mt_logo

ఆరోగ్యలక్ష్మి భేష్… తెలంగాణకు నీతి ఆయోగ్ ప్రశంస

మహిళలు, చిన్నారుల ఆరోగ్య పరిరక్షణే ధ్యేయంగా తెలంగాణ ప్రభుత్వం అమలుచేస్తున్న ఆరోగ్యలక్ష్మి అద్భుత పథకమని నీతి ఆయోగ్‌ ప్రశంసించింది. బాలామృతంతో పాటు, ప్రత్యేక పరిస్థితులు ఉన్న చిన్నారుల కోసం అందజేస్తున్న బాలామృతం కార్యక్రమాన్ని మరే రాష్ట్రంలో లేనివిధంగా తెలంగాణలో అమలు చేస్తున్నారని కొనియాడింది. సమీకృత శిశు అభివృద్ధి కోసం వివిధ రాష్ట్రాల్లో అమలవుతున్న ఉత్తమ పద్ధతులను క్రోడీకరించి ‘వరల్డ్‌ ఫుడ్‌ ప్రోగ్రాం టేక్‌హోం రేషన్‌’ పేరుతో నీతి ఆయోగ్‌ ఇటీవల నివేదికను విడుదల చేసింది. రాష్ట్ర ప్రభుత్వం స్త్రీ, శిశు సంక్షేమశాఖ అంగన్‌వాడీ కేంద్రాల ద్వారా గర్భిణులు, బాలింతలు, 7 నెలల నుంచి ఆరేండ్లలోపు చిన్నారులకు అందజేస్తున్న పౌష్ఠికాహార పంపిణీ విధానం అద్భుతంగా ఉన్నదని ఈ నివేదికలో ప్రశంసించింది. స్త్రీ, శిశు సంక్షేమశాఖ అనుసరిస్తున్న పారదర్శక విధానాల ఫలితంగా నాసిరకం వస్తువుల సేకరణతో పాటు, ఫిర్యాదులు గణనీయంగా తగ్గాయని పేర్కొన్నది. తెలంగాణ ప్రభుత్వం నిరంతర పర్యవేక్షణ, పారదర్శక విధానాల ఫలితంగా పోషకాహార పంపిణీలో ఆర్థిక నష్టాలతో పాటు, అనారోగ్య ముప్పు ను తప్పించడంలో ముందు వరుసలో నిలిచిందని కొనియాడింది. గర్భిణీలు, బాలింతలు, చిన్నారుల ఆరోగ్య పరిరక్షణకు తెలంగాణ ప్రభుత్వం తీసుకొంటున్న చర్యలు ఇతర రాష్ర్టాలకు స్ఫూర్తిగా నిలిచాయని ప్రశంసించింది. అంగన్‌వాడీ కేంద్రాల ద్వారా పంపిణీ చేస్తున్న పౌష్టికాహారానికి అదనపు విలువలను జోడించి తెలంగాణ ప్రభుత్వం పంపిణీ చేస్తున్నదని వివరించింది. జాతీయ పోషకాహార సంస్థ (ఎన్‌ఐఎన్‌) సహకారంతో రూపొందించిన అదనపు పోషక విలువలు గల ఆహారాన్ని ఎంపికచేసిన చిన్నారులకు బాలామృతం ప్లస్‌గా అందిస్తున్న విధానం అనుసరణీయమని కీర్తించింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *