికి కారణం కేంద్ర ప్రభుత్వం తీసుకున్న అనాలోచిత నిర్ణయాలు మాత్రమే అని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి జ‌గ‌దీశ్ రెడ్డి అన్నారు. రాష్ట్రంలో రెండు వంద‌ల ఏళ్లకు స‌రిప‌డా బొగ్గు నిల్వ‌లు ఉన్నాయని, తెలంగాణ‌లో విద్యుత్ కోత‌ల‌కు ఆస్కార‌మే లేద‌ని మంత్రి తేల్చి చెప్పారు. రాష్ట్రంలో ఎక్కడా ఒక్క నిముషం కూడా ప‌వ‌ర్ క‌ట్ ఉండ‌ద‌న్నారు. తెలంగాణ వ్యాప్తంగా ఉత్పత్తి అవుతున్న విద్యుత్‌ను హైదరాబాద్‌కు స‌ర‌ఫ‌రా చేసేలా, మళ్ళీ హైదరాబాద్ నుండి ఇతర జిల్లాలకు సరఫరా చేసేలా విద్యుత్ వలయం ఏర్పాటు చేశామ‌ని తెలిపారు. హైడల్ పవర్ ఉత్పత్తి కూడా బాగుంద‌న్నారు. శ్రీశైలం, నాగార్జున సాగర్, రామగుండం, భూపాలపల్లి, కొత్తగూడెం, మ‌ణుగూరులో ఉత్పత్తి అవుతున్న విద్యుత్ తెలంగాణకు పూర్తిస్థాయిలో సరిపోతుందని స్ప‌ష్టం చేశారు. గత ఏడాది 16 వేల మెగావాట్ల విద్యుత్ డిమాండ్ అవసరం ఉంటే అంతే మొత్తంలో సరఫరా చేశామని పేర్కొన్నారు. అయితే కేంద్ర ప్రభుత్వం చేస్తున్న చట్టాల వలన భవిష్యత్తులో విద్యుత్ కోతలు వస్తాయేమో కానీ సీఎం కేసీఆర్ ముందుచూపుతో తీసుకున్న నిర్ణయాలతో రాష్ట్రంలో ప్రస్తుతం విద్యుత్ కోతలు లేవన్నారు. ప్రైవేట్ కంపెనీల‌కు విద్యుత్ సంస్థలను ధారాదత్తం చేసేందుకే ఈ బొగ్గు కృత్రిమ కొరత అని నిపుణులు అంటుంటే నిజమే అనిపిస్తుంది. కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతోనే ఇవాళ దేశంలో విద్యుత్ కోతలు సంభ‌వించాయ‌న్నారు. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాల హక్కులను కాలరాయొద్దు అని హితవు పలికారు మంత్రి జ‌గ‌దీశ్ రెడ్డి.

 

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *